Dairy Farm
-
వీళ్ళు తాగే పాలు ఏ డైరీ నుంచి వస్తాయో తెలుసా...?
-
పాడి పోషణలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి..!
-
ఇలా చేస్తే డైరీ ఫార్మ్ సక్సెస్ అయినట్టే
-
పశువుల ఎంపికే ప్రధానం.. పాడి పరిశ్రమకు పెరుగుతున్న డిమాండ్
-
ఎంబీయే చదివి పాడి రైతుగా.. 40 ఎకరాల కౌలు భూమిలో
పాడి పరిశ్రమ నిర్వహణలో మేటిగా పురస్కారాలు అందుకుంటున్న ఆళ్ల అప్పలనాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంబీఏ చదివినా ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా పాడి పరిశ్రమనే నమ్ముకొని అభివృద్ధి సాధిస్తూ విజయాన్ని తన సొంతం చేసుకున్నారు. శ్రద్ధగా చేస్తే పాడి పరిశ్రమ కౌలు రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుందనడానికి చక్కని ఉదాహరణ అప్పలనాయుడు సోదరుల వ్యవసాయం నిలుస్తోంది. అనకాపల్లి జిల్లా కశింకోట మండల కేంద్రానికి చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అప్పలనాయుడు ఎంబీఎ చదివారు. ఉద్యోగం పట్ల ఆసక్తి చూపలేదు. మరొకరి కింద పని చేయడం సుతరాం ఇష్టపడలేదంటారాయన. 2008లో పశు సంవర్థక శాఖ ద్వారా పశు క్రాంతి పథకం కింద (సగం రాయితీపై) రూ.75 వేల రుణం పొంది, 2 పాడి ఆవులు కొనుగోలు చేసి పాడి రైతుగా స్వయంకృషితో జీవనాన్ని ప్రారంభించారు. ఏ పని చేసినా దీక్షగా చేసే అలవాటున్న అప్పలనాయుడు సత్ఫలితాలు సాధిస్తూ పురోగమించారు. 2012లో పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో 30 శాతం రాయితీపై మినీ డెయిరీ పథకానికి రూ.5 లక్షల రుణం మంజూరైంది. పది పాడి ఆవులను కొనుగోలు చేసి తన సొంత స్థలం అరెకరంలో మినీ డెయిరీ ఏర్పాటు చేశారు. శివకృష్ణ, సత్తిబాబుల సహకారంతో పాలను విక్రయిస్తున్నారు. క్రమేపీ అనుభవం గడిస్తూ పాడి రైతుగా సమృద్ధి సాధించారు. ఇప్పుడు ఆయన డెయిరీ ఫాంలో 52 ఆవులు ఉన్నాయి. రోజుకు 220 లీటర్ల పాలు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. పాతర గడ్డి ఉత్పత్తి ఇలా... పశు పోషణకు, పాల ఉత్పత్తిని పెంపొందించడానికి ఉపయోగపడే నాణ్యమైన పాతర గడ్డి తయారీపై అప్పలనాయుడు సోదరులు దృష్టి సారించారు. 2018లో రూ. కోటి పెట్టుబడితో శిలపరశెట్టి చిట్టెమ్మ భాగస్వామ్యంతో సైలేజ్ యంత్రం (పాతర గడ్డి తయారీ యంత్రం) కొనుగోలు చేశారు. పశు సంవర్థక శాఖ 50% రాయితీ కల్పించింది. మొక్కజొన్న పంట విత్తిన 75 రోజులు దాటాక పాలకంకి స్థాయి (మొక్కజొన్న పొత్తులు గోరు గిల్లితే పాలు వచ్చే దశ)లో ఉన్నప్పుడు మొక్కజొన్న కర్రలను ముక్కలుగా కట్ చేస్తారు. ఆధునిక పాతర గడ్డి యంత్రం ద్వారా నిల్వ కోసం అనుమతించిన మందులు కలిపి గుండ్రటి బేళ్లుగా తయారు చేస్తారు. ఇవి 21 రోజుల తర్వాత అమ్మకానికి సిద్ధమవుతాయి. తక్కువ ధరపై కిలో 6.50కు పాడి రైతులకు అందుబాటులో ఉంచుతారు. ఈ పాతర గడ్డి ఏడాది వరకూ నిల్వ ఉంటుంది. వేసవి కాలంలో పచ్చిగడ్డి అందుబాటులో లేనప్పుడు, ప్రవృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు గ్రాసం కొరత రాకుండా పాతర గడ్డి ఉపయోగపడుతుంది. ఒక్కొక్క పాడి పశువుకు రోజుకి 30 కిలోల వరకు పాతర గడ్డి అవసరం అవుతుంది. ఒక పాడి గేదెకు పాతర గడ్డి మేపితే రూ.210 ఖర్చుతో సరిపోతుంది. ఇది ఉంటే దాణా కూడా వేయాల్సిన పని ఉండదు. రోజుకు ఐదు కిలోల దాణాకు అయ్యే రూ.150 ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ గడ్డి వల్ల అధిక పాల దిగుబడి వస్తుంది. పాతర గడ్డిని అప్పలనాయుడు స్థానికంగానే కాకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి ఆదాయాన్ని సంపాదిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఆయన డెయిరీ ఫాంలో పశుపోషణ, గడ్డి పెంపకం, పాతర గడ్డి తయారీ పనుల్లో రోజూ పది మంది వరకు ఉపాధి పొందుతున్నారు. 40 ఎకరాల్లో పశుగ్రాసం సాగు 40 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని అప్పలనాయుడు మేలు రకాల పచ్చగడ్డి పెంపకాన్ని చేపట్టారు. పాతర గడ్డి తయారీ కోసం మొక్కజొన్నతోపాటు బహుళజాతి, ఆధునిక మేలు జాతి పశుగ్రాసాలు పెంచుతున్నారు. సూపర్ నేపియర్, కొంబో నేపియర్, రెడ్ నేపియర్, 4జి బుల్లెట్ నేపియర్, స్మార్టు నేపియర్ వంటి రకాల గ్రాసం పెంచి సొంతానికి వాడుకోగా మిగిలిన గ్రాసాన్ని రైతులకు టన్ను రూ. 2500కు విక్రయిస్తున్నారు. గడ్డి రకాల పెంపకానికి రైతులకు విత్తన కర్రలు (ముచ్చులు) తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నారు. ఆధునిక పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేష సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా అప్పలనాయుడుకు రెండుసార్లు ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వ పురస్కారాలు దక్కాయి. డా.సీకె రావు ఎండోమెంటు ట్రస్టు తరఫున గత నెలలో విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి చిదిరి అప్పలరాజు చేతుల మీదుగా ఉత్తమ పాడి రైతు బంగారు పతకం, జ్ఞాపికతోపాటు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. 2019లో పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు ’రైతు నేస్తం’ పురస్కారాన్ని హైదరాబాద్‌లో అప్పటి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రస్తుతం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సభ్యునిగా కొనసాగుతున్నారు. – వేగి రామచంద్రరావు, సాక్షి, కశింకోట, అనకాపల్లి జిల్లా కౌలు రైతుల పశుగ్రాసం సాగుకు ‘ఉపాధి’ పథకం వర్తింపజెయ్యాలి ఎంబీఎ చదివినా వ్యవసాయ రంగంలో స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకొని లాభదాయకమైన పాడి అభివృద్ధిపై దృష్టి పెట్టి విజయం వైపు పయనిస్తున్నాను. పది మందికి ఉపాధి కల్పిస్తున్నానన్న సంతృప్తి ఉంది. పాడి ఆవులతో డెయిరీ నిర్వహణ, పాతర గడ్డి తయారీ, మేలు జాతి గడ్డి రకాల పెంపకం చాలా లాభదాయకంగా ఉంది. నెలకు వీటి ద్వారా సుమారు రూ.60 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. పురస్కారాలు అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. పాడి పరిశ్రమ అభివృద్ధికి మున్ముందు మరింత కృషి చేస్తాను. కౌలు రైతుల పశుగ్రాసం సాగుకు ఉపాధి పథకం వర్తింపజేయటం ద్వారాప్రభుత్వం సహాయం అందిస్తే మరింత ప్రోత్సాహకంగా ఉంటుంది. పాడి పరిశ్రమపై మక్కువ ఉన్న యువతకు, రైతులకు శిక్షణతో పాటు ఆర్థిక సహాయం అందించి పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం దోహదపడాలి. – ఆళ్ల అప్పలనాయుడు, అభ్యుదయ పాడి రైతు, కశింకోట, అనకాపల్లి జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
విజయ డెయిరీలో ఏం జరుగుతోంది.. ప్రత్యేక బృందం పరీశీలన!
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమ(విజయ డెయిరీ)లో జరుగుతున్న అక్రమాలపై ఐదుగురు అధికారులు, ఉద్యోగులపై వేటు వేసిన ఉన్నతాధికారులు ప్రత్యేక బృందంతో అధ్యయనం చేయిస్తున్నారు. ఈ బృందంలో రాష్ట్ర జనరల్ మేనేజర్ మల్లయ్య, ఖమ్మం డెయిరీ ప్రత్యేకాధికారి రాజ్‌కుమార్‌తో పాటు గతంలో ఇక్కడ పనిచేసిన మేనేజర్ కోడిరెక్క రవికుమార్ ఉన్నారు. మూడు రోజులుగా వీరు ఖమ్మంలోనే మకాం వేసి అక్రమాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఖమ్మం డెయిరీలో అక్రమాలపై రెండేళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.లక్షల విలువైన వెన్న, రైతులకు విడుదల చేసిన పాల ప్రోత్సాహకాలు కూడా పక్కదారి పట్టించడమే కాక, రెండు జిల్లాల పరిధిలోని బల్‌్కమిల్క్ సెంటర్ల నిర్వహణ, పాడిపశువులు, పనిముట్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఈమేరకు 2021 నవంబర్‌లో రాష్ట్ర సంస్థ రాష్ట్ర పాడి పరిశ్రమల డైరెక్టర్ లక్ష్మీ మంజూషతో పాటు మరో ఇద్దరు అధికారుల బృందం ఇక్కడ విచారణ జరపగా, కొందరు ఉద్యోగులను బదిలీ చేశారు. ఇదే క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మేనేజర్ భరతలక్ష్మి కోర్టును ఆశ్రయించి మళ్లీ ఇక్కడే కొనసాగుతుండగా.. వర్గవిభేదాలు సద్దుమణగలేదు. దీంతో ఉన్నతాధికారులు ఖమ్మం డెయిరీ డీడీ సత్యనారాయణను మాతృసంస్థకు పంపించి, నల్లగొండకు బదిలీ అయిన మేనేజర్ నరేష్, ప్రస్తుతం ఇక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న భరతలక్షి్మతో పాటు ల్యాబ్ అసిస్టెంట్ నాగశ్రీ ప్లాంట్ ఆపరేటర్ మణిని తాజాగా సస్పెండ్ చేశారు. అక్రమాలపై ప్రత్యేక బృందం పరిశీలన ఖమ్మం పాడి పరిశ్రమలో రూ.40 లక్షలకు పైగా జరిగిన అక్రమాలపై జనరల్ మేనేజర్ మల్లయ్య నేతృత్వంలోనే బృందం మూడు రోజులుగా విచారణ చేస్తోంది. రెండేళ్లకు సంబంధించి ప్లాంట్ నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడమే కాక ఇల్లెందు, కొత్తగూడెం సెంటర్లలో తనిఖీ చేశారు. ఇంకా రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తీరుపై విచారణ చేపట్టి, అక్రమాలకు ఎవరు సహకరిస్తున్నారనే అంశంపై ఆరా తీసినట్లు సమాచారం. ఈ బృందంలోని అధికారులు సోమవారం కలెక్టర్ వీ.పీ.గౌతమ్‌ను కలిసి అన్ని అంశాలను వివరించినట్లు తెలిసింది. ఆపై ఉన్నతాధికారులకు ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా విచారణ కోసం ఇంకో కమిటీని నియమించనున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఖమ్మం పాడి పరిశ్రమలో చోటు చేసుకున్న అక్రమాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం. ఆ నివేదిక ఆధారంగా విచారణకు కమిటీని నియమించే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో త్వరలోనే 5 లక్షల లీటర్ల సామర్ద్యం కలిగిన మెగా డెయిరీ ఏర్పాటవుతోంది. ఈ డెయిరీకి రాష్ట్రం నలుమూలల నుంచి పాల సమీకరణ కోసం కృషి చేస్తున్నాం. – మల్లయ్య, జనరల్ మేనేజర్. -
భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారు. వృద్ధాప్యం కారణంగా ఆ వయసులో వచ్చే మోకాళ్లు, నడుము నొప్పులు వారిని తెగ ఇబ్బంది పెడుతంటాయి. ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఓ బామ్మ మాత్రం తాను కాస్త డిఫెరెంట్ అంటోంది. 65 ఏళ్లు దాటిన కూడా వ్యాపారం చేస్తూ ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తోంది. యుక్త వయస్కురాలు చేసినట్లు అన్ని పనులు చేస్తోంది. అసలు ఈ బామ్మ ఎవరు..? ఆ వ్యాపారం ఏంటో అనే వివరాలను తెలుసుకుందాం. ఆ ఆలోచనే.. లక్షల సంపాదనగా మారింది గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా నబానా గ్రామంలో నవాల్బీన్ దల్సంభాయ్ చౌదరి (65). ఈ బామ్మ పెద్దగా చదువుకోలేదు. వయసులో ఉన్నప్పుడు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. కానీ, వయసు అయ్యే కొద్దీ కూలి పని కష్టంగా మారింది. ఇక ఏం పనులు చేసుకోగలం అని ఆలోచించగా ఓ ఐడియా తట్టింది. అదే పాడి పరిశ్రమ పెట్టాలన్న నిర్ణయానికి పునాది వేసింది. అలా 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది దల్సంభాయ్. కాల క్రమేణా ఆ 15 గేదెలు కాస్తా 250కి పైగా విస్తరించాయి. ప్రస్తుతం రోజూ 11 వందల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. దీని ద్వారా ప్రతి నెలా ఆమె 11 లక్షల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. నవాల్బీన్ ఏడాదికి 25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆమె నడుపుతున్న డెయిరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ. లక్షన్నర. మహిళా సాధికారతకు నవాల్బీన్ మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. 60 ఏళ్ల వయసులో కూడా పాల వ్యాపారం విజయవంతంగా సాగిస్తున్న ఈ బామ్మను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చదవండి: సిబిల్ స్కోరు గురించి ఈ విషయాలు తెలియక.. తిప్పలు పడుతున్న ప్రజలు! -
ఇటు పోలీస్ డ్యూటీ.. అటు పాల డెయిరీ
కరీమాబాద్ : ఎప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి వస్తుందో.. తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియని పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్.. ఖాళీ సమయంలో పాల డెయిరీ నిర్వహణలో పాలు పంచుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వరంగల్ గాయత్రీనగర్‌కు చెందిన తోటకూర స్వప్న 2014లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వరంగల్‌లోని మహిళా పోలీస్టేషన్లో పనిచేస్తూ విధుల నుంచి వచ్చాక, వెళ్లే ముందు తమ ఇంట్లో పెంచే పదిహేనుకు పైగా పాడిగేదెల ఆలనాపాలనా చూస్తున్నారు. పాలు పితకడం మొదలు అన్ని పనులు చేయడమే కాకుండా పాలను ప్యాకెట్లలో నింపి తన భర్త సురేష్ ద్వారా ఇంటింటికి చేరవేస్తున్నారు. అంతేకాకుండా ఇద్దరు పిల్లల బాగోగులు చూస్తూ ఆదర్శ మాతృమూర్తిగా తోటకూర స్వప్న నిలుస్తున్నారు. చదవండి: ‘లేడీ సింగాన్ని కాదు.. ఐపీఎస్‌గా వస్తాను’ -
మహిళ రికార్డు.. ఏడాదిలో కోటి సంపాదన
సాక్షి, న్యూఢిల్లీ : సాధించాలనే తపన ఉంటే, ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యం సిద్ధిస్తుందనే మాటను నిజం చేసి చూపించింది గుజరాత్‌కు చెందిన 62 ఏళ్ల ఓ మహిళ. క్షీర విప్లవాన్ని సాధించడం అనేది మాటల్లోనే కాదు, చేతల్లోనూ ఆమె చేసి చూపిస్తోంది. గుజరాత్లో బనస్కాంత జిల్లాలోని నాగానా గ్రామానికి చెందిన నిరక్షరాస్యురాలు అయిన చౌదరి నవల్‌బెన్ దల్సంగ్‌బాయ్(62) ఏడాదిలో రూ. 1కోటి 10లక్షల విలువైన పాలను విక్రయించడం ద్వారా గుజరాత్లో కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ మహిళ వద్ద 80 గేదెలు, 45 ఆవులు ఉన్నాయి. వీటితో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కలిపి సుమారు వెయ్యి లీటర్ల పాలను ఆమె విక్రయిస్తోంది. రెండేళ్లలో నవల్‌బెన్‌కు బనస్కాంత జిల్లాలో 2 లక్ష్మి అవార్డులు, 3 ఉత్తమ పశుపాలక్ అవార్డులు లభించాయి. గాంధీనగర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డులను అందుకున్నారు. నవల్‌బెన్ డెయిరీలో 11 మంది పని చేస్తున్నారు. క్షీర విప్లవానికి తోడ్పడుతున్న ఈ మహిళకు నలుగురు కుమారులు ఉన్నారు. -
చంద్రబాబు హయాంలో పాలరంగాన్ని గాలికొదిలేశారు
-
అది హైదరాబాద్‌లోనే జరిగింది.. ముంబైలో కాదు
సాక్షి, హైదరాబాద్ : ఆగస్టు 19న హైదరాబాద్‌లో డబీర్‌పుర డైరీ ఫాంలో గేదె నుంచి పాలు పిండిన తర్వాత అవే పాలను గ్లాసులో పోసుకొని తాగి.. మళ్లీ అవే ఎంగిలి పాలను అదే గిన్నెలో పోశాడు. గేదెలు నీళ్లు తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో గ్లాసు నీళ్లు ముంచి అపరిశుభ్రంగా ఉన్న నీళ్లను తీసుకొచ్చి మళ్లీ గిన్నెలో కలిపాడు.. దాదాపు 30 సెకన్ల పాటు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పని చేసిన వ్యక్తి పేరు మహ్మద్ సోహైల్ అని చెప్పారు. అయితే ఇది ముంబైలో జరిగిందని.. ఆ వ్యక్తి ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి అంటూ కొందరు వ్యక్తులు ట్విటర్లో తప్పుడు వార్తలు పెట్టారు. అంతేకాదు.. హిందువులు పూజించే ఆవు నుంచి తీసిన పాలను ఎంగిలి చేసి వారి మనోభావాలను దెబ్బతీశాడంటూ పేర్కొన్నారు.అంతేగాక అతను ఆ పని చేస్తున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో నమాజ్‌కు సంబంధించిన పాటను ప్లే చేస్తున్నట్లుగా చూపించారు. దీనిని దాదాపు వెయ్యిసార్లు రీట్వీట్ చేశారు. (ఛీ.. ఇదేం బుద్ధిరా నాయనా) I can hear Naara-E-Takbeer A Muzlim milk seller doing what they have been taught to as per the book. This exclusive weird video must reach the masses who still believe in Ganga-Jamuni Tehzeeb & Bhai-Chaara. Just see the filth which many of us are eating/drinking around us. pic.twitter.com/vSeQYA7n9D — Ashish Jaggi (@AshishJaggi_1) August 19, 2020 అయితే ఇదంతా ఫేక్ అని.. పాలు పిండిన వ్యక్తి ముంబయికి చెందిన ముస్లిం కాదని హైదరాబాద్‌కు చెందిన కొరీనా సువారెస్ అనే న్యూస్ మీటర్ తన కథనంలో చెప్పుకొచ్చింది. నిజానికి ఈ ఘటన హైదరాబాద్‌లోనే చోటుచేసుకుందని.. డబీర్‌పురకు చెందిన గౌస్ అనే వ్యక్తి డైరీఫాం నడుపుతున్నాడు. గౌస్ దగ్గర రాజు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆరోజు వీడియోలో పాలు తాగిన వ్యక్తి రాజు అని పోలీసులు గుర్తించారు. కానీ రాజు పరారీలో ఉండడంతో డైరీ ఫాం నడుపుతున్న గౌస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇదే విషయమై.. డబీర్‌పుర పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడారు. వీడియోలో వైరల్ అయిన వ్యక్తి ముస్లిం వర్గానికి చెందిన వాడు కాదని.. ఈ ఘటన గౌస్ నడుపుతున్న జహంగీర్ డైరీ ఫాంలో చోటుచేసుకుంది. వీడియోలో ఉన్న వ్యక్తి రాజు అని.. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడని సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులు ఆ డైరీ ఫాంను సీజ్ చేశారని.. డైరీ ఫాం నిర్వహిస్తున్న గౌస్‌పై ఐపీసీ 269, సెక్షన్ 272, 273 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముంబైలో జరగలేదని.. హైదరాబాద్‌లోని డబీర్‌పురాలోనే చోటుచేసుకుందని.. ఆ వ్యక్తి ముస్లిం కాదని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. -
250 కోట్లతో మెగా డెయిరీ
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 250 కోట్ల రూపాయల వ్యయంతో మెగా డెయిరీని నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్థ్ధక, మత్స్య, పాడి పరిశ్రమల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం మాసబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో పశుసం వర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల అధికారు లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహిం చారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, శ్రావణ మాసంలో ఈ మెగా డెయిరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. రూ. 18.50 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడిపల్లి లోని 55 ఎకరాల విస్తీర్ణంలో నూతన పశు పరిశోధన కేంద్రం, కృత్రిమ గర్భధారణపై రైతులకు ఆధునిక పద్ధతులలో అవగాహన కల్పించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయా లని నిర్ణయించడం జరిగిందని, దానికి కూడా శ్రావణ మాసంలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఈ కేంద్రం గొర్రెలు, పశుసంపద అభివృద్ధికి తోడ్పడుతుందని, పశువుల గర్భధారణ పరీక్షలలో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో, కృత్రిమ గర్భధారణలో 3వ స్థానంలో నిలిచామని అన్నారు. కులవృత్తులకు చేయూత ఇవ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. గడచిన 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా ఈ రంగాలను పట్టించుకోలేదని మంత్రి తెలిపారు. అన్ని వసతులతో షీప్ మార్కెట్లు సీఎం ప్రత్యేక చొరవ, ఆదేశాలతో గొర్రెల పెంపకం దారులు, పాడి రైతులు, మత్స్యకారుల అభివృద్ధి కోసం వందల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు తలసాని వివరించారు. ముఖ్యమంత్రి మానసపుత్రిక అయిన గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 80 కోట్ల గొర్రెలను పంపిణీ చేయగా, అవి ఇప్పుడు పిల్లలతో కలుపుకొని 2 కోట్లకు చేరాయని చెప్పారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం దేశంలోనే గొప్ప పథకంగా నిలిచిందని అన్నారు. ఇప్పటికే 50 శాతం మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని, మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పారు. జీవాలకు దాణా, మరణించిన జీవాలకు ఇన్‌స్రూ?న్స్ వర్తింపచేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నామని, నాణ్యమైన మాంసాన్ని వినియోగదారులకు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలలో మాంసం దుకాణాలు ఏర్పాటు చేయాలని, మొబైల్ దుకాణాల ద్వారా మాంసం అందించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనానికి ఏర్పాటుచేసిన కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇస్తుందన్నారు. అన్ని వసతులతో కూడిన షీప్ మార్కెట్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే నల్లగొండ, సిద్దిపేట జిల్లాలో మార్కెట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఖమ్మం, వనపర్తిలో ఒక్కోచోట 5 ఎకరాల విస్తీర్ణంలో షీప్ మార్కెట్ల నిర్మాణానికి స్థలాన్ని సేకరించడం జరిగిందని, వాటి నిర్మాణానికిగాను ఒక్కో దానికి రూ. 25 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ సంవత్సరం 24 వేల నీటి వనరులలో 80 కోట్ల చేప పిల్లల విడుదలకు నిర్ణయించామని చెప్పారు. ఆక్వా హబ్ ఏర్పాటులో భాగంగా మిడ్ మానేరు డ్యాం నుండి 10 కిలోమీటర్ల పరిధిలో 62 గ్రామాలలో సర్వే జరిపామని, ఈ సర్వేలో 3,962 మంది మత్స్యకారులు, 259 మంది భూ నిర్వాసితులను గుర్తించినట్లు చెప్పారు. ఇందులో 2,680 మంది మత్స్యకారులు, 42 మంది భూనిర్వాసితులకు చేపలు పట్టుకోవడానికి లైసెన్స్‌లు ఇచ్చినట్లు తెలిపారు. అధికారులు, సిబ్బంది సహకారంతోనే అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. -
దొంగతనం చేసిన మరుసటి రోజే..
వాషింగ్టన్: అమెరికాలోని ఓ డైరీ ఫామ్‌లో దొంగలు పడ్డారు. అయితే రోజు తిరిగేసరికి ఆ దొంగలు ఎత్తుకెళ్లిన మేకపిల్లలను పాకలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. దొంగల మనసు మారడానికి కారణమేంటా అని ఆలోచిస్తున్నారా.! ఎలాగో చదివేయండి.. జూన్ 22న అమెరికాలోని డైరీఫామ్ నుంచి చిన్నచిన్న మేకపిల్లలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో వాటిని పెంచుచుతోన్న డైరీ ఫామ్ నిర్వాహకులు సోషల్ మీడియాలో భావోద్వేగ లేఖ పోస్ట్ చేశారు. "గత రాత్రి కొందరు ఆరు మేక పిల్లలను ఎత్తుకెళ్లారు. అప్పటి నుంచి నేను, నా కొడుకు పిచ్చివాళ్లమైపోయాం. వాటిని మా పిల్లల్లా చూస్తాం. దయచేసి వాటిని తిరిగిచ్చేయండి. వాటికి రెండు నెలల వయసు కూడా లేదు. (మేక, బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్!) అసలే అవి ఆకలిగా ఉన్నాయి, ఇప్పుడింకా ఎంత భయపడుతున్నాయో! మేము వాటిని మిస్సవుతున్నాం. నా పిల్లలు తన స్నేహితులను(పెంపుడు మేకలు) కోరుకుంటున్నారు. వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా తిరిగి ఇచ్చేస్తే మేము ఎక్కడా ఫిర్యాదు చేయమని రాసుకొచ్చింది. అయితే ఇది ఆ దొంగల కంట పడినట్టుంది. ఇది చదివి వారి హృదయం ద్రవించినట్లుంది. వెంటనే మరుసటి రోజు వాటిని ఎక్కడ నుంచి పట్టుకొచ్చారో అక్కడే వదిలేశారు. ఈ విషయాన్ని డైరీ ఫామ్ నిర్వాహకులు "మేకపిల్లలు తిరిగి ఇంటికి వచ్చేశాయ్" అంటూ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిల్లలు వాటిని హత్తుకుని ఆడుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. (మేకలు అమ్మిన వ్యక్తి ఎట్టకేలకు ఇంటికి!) -
పాడి రైతుకు అండ
మెరకముడిదాం: వ్యవసాయంతో పాటు పాడిరైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. పాడి పరిశ్రమను బలోపేతం చేసి రైతుల తో బాటు సంబంధిత పరిశ్రమలకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. అందులో భాగంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన విశాఖ డెయిరీ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా ప్రభావంతో అన్ని వర్గాలతో బాటు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పాడిరైతు లు కుదేలవ్వకూడదన్న ఆశయంతో విశాఖ డెయిరీ ఏడాదికి రెండుసార్లు ఇచ్చే బోనస్‌ను ముందుగానే ఇచ్చి వారిని ఆదుకుంటోంది. సాధారణంగా ఏడాదిలో జనవరి, జూన్‌లో బోనస్ ఇవ్వడం ఆనవాయితీ. 2020కు సంబంధించి జనవరిలో పాడిరైతులకు బోనస్ ఒకసారి, మళ్లీ జూన్‌లో ఇవాల్సినది మూడు నెలల ముందుగానే ఇచ్చేసింది. ఇలా జిల్లాలోని 34 మండలాల్లోగల 63,967 మంది రైతులకు రూ.7.62 కోట్లు బోనస్ చెల్లించింది. జిల్లాలో 1,86,798 లీటర్ల పాలసేకరణ జిల్లాలో 862 పాల సేకరణ కేంద్రాల నుంచి విశాఖ డెయిరీ 1,86,798 లీటర్ల పాలను రోజూ సేకరిస్తోంది. 63,967 వేల మంది పాడిరైతులు పాలు పోస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల్లో అత్యధికంగా పాడి రైతులు పాలు పోస్తున్నారు. ఈ నెల 25న మెరకముడిదాం మండలంలో జరిగిన బోనస్ పంపిణీ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నా యకులు జిల్లాలో డెయిరీ పరిశ్రమను స్థాపించాలని, అభివృద్ధి పనులు చేపట్టాలని విశాఖ డెయిరీ సీఈఓ ఆడారి ఆనందకుమార్‌ను కోరగా దానికి అంగీకరించడంతో పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా పాలు పోస్తున్నాం 20 సంవత్సరాలుగా విశాఖడెయిరీకి పాలు వేస్తున్నాను, అప్పటినుంచి ఇప్పటివరకూ నాకు అన్ని విధాలా తోడ్పడుతోంది. అందరికంటే ఎక్కువ పాలు వేస్తున్నందుకు డెయిరీ యాజమాన్యం బహుమతి కూడా ఇచ్చింది. మేమంతా గతంలో శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా 2012లో గర్భాంలో ఏర్పాటు చేశారు. – చందకసాంబ, రైతు, గర్భాం,మెరకముడిదాం మండలం అభివృద్ధికి తోడ్పడాలి పాడినే ఆధారంగా చేసుకుని జీవిస్తున్న లక్షలాది మంది రైతుల కోసం విశాఖ డెయిరీ ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని విశాఖ డెయిరీ యాజమాన్యాన్ని కోరాం. జిల్లాలో పాడి రైతుల సంక్షేమంతో బాటు ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటుకు చొరవ చూపాలని. చీపురుపల్లి నియోజకవర్గంలోని ఎంతో వెనుకపడి ఉన్న మెరకముడిదాం మండలంలో రైతుల కోసం పరిశ్రమతో బాటు కల్యా ణ మండపాన్ని నిర్మించాలని సీఈఓ ఆనందర్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లాం. దానికి సూత్రప్రాయంగా అంగీకరించారు.– మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త పాడి రైతుల అభ్యున్నతే ధ్యేయం జిల్లాలోని పాడి రైతుల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ నేతల సూచనల మేరకు అవసరమైన చర్యలు చేపడతాం. పశువిత్తనోత్పత్తి యూనిట్ ను చీపురుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం. పాడిరైతుల కోసం మెరకముడిదాం మండలంలో కల్యాణ మండపాన్ని నిర్మిస్తాం. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సూచనలు మేరకు జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడతాం. – ఆడారు ఆనంద్‌కుమార్, సీఈఓ,విశాఖ డెయిరీ, విశాఖపట్టణం -
ఖనిజ లవణ మిశ్రమం ప్రాముఖ్యత
పశువు ఆరోగ్య రక్షణలో, పునరుత్పత్తిలో ఖనిజ లవణాలు ప్రముఖ పాత్రవహిస్తాయి. ఇవి జీవ రసాల(హార్మోన్స్) పని తీరును ప్రభావితం చేసి తద్వారా శరీరంలో జరిగే జీవ చర్యలను నియంత్రిస్తాయి. జీవరసాలు వాటి సామర్థ్యం మేరకు ప్రతిభావంతంగా పని చేయడానికి ఖనిజ లవణాలు అవసరం. ముఖ్యమైన ఖనిజ లవణాలు: 1. కాల్షియం 2. ఫాస్ఫరస్ 3. సోడియం 4. పొటాషియం 5. కాపర్ 6. కోబాల్ట్ 7. మెగ్నీషియం 8. క్లోరిన్ 9. ఐరన్. ఖనిజ లవణాల లోపం ఏర్పడితే పశువు ఎదుగుదల, జీర్ణప్రక్రియ, పునరుత్పత్తి ప్రక్రియలలో సమస్యలు ఏర్పడతాయి. ఖనిజ లవణ మిశ్రమం వాడకం వలన లాభాలు : ♦ దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ♦ పశువులలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది. ♦ పెయ్య పడ్డలు సకాలంలో తొలి ఎదను చూపుతాయి. ♦ పాడి పశువుల పునరుత్పత్తి చక్రం సక్రమంగా జరుగుతుంది. ♦ పాల దిగుబడి పెరుగుతుంది. ♦ చూడి పశువులు ఈనిన తర్వాత పశువులలో మెయ్య దిగడం (ప్రొలాప్స్) లాంటి సమస్యలు ఉండవు. ♦ పశువుల ఈనిన తర్వాత వచ్చే మాయ పడకపోవడం, పాల జ్వరం లాంటి సమస్యలను నివారించవచ్చు. ♦ పశువులు బట్టలు, మట్టి, కాగితాలు లాంటి పదార్థాలు తినటం, మూత్రం తాగడం వంటి దురలవాట్లకు లోనుకావు. ♦ పశువుల చర్మం నిగనిగలాడుతూ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఖనిజ లవణం ఇవ్వవలసిన మోతాదు 1 దూడలకు.. 5–20 గ్రాములు రోజుకు ఒకసారి. 2 పెయ్యలు / పడ్డలకు.. 20–30 గ్రాములు రోజుకు ఒకసారి. 3 పాడి పశువులకు.. 50–60 గ్రాములు రోజుకు ఒకసారి. 4 ఖనిజ లవణాన్ని దాణాతో కలిపి పశువుకు అందించాలి. గమనిక : ప్రతి ఈతకు మధ్య 14–15 నెలల వ్యవధి ఉండేలా పాడి రైతులు జాగ్రత్తపడాలి. పాడి పశువుల నుంచి, వాటి జీవితకాలంలో ఎక్కువ దూడలు, అధిక పాల ఉత్పత్తి పొందేలా శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆర్థికంగా అభివృద్ధి పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
పప్పుజాతి పచ్చి మేతల సాగు ఇలా..
వాణిజ్యపరంగా పాల ఉత్పత్తి బాగుండాలంటే పాడి పశువులకు మేపే పచ్చి మేతలో 3 పాళ్లు ధాన్యపు జాతి పచ్చి మేతలు, ఒక పాలు పప్పు జాతి పచ్చి మేత ఉండాలన్నది నిపుణుల మాట. లూసర్ను: ఆనంద్–2, ఆర్.ఎల్.–52, కాంప్–3, ఆర్.ఎల్–58, సి.ఓ.–1 తదితర రకాల లూసర్న్ రకాలు మేలైన పచ్చిమేత దిగుబడినిస్తాయి. అక్టోబర్ – నవంబర్ మధ్యకాలంలో విత్తుకోవాలి. హెక్టారుకు 20–25 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య 25 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం ఉండాలి. హెక్టారుకు 30 కిలోల నత్రజని, 100 కిలోల పొటాష్ వేయాలి. మొదటి 2–3 నీటి తడులను వారానికి ఒకసారి, ఆ తర్వాత 10–12 రోజులకు ఇవ్వాలి. మొదటి కోత 60 రోజులకు వస్తుంది. తర్వాత ప్రతి 30 రోజులకు ఒకసారి, 8–10 కోతలు వస్తాయి. హెక్టారుకు పచ్చిమేత దిగుబడి 60–80 టన్నులు వస్తుంది. స్టైలో: స్టైలో పశుగ్రాస జాతిలో స్టైలో హమట, స్టైలో గానెన్సిస్, స్టైలో స్కాబ్రా అనే రకాలున్నాయి. వీటిని వర్షాధారంగా జూన్–జూలైలలో, నీటి పారుదల కింద సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో విత్తుకోవాలి. హెక్టారుకు 20–25 కిలోల విత్తనం అవసరం. విత్తనాలు వెదజల్లుతూ, మరీ ఎక్కువ లోతుగా పడకుండా జాగ్రత్తపడాలి. హెక్టారుకు 35 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ వేయాలి. 30 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. స్టైలో పచ్చిమేతలు విత్తిన 75 రోజులకు మొదటి సారి కోతకు వస్తాయి. ప్రతి 50 రోజులకు ఒకసారి 8–10 కోతలు వస్తాయి. హెక్టారుకు ఏడాదికి వర్షాధారంగా 30–35 టన్నులు, నీటిపారుదల ఆధారంగా 50 టన్నుల వరకు పచ్చిమేత దిగుబడి వస్తుంది. అలసంద: పప్పుజాతి పచ్చి మేతల్లో ముఖ్యమైన రకం అలసంద. అలసందలో యు.పి.సి. 5286, ఇ.సి. 4216, ఐ.సి. 4216, రష్యన్ అలసంద, బుందేల్ లోబియా 1,2 రకాలు పశుగ్రాసంగా మేలైనవి. వర్షాధారంగా జూన్–జూలై నెలల్లో, నీటిపారుదల కింద ఫిబ్రవరి – జూన్ మధ్య విత్తుకోవాలి. హెక్టారుకు 30–40 కిలోల విత్తనాలు కావాలి. వరుసల మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండాలి. హెక్టారుకు 20 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ వేయాలి. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా మాగిన పశువుల ఎరువు/ఘనజీవామృతం / వర్మీ కంపోస్టు / జీవామృతంలను మోతాదు మేరకు వేసుకోవాలి. 12–15 రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలి. 60–70 రోజులకు పూత దశలో కోసి పశువులకు మేపుకోవాలి. అలసంద ఒకేసారి కోతకు వస్తుంది. హెక్టారుకు నీటి పారుదల ఉండే 20–30 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. వర్షాధారంగా 10–15 టన్నుల దిగుబడి వస్తుంది. పిల్లి పెసర: పప్పుజాతి పచ్చి మేతగా పిల్లి పెసరను సాగు చేసుకోవచ్చు. శీతాకాలంలో (ఆగస్టు–జనవరి), రబీ పంటగా సాగు చేసుకోవచ్చు. విత్తుకోవడానికి అనువైన సమయం డిసెంబర్ – జనవరి నెలలు. హెక్టారుకు ఏకపంటగా విత్తుకోవడానికి 25–30 కిలోల విత్తనాలు కావాలి. మిశ్రమ పంటగా అయితే 15–20 కిలోల విత్తనాలు అవసరం. హెక్టారుకు 10 బండ్ల మాగిన పశువుల ఎరువుతోపాటు.. విత్తనాలు వేసే ముందు దుక్కిలో 20 కిలోల యూరియా, 30 కిలోల మూరేట్ 60 కిలోల సూపర్ ఫాస్పేట్ వేసుకోవాలి. నీటి తడుల∙అవసరం లేదు. వరి కోసిన తర్వాత భూమిలో ఉండే తేమతోనే పిల్లిపెసర మొలిచి పెరుగుతుంది. మొదటి కోత 50 రోజులకు వస్తుంది. రెండో కోత 45 రోజులకు వస్తుంది. హెక్టారుకు 20–25 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. జనుము: వరి కోసిన తర్వాత అదే పొలంలో మిగిలిన తేమతో సాగు చేసుకోదగిన మరో రకం పప్పుజాతి పచ్చిమేత రకం జనుము. ఫిబ్రవరి, మార్చి, అక్టోబర్ – నవంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. హెక్టారుకు 30–40 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య 10 అంగుళాల దూరం ఉండాలి. దుక్కిలో హెక్టారుకు 12 బండ్ల మాగిన పశువుల ఎరువును చల్లాలి. విత్తనాలు వేసేముందు 22 కిలోల యూరియా, దుక్కిలో 50 కిలోల సూపర్ ఫాస్పేట్, 35 కిలోల మ్యూరేట్ వేసుకోవాలి. వరి కోసిన తర్వాత జనుము వేస్తే అప్పుడున్న తేమతోనే పెరుగుతుంది. పొలంలో విత్తుకుంటే 15–20 రోజులకోసారి నీటి తడి ఇవ్వాలి. 50% పూత దశలో మొదటి కోత కోయాలి. ఒకే కోత వస్తుంది. హెక్టారుకు 25–30 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. -
జీవన ‘కళ’
సాక్షి, అనంతపురం : హలం పట్టి పొలం దున్నే రైతన్న ధ్యేయం ధన సంపాదన కాదు. మనిషికి ఇంత కూడు పెట్టాలనే సామాజిక బాధ్యత. ఆరుగాలం కష్టించి, ఎండనక వాననక, పురుగనక పుట్రనక, పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో తెలియకుండా, ఏటా గుండె దిటువు చేసుకుని మానవాళికి పట్టెడన్నం పెడుతున్న రైతుల దుస్థితి కరువు దెబ్బకు ఛిద్రమైపోయింది. ‘కార్పొరేటు బాబు’ల దెబ్బకు పొలం ముక్కలై పోయింది. పుట్టి పెరిగిన కర్మ భూమినే కన్నబిడ్డగా భావించి ప్రళయ ప్రకృతి, అనైతిక వ్యాపారనీతి లాంటి అనేక విషమ పరిస్థితులను తట్టుకుంటూ పంట సాగు చేసి.. నష్టాలు మూటగట్టుకోలేక పల్లె వదిలి పట్నం బాట పట్టిన రైతు కుటుంబాలు జీవనోపాధికి పడుతున్న ఇక్కట్లకు ప్రతిరూపమే ఈ చిత్రం. ఆమె పేరు కళావతి.. పుట్టిపెరిగిన ఊరిని దశాబ్దాల క్రితమే వదిలి అనంతపురానికి కుటుంబంతో పాటు వచ్చి చేరుకున్నారు. ఇలాంటి తరుణంలో పాడిపోషణ వారికి దిక్కైంది. నగరంలోని భవానీనగర్‌లో నివాసముంటూ గేదెలను పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. నిత్యం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తడకలేరు సమీపంలో రైతులు పండించిన గడ్డిని కొనుగోలు చేసి ఇలా తన భర్త శివారెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి చేరవేస్తుంటారు. పాడి ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇది చదవండి : శ్రమలోనేనా సమానత్వం? -
డెయిరీ పెట్టుకోవటం ఎలా?
పాలకు స్థిరంగా గిరాకీ పెరుగుతూనే ఉంది. అయితే, పాడి పశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు. పశువుల పెంపకంపై ప్రేమ, శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే విజయం తథ్యం. మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చంటున్నారు నిపుణులు.. పాలు, పాల ఉత్పత్తుల అవసరం అనుదినం ప్రతి కుటుంబానికీ ఉంటుంది. పెరుగుతున్న జనాభాతో పాటు పట్టణీకరణ, సగటు కొనుగోలు సామర్థ్యం పెరగడం వల్ల పాలు, పాల ఉత్పత్తులకు క్రమేణా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాడి రైతులతో పాటు, ఔత్సాహికులు, నిరుద్యోగ యువత అధిక పాల సార కలిగిన మేలు జాతి ఆవులు లేదా గేదెలతో పాడి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఎంత మంది చేపట్టినా గిరాకీ పెరుగుతూనే ఉండే రంగం ఇది. అయితే, పాడి పశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు. పశువుల పెంపకంపై ప్రేమ ఉండాలి. శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే విజయం మీ వెంటే ఉంటుంది. మేలు జాతి పాడి పశువుల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆశించిన పాల ఉత్పత్తి పొందినప్పుడే పశుపోషణ లాభదాయకమవుతుంది. డెయిరీని ఏర్పాటు చేయదలచిన వారు గమనించాల్సిన ముఖ్యాంశాలు 1 పాడి పశువుల పెంపకంపై ఆసక్తి – ఆశావహ దృక్పథం, 2 వసతులు – వనరులు, 3 మేలుజాతి పాడి పశువులు, 4 పాడి పశువుల మేపు, 5 ఖర్చు తగ్గింపు, ఉత్పత్తి పెంపు, 6 పశు ఆరోగ్య సంరక్షణ, 7 పునరుత్పత్తి యాజమాన్యం, 8 దూడల పోషణ, 9 శుభ్రమైన పాల ఉత్పత్తి, 10 పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్. పాడి పరిశ్రమను ఎవరెవరు చేపట్టవచ్చు? డెయిరీ ఫారాన్ని సంపన్నులు, నిరుపేదలు, పురుషులు, స్త్రీలు, ప్రగతిశీల రైతులు, విశ్రాంత ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలు, సహకార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు, నిరుద్యోగులు.. ఎవరైనా చేపట్టవచ్చు. పాడి పశువుల పోషణపై ఆసక్తి, వాటిని ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. పాడి పశువుల పెంపకం చేపట్టబోయే ముందు కొన్ని డెయిరీ ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. రెండు నుంచి 10 పాడి పశువుల వరకు నౌకర్లపై ఆధారపడకుండా స్వయంగా రైతు కుటుంబమే నిర్వహించుకునేలా సంసిద్ధులై ఉండాలి. గడ్డి కోయడం దగ్గర నుంచి పాలు పితకడం వరకు అన్ని పనులను నేర్చుకోవాలి. ఒత్తిడులను ఎదుర్కొనే మనో నిబ్బరం కలిగి ఉండాలి. తెలుసుకోవాల్సిన విషయాలు పాడి పరిశ్రమ స్థాపించే ముందు లాభాల బాటలో నడిచే డెయిరీకి స్వయంగా వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును, సమస్యలను క్షుణ్ణంగా, శ్రద్ధగా గమనించాలి. సందేహాలను తీర్చుకోవాలి. వినడం కన్నా చూడటం ద్వారా త్వరగా విషయ పరిజ్ఞానం కలుగుతుంది. కష్టే ఫలి అని పెద్దలు చెప్పినట్లు.. నౌకర్లపై ఆధారపడకుండా, స్వయంగా కష్టపడి, పర్యవేక్షించి, పూర్తి సమయాన్ని వెచ్చించగలిగినప్పుడే విజయం చేకూరుతుంది. కావల్సిన వసతులు పాడి పరిశ్రమను నెలకొల్పే ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు అనేక విషయాలను ఆలోచించాలి. రవాణా సౌకర్యం, రోడ్డు సౌకర్యం, విద్యుత్ సదుపాయం ఎలా ఉందో చూసుకోవాలి. నీటి లభ్యత, బోరు, పశుగ్రాసం పెంపకానికి తగినంత భూమి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవే కాకుండా చుట్టూ కంచె నిర్మించడం, పని వారి లభ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి లభ్యత తగ్గుతుంటే, అవసరం పెరుగుతోంది. ప్రతి సంకరజాతి ఆవు లేదా ముర్రా గేదెకు రోజుకు 75–80 లీటర్ల నీరు అవసరం. వేసవిలో ఇది వంద లీటర్లకు పెరుగుతుంది. ఏడాది పొడవునా పశుగ్రాసం సాగు చేసుకోవడానికి అదనంగా నీరు అవసరం. కాబట్టి, నీటి లభ్యత అనేది అతి ముఖ్యమైన సంగతి. ఎలాంటి పాడి పశువులను కొనుగోలు చేయాలి? పాడి పరిశ్రమను పెట్టాలనుకునే వారు ఆ ప్రాంతంలో ఆవు పాలకు గిరాకీ ఉందా లేదా గేదె పాలకు గిరాకీ ఉందా అనేది ముందుగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. గేదె పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటాయి. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో గేదె పాలకు గిరాకీ ఉంటుంది. 10 ఆవులు, గేదెలకు ఎంత భూమి అవసరం? ఒక్కో గేదె లేదా ఆవుకు 32 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. ప్రతి 5 పాడి పశువులకు పశుగ్రాసాల సాగుకు ఒక ఎకరా భూమి, ఇతర వసతులకు 300 చదరపు గజాల స్థలం అవసరం. 10 ఆవులు లేదా గేదెల పెంపకానికి కనీసం రెండెకరాల భూమి అవసరమవుతుంది. షెడ్డు నిర్మాణానికి, ఇతర అవసరాలకు మరో పది కుంటలు లేదా పావెకరం భూమి అవసరం. సంకర జాతి ఆవులు, గేదెలు ఎక్కడ దొరుకుతాయి? హెచ్.ఎఫ్., జెర్సీ సంకర జాతి ఆవుల్లో పాల సార అధికంగా ఉంటుంది. ఇవి కర్ణాటక, తమిళనాడుల్లోని చింతామణి, కోలార్, బెంగళూరు సబర్బన్ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో దొరుకుతాయి. ఇవి రోజుకు 12 నుంచి 24 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి. వీటి ధర మార్కెట్లో రూ. 65 వేల నుంచి లక్షపైన ధర పలుకుతాయి.గ్రేడెడ్ ముర్రా, ముర్రా అనేవి మేలైన సంకర జాతి గేదెలు. ముర్రా జాతి గేదెలు రోజుకు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి ధర మార్కెట్లో రూ. 75 వేల నుంచి లక్ష పైన పలుకుతాయి. గ్రేడెడ్ ముర్రా గేదెలు భీమవరం, ఉండి, కంకిపాడు, మాచర్ల ప్రాంతాల్లో దొరుకుతాయి. ముర్రా జాతి గేదెలు హరియాణాలోని రోహ్హతక్, గుజరాత్‌లోని మెహసన ప్రాంతాల్లో దొరుకుతాయి. మేలైన పాడి, అనుబంధ వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి? పాడి పశువులను పెంచే రైతులు ఎక్కువగా పాల వ్యాపారానికి పరిమితం అవుతుంటారు. అయితే, పెరుగు, వెన్న, నెయ్యి, క్రీమ్ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మగలిగితే అధికాదాయం పొందవచ్చు. అంతేకాదు.. పేడతో గోబర్ గ్యాస్, వర్మీ కంపోస్టు వంటివి తయారు చేయవచ్చు. పాల శీతలీకరణ, పాల సేకరణ, దూడల పెంపకం చేపట్టవచ్చు. ఎన్ని రకాల పశుగ్రాసాలు పెంచాలి? అనేక రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవడం ద్వారా పోషక లోపం లేకుండా పాడి పశువులను లాభదాయకంగా పెంచుకోవచ్చు. డెయిరీ ఫారం ప్రారంభానికి 2–3 నెలలు ముందు నుంచే పశుగ్రాసాల సాగు చేపట్టాలి. పప్పుజాతి పశుగ్రాసాలు పావు వంతు, ధాన్యపు జాతి పశుగ్రాసాలు ముప్పావు వంతు విస్తీర్ణంలో సాగు చేయాలి. గట్ల వెంబడి పశుగ్రాసంగా పనికి వచ్చే సుబాబుల్, స్టైలో వంటి జాతుల చెట్లు పెంచుకోవాలి. పప్పు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు: 1. ఏక వార్షికాలు: లూసర్న్, బెర్సీమ్. వీటిని సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో నాటుకోవాలి. 2. బహువార్షికాలు: లూసర్న్ కో, సుబాబుల్, హెడ్జ్ లూసర్న్, స్టైలో, జనుము. ధాన్యపు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు: 1. ఏకవార్షికాలు: పిసి–23, ఎస్.ఎస్.జి., జొన్న (మల్టీకట్). 2. బహువార్షికాలు : ఎన్బి–21, కో–4, కో–5, ఎస్ఎన్–ఎపిబిఎన్. వీటిని జూన్–జూలైలలో వర్షాకాలంలో నాటుకోవాలి. చలికాలంలో వీటి ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఎవర్ని సంప్రదించాలి? పాడి పరిశ్రమను స్థాపించదలచిన వారు మొదట బ్యాంకు వారితో, బీమా కంపెనీ వారితో, పశువైద్య నిపుణులతో సంప్రదించి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. పాల వినియోగదారులైన హాస్టళ్లు, హోటళ్లు, ఆసుపత్రులతోపాటు సమీప ప్రాంతాల్లోని సాధారణ పాల వినియోగదారులతో, పాల ఉత్పత్తిదారుల సంఘాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. పశుగ్రాస విత్తనాల విక్రయ కేంద్రాలతోనూ మంచి సంబంధాలను పెంపొందించుకోవాలి. డెయిరీ ఫారం పెట్టే రైతులకు శిక్షణ ఎవరిస్తారు? స్థానిక పశు సంవర్థక శాఖ అధికారులు, వెటర్నరీ విశ్వవిద్యాలయాలతోపాటు జాతీయ డెయిరీ పరిశోధనా సంస్థ– కర్నాల్, జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు – ఆనంద్, భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫెడరేషన్– పుణే వంటి సంస్థలు మేలు జాతి పాడి పశువుల పోషణలో రైతులకు శిక్షణ ఇస్తున్నాయి. పాడి పరిశ్రమలో రికార్డుల నిర్వహణ మేలైన పాడి పశువులను వాణిజ్య స్థాయిలో పెంచి లాభాలు ఆర్జించాలనుకునే వారు కొన్ని వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసుకుంటూ, సమీక్షించుకుంటూ ముందడుగు వేయాలి. మేపు రికార్డులు: పశువులకు ఎంత మేత వేస్తున్నదీ రాసి పెట్టుకోవాలి. ఆరోగ్య సంబంధ రికార్డులు: పశువుల ఆరోగ్య రక్షణకు ఎప్పుడెప్పుడు ఏమేమి మందులు వాడిందీ రాసుకోవాలి. పాల ఉత్పత్తి రికార్డులు: ఒక్కో పశువు రోజుకు ఎన్ని పూటలు, ఎన్నెన్ని పాలు ఇస్తున్నదో రాసుకోవాలి. పునరుత్పత్తి రికార్డులు: ప్రతి పశువు ఎదకు వచ్చిన తేదీ, కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీ, ఈనిన తేదీ తదితర వివరాలను రాసి పెట్టుకోవాలి. ఆర్థిక రికార్డులు: రోజువారీగా రాబడి, ఖర్చుల వివరాలను రాసుకోవాలి. రుణాలు.. సబ్సిడీలు.. మేలైన పాడి పశువుల పెంపకాన్ని ప్రారంభించే బలహీన వర్గాల వారు రుణాలు, సబ్సిడీలపై సమాచారం కోసం దగ్గర్లోని సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలను, సంబంధిత ప్రభుత్వ శాఖలు/కార్పొరేషన్ల అధికారులను సంప్రదించవచ్చు. డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన వంటి సంస్థలను సంప్రదించాలి. జనరల్ అభ్యర్థులు బ్యాంకులను సంప్రదించి రుణం పొందవచ్చు. ప్రాజెక్టు వ్యయంలో 75% బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకొని మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని అత్యంత లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు. పాడి పశువుల ఎంపిక ఎలా? పాడి పశువు త్రికోణాకారంలో ఉండాలి. చురుకైన కళ్లు, మృదువైన చర్మం కలిగి ఉండాలి. పొదుగు నాలుగు భాగాలూ శరీరానికి అతుక్కొని, మృదువుగా, పెద్దవిగా, సమానంగా ఉండాలి. నాలుగు చనుమొనలు సమానంగా ఉండాలి. తొడలు దృఢంగా, కాళ్లు పొట్టిగా ఉండాలి. పొదుగుకు రక్తం సరఫరా చేసే పాల నరం స్పష్టంగా వకరలు తిరిగి ఉండాలి. కడుపు పెద్దదిగా విశాలంగా ఉండాలి. పశువుల షెడ్డు నిర్మించేదెలా? డెయిరీ ఫారం పెట్టాలనుకునే వారు స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు రవాణా, విద్యుత్తు, నీరు లభ్యత, మార్కెటింగ్ సదుపాయాలను దృష్టిలో పెట్టుకోవాలి. పశువుల షెడ్డు తూర్పు పడమర దిశగా గాలి, వెలుతురు ఉండేలా, కాస్త ఎత్తులో నిర్మించుకోవాలి. డెయిరీ ఫారం చుట్టూ పశుగ్రాసానికి అక్కర వచ్చే చెట్లు పెంచాలి. షెడ్డును సులభంగా కడగడానికి నీళ్లు కొట్టే ప్రెషర్ పంపును సమకూర్చుకోవాలి. మేత వృథా కాకుండా చూసుకోవడానికి పచ్చి మేతను ముక్కలు చేసి వేయాలి. -
క్షీర చరిత్ర
గేదె పాలతో పాల పొడిని తయారు చేయడం కురియన్ సాధించిన మొదటి విజయం. ఆవు పాల ఉత్పత్తుల తయారీలో పట్టున్న న్యూజిలాండ్ ఇంజినీర్లు.. గేదె పాలతో పొడిని తయారు చేయడం అసాధ్యమన్నారు. కానీ, మన రైతుల దగ్గర గేదెలే ఎక్కువగా ఉన్నాయి. స్వతహాగా మెకానికల్ ఇంజినీర్ అయిన కురియన్ దేశీయంగానే సాంకేతికతను సహకార రంగంలో అభివృద్ధి చేయడం ద్వారా గేదె పాలతో పొడిని, ఇతర ఉత్పత్తులను తొట్టతొలిగా తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. ‘అముల్’ బ్రాండ్‌ను సృష్టించి గుజరాత్లో సహకార పాడి పరిశ్రమకు గట్టి పునాదులు వేశారు. ఆ స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా రైతుల సహకార డెయిరీలు ఏర్పాటయ్యాయి. మానవ జాతికి అమృత తుల్యమైన తల్లి పాలే మొదటి ఆహారం. మనుషులే కాదు పాలిచ్చే జంతువులన్నిటికీ ఇంతే. అయితే, కాలక్రమంలో పెంపుడు జంతువుల పాలను ఆహారంగా ఉపయోగించడం మనిషి అలవాటు చేసుకున్నాడు. వ్యవసాయం ప్రారంభ దినాల నుంచే సుమారు 11 వేల సంవత్సరాల క్రితం నుంచి, గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెల పాలను మనుషులు ఆహారంగా తీసుకోవడం మొదలైంది. వేదకాలంలోనూ ఆవుపాలకు ప్రాధాన్యం ఉంది. బాస్ ప్రిమిజెనియస్ అనే ఆదిమజాతి పశువులు భారత ఉపఖండంలో 13వ శతాబ్దం వరకూ ఉండేవి. ఆ పురాతన ఆవుల జాతి నుంచే మన దేశీ గోజాతులు వృద్ధి చెందాయన్న అభిప్రాయం ఉంది. సుమేరియన్లు తొలుత పాలు వాడారని మరో అభిప్రాయం ఉంది. పాల ఉత్పత్తులే మన రైతుకు జవజీవాలు ప్రపంచంలో ఏ ఇతరదేశం కన్నా మిన్నగా మన దేశానికి పాడిపరిశ్రమ ప్రాణప్రదమైనది. ఒకటో రెండో ఆవులనో, గేదెలనో పెంచుకునే మన పేద రైతులకు, భూమి లేని గ్రామీణ నిరుపేదలకు పాడి ద్వారా వచ్చే దినసరి ఆదాయం అతి పెద్ద భరోసా. పంటలు పండినా పండకపోయినా రెండు పాడి ఆవులో, గేదెలో ఉంటే చాలు ఇంట్లో తిండికి, పై ఖర్చులకు చేయి చాచాల్సిన అవసరం ఉండదు అనేదే ప్రతి రైతు కుటుంబం అనుభవం. దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది చిన్న రైతులు, పాల సహకార సంఘాలు, చిన్నా చితక పాల వ్యాపారుల సమూహాలు.. వీళ్లందరి కృషి వల్ల మన దేశం పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే కాదు, ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారుగా ఎదిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల జాతీయోత్పత్తిలో పశువుల వాటా 25% ఉండగా, అందులో 67% వాటా పాల నుంచి సమకూరుతోంది. కురియన్ పాల విప్లవం డాక్టర్ వర్గీస్ కురియన్ రైతుల సహకార డెయిరీల ద్వారా పాల విప్లవాన్ని సృష్టించారు. పాల నురగను విప్లవంగా మార్చిన మహనీయుడాయన. 1949లో గుజరాత్లో కైరా జిల్లా ఆనంద్‌లో పాడి పరిశ్రమలో ఇంజినీరుగా పనిలో చేరిన కురియన్ రైతుల కష్టాలు చూసి చలించారు. అప్పట్లోనే పాల్సన్ అనే ప్రైవేటు డెయిరీ కంపెనీ సరైన ధర ఇవ్వకపోవడంతో గుజరాత్ పాడి రైతులు సమ్మె చేశారు. ఈ పూర్వరంగంలోనే కైర జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం 1946లో ఏర్పడింది. దీనిపేరు తదనంతరం ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్(అముల్)గా మారింది. 1955లో ఆనంద్‌లో తొలి అముల్ సహకార డెయిరీ ప్లాంట్ ఏర్పాటైంది. అప్పటి వరకు పాల సేకరణకే పరిమితమైన రైతుల సహకార సంఘం బట్టర్, నెయ్యి, పాల పొడి తయారు చేయడం మొదలుపెట్టింది. అధికారుల జోక్యం లేకుండా పాడి రైతులే స్వతంత్ర విధాన నిర్ణేతలుగా ఉండే సహకార డెయిరీ వ్యవస్థ వేరూనుకునేలా పాటుపడిన కురియన్ దేశవ్యాప్తంగా సహకార పాల విప్లవానికి ఊపిర్లూదారు. గేదె పాలతో ప్రపంచంలోనే తొట్టతొలిగా పాల పొడిని తయారు చేయడం కురియన్ సాధించిన మొదటి విజయం. అప్పటి వరకు ఆవు పాల ఉత్పత్తుల తయారీలో పట్టున్న న్యూజిలాండ్ ఇంజినీర్లు.. గేదె పాలతో పొడిని తయారు చేయడం అసాధ్యమన్నారు. కానీ, మన రైతుల దగ్గర గేదెలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఉన్న గేదెల్లో 57%, ఆవుల్లో 16% మన దేశంలో ఉన్నాయి. స్వతహాగా మెకానికల్ ఇంజినీర్ అయిన కురియన్ దేశీయంగానే సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా గేదె పాలతో పొడిని, ఇతర ఉత్పత్తులను తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడానికి ‘అముల్’ బ్రాండ్‌ను సృష్టించి సహకార పాడి పరిశ్రమకు గట్టి పునాదులు వేశారు. ఆ స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతుల సహకార డెయిరీల ఏర్పాటయ్యాయి. నిర్ణయాధికారం రైతులదే ఈ సహకార సంఘాల్లోని పాడి రైతులకే కాకుండా.. పాలను రైతుల నుంచి వినియోగదారులకు చేర్చే క్రమంలో పనిచేసే వారు లేదా పాలతో వివిధ ఉత్పత్తులు తయారు చేసి అమ్మే లక్షలాది చిన్న వ్యాపారులకు కూడా ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతోంది. ♦ చిన్నతరహా పాల వ్యాపార సంస్థల్లో ప్రతి వంద లీటర్ల పాలు సేకరించి, శుద్ధి చేసి, వివిధ ఉత్పత్తులు తయారు చేసి విక్రయించే క్రమంలో పరిస్థితులను బట్టి 4 నుంచి 17 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించవచ్చని అంచనా. పాలను ప్రాసెస్ చేసి ఆ ప్రాంత వినియోగదారుల అవసరాల మేరకు వివిధ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తుంటారు. ఏ స్థాయి డెయిరీ సంస్థల్లో ప్రాసెసింగ్ జరుగుతుందన్న దాన్ని బట్టి ఎంత మందికి ఉపాధి కల్పించగలమన్నది ఆధారపడి ఉంటుంది. ♦ 1950–51లో కోటి 70 లక్షల టన్నుల పాలు మన దేశంలో ఉత్పత్తయ్యేవి. అయితే, ప్రజల అవసరాలు తీర్చడానికి అవి సరిపోక అప్పట్లో 55 వేల టన్నుల ఆవు పాల పొడిని విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్లం. కురియన్ సారథ్యంలోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(1965) చేపట్టిన ‘ఆపరేషన్ ఫ్లడ్’ పథకం ద్వారా సహకార డెయిరీ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఫలితంగా పాల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించింది. 1998 నాటికి ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి దేశంగా, అత్యధిక సంఖ్యలో పాడి పశువులున్న దేశంగా భారత్ ప్రసిద్ధికెక్కింది. 1,85,903 గ్రామాల్లో పాల సంఘాలు మన దేశంలో ఇప్పుడు 1,85,903 గ్రామాల్లో పాల సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఇందులో 32,000 సంఘాలకు మహిళలే నేతృత్వం వహిస్తున్నారు. పాల ఉత్పత్తి శ్రమలో 70% వరకూ గ్రామీణ మహిళలదే. మన దేశంలో 210 సహకార పాల డెయిరీలు, 9 పెద్ద పాల ఉత్పత్తిదారుల కంపెనీలు ఉన్నాయి. 2017–18 నాటికి మన దేశంలో పాల ఉత్పత్తి 17.64 కోట్ల టన్నులకు పెరిగింది. 2021–22 నాటికి 25.45 కోట్ల టన్నులకు పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామాల్లో రైతులు పాల సంఘాలకు పోసే పాలల్లో 47% పాలను ఆయా గ్రామాల్లోని ప్రజలే వినియోగించుకుంటున్నారు. మిగతా 53% పాలు పాల సహకార డెయిరీలు, ప్రైవేటు డెయిరీల ద్వారా దగ్గర్లోని పట్టణాలు, నగరాలకు సరఫరా అవుతున్నాయి. వినియోగదారులు చెల్లించే ధరలో 70% మొత్తాన్ని పాడి రైతులు పొందుతున్నారు. సహకార డెయిరీల్లో సభ్యులైన పాడి రైతులకు మరో పది శాతం ఎక్కువ లబ్ధి కలుగుతోంది. ♦ 1950లో ప్రతి మనిషి రోజుకు 130 గ్రాముల పాలు అందుబాటులో ఉంటే.. సహకార పాడి పరిశ్రమ పుణ్యమా అని 2018 నాటికి రోజుకు 374 గ్రాముల పాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ సగటు తలసరి పాల లభ్యత రోజుకు 294 గ్రాములకన్నా ఇది 80 గ్రాములు ఎక్కువ కావడం విశేషం. డెయిరీ పరిశ్రమ మొదలైంది ఇలా.. ఐరోపా పారిశ్రామిక విప్లవం(1830) తర్వాత గ్రామాల నుంచి పాలను పట్టణ ప్రాంతాలకు తరలించడానికి రవాణా సదుపాయం ఏర్పడింది. ఆ క్రమంలోనే డెయిరీ పరిశ్రమకు అవసరమైన సాంకేతికతలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. 1860లో నెదర్లాండ్స్‌లో మెకానికల్ కూలర్‌ను కనుగొనడంతో సాంద్ర డెయిరీ పరిశ్రమకు పునాదులు పడ్డాయి. 1864లో ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ లూయిస్ పాశ్చర్ పాల శీతలీకరణ ప్రక్రియను కనుగొన్నాడు. 1880లలోనే అటస్టె గాలిన్ హోమోజెనైజేషన్ను కనుగొన్నాడు. దీంతో స్కిమ్ మిల్క్, లో ఫాట్ మిల్క్ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తుల తయారీ ప్రారంభమైంది. ఈ ఆవిష్కరణల మూలంగా పాల నాణ్యత దెబ్బతినకుండా నిల్వచేయడం, దూర ప్రాంతాలకు తరలించడం సులభమైంది. ఈ విధంగా అంతర్జాతీయంగా పాల ఉత్పత్తుల తయారీ ఒక పరిశ్రమగా రూపుదాల్చింది. పాల ఉత్పత్తిలో మనమే నంబర్ వన్ ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మంది రైతులు పాలను ఉత్పత్తి చేస్తున్నారు. 2018లో ప్రపంచవ్యాప్తంగా 84.32 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తయ్యాయి. ఇందులో మన దేశం వాటా అత్యధికంగా 19%. మన తర్వాత స్థానాల్లో ఐరోపా దేశాల కూటమి(ఈయూ), అమెరికా, చైనా, పాకిస్తాన్, బ్రెజిల్, రష్యా, న్యూజిలాండ్ ఉన్నాయి. అయితే, పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈయూ, న్యూజిలాండ్, అమెరికా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చైనా పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. న్యూజిలాండ్ ఉత్పత్తి చేసే 2.2 కోట్ల టన్నుల పాలలో 1.9 కోట్ల టన్నులను ఎగుమతి చేస్తుంటుంది. పాల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించిన మన దేశంలో 15 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు. వీళ్లంతా ఐదెకరాల లోపు భూములున్న చిన్న, సన్నకారు రైతులే.విదేశాల్లో ఒక్కో రైతుకే వేలాది ఎకరాల భూములుంటాయి. పారిశ్రామిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తుంటారు. అందుకే అక్కడ రైతుల సంఖ్య తక్కువే అయినా దేశ అవసరాలకు పోను మిగులు పాల ఉత్పత్తులు పెద్ద పరిమాణంలో ఉంటాయి. అందువల్ల న్యూజిలాండ్‌లో 12,000 మంది, ఆస్ట్రేలియాలో 6,300 మంది రైతులు మాత్రమే పాల ఉత్పత్తులు తయారుచేస్తున్నప్పటికీ విదేశాలకు పాల ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. కొన్ని చిన్న దేశాలకు మనమూ పాల ఉత్పత్తులను కొంతమేరకు ఎగుమతి చేస్తున్నాం. -
ఆకుల దాణా అదరహో!
అసలే కరువు కాలం. పశువులకు గ్రాసం అందించడం పాడి రైతులు, పశుపోషకులకు కష్టమవుతోంది. వర్షాభావంతో పచ్చి మేత లభ్యత తగ్గిపోయింది. ఎండు మేత (చొప్ప)తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పశువులను రైతులు పోషించలేక తెగనమ్ముకునే స్థితికి వచ్చారు. మేతతోపాటు పోషక విలువలతో కూడిన దాణా కూడా పశువులకు అందిస్తేనే పాల దిగుబడి పెరుగుతుంది, పొట్టేళ్లు/మేకలు కండపుష్టితో చక్కగా పెరుగుతాయి. అయితే, నాణ్యమైన పోషక విలువలున్న దాణాను బజారులో కొనుగోలు చేయడం కూడా రైతులకు ఈ కష్టకాలంలో ఇబ్బందే. ఇటువంటి పరిస్థితుల్లో ఆకుల దాణా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల పప్పుజాతి చెట్ల ఆకులతో రైతులు ఇంటి దగ్గరే ఆకుల దాణా తయారు చేసుకొని పశువులకు పచ్చి/ఎండు మేతతోపాటు మేపుకుంటే పాల దిగుబడి పెంచుకోవచ్చని, పొట్టేళ్లను లాభదాయకంగా పెంచుకోవచ్చని వైఎస్సార్ కడప రూరల్ పశుసంవర్థక శాఖ వైద్యులు డా. జి. ఆర్. రాంబాబు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లైవ్ స్టాక్ డీపీఎం డాక్టర్ నవీన్‌కుమార్‌రెడ్డి సూచిస్తున్నారు. పప్పు జాతి గ్రాసాల్లోను.. పశు గ్రాసపు చెట్లయిన మునగ, అవిసె, సుబాబుల్, సుంకేసుల ఆకులలోను మాంసకృత్తులు(ప్రొటీన్లు) ఎక్కువగా లభిస్తాయి. ఈ ఆకులతో ఇంటి దగ్గరే మంచి పోషక విలువలు కలిగిన ఆకుల దాణాను తయారు చేసుకోవచ్చు. ఆకుల దాణాను రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఆకుల దాణా (మొదటి రకం) తయారీకి కావాల్సిన వస్తువులు: మునగ/అవిసె/ సుబాబుల్/ జమ్మి ఎండు ఆకులు (వీటిలో ఏదైనా ఒక రకంæ లేదా అన్ని రకాల ఆకులు కలిపి) 600 గ్రాములు. ♦ గంజి (అన్నం వార్చినప్పుడు వచ్చే గంజి) దాదాపు అర లీటరు. ♦ ఉప్పు సరిపడేటంత అంటే 15–20 గ్రాములు. ♦ మిరల్ మిక్చర్ (ఎముకల పొడి) 10–15 గ్రాములు. తయారీ విధానం గంజిని గోరు వెచ్చగా చల్లార్చి ఉప్పు, మినరల్ మిక్సర్‌ను కలపాలి. తర్వాత ఎండు ఆకుల పొడిని అందులో వేసి కలిపి ముద్దగా చేసి.. ఏదేని పాలిథిన్ కవర్‌పై వడియాల రూపంలో వేసుకుని బాగా ఎండబెట్టాలి. ఆకుల దాణా (రెండో రకం) తయారీకి కావాల్సిన వస్తువులు: ♦ మునగ /అవిసె/ సుబాబుల్/ జమ్మి ఎండు ఆకులు (వీటిలో ఏదైనా ఒక రకంæ లేదా అన్ని రకాల ఆకులు కలిపి) 600 గ్రాములు. ♦ గోధుమ పిండి 300 గ్రాములు ♦ ఉప్పు దాదాపు 15–20 గ్రాములు తయారీ విధానం గోధుమపిండిని కొంచెం చల్ల నీరు పోసి గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత తగినంత నీటిని మరగబెట్టి (గోధుమ పిండిని ఒకేసారి వేడి నీటిలో కలిపితే ముద్దలు ముద్దలుగా ఉండిపోతాయి) కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేసి కలపాలి. గోరు వెచ్చగా చల్లార్చి నిదానంగా ఉప్పు, ఎముకలపొడి మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత ఎండు ఆకుల పొడిని అందులో వేసి గట్టిగా అయ్యే విధంగా కలిపి ముద్దలుగా చేసుకోవాలి. పాలిథిన్ కవర్‌పై వడియాలు మాదిరిగా వత్తుకొని బాగా ఎండబెట్టుకోవాలి. గమనిక: పై రెండు పద్ధతుల్లో 250 గ్రాముల ముడిబెల్లం తరిగి పెట్టుకొని వేడి దశలో కలిపినట్లయితే ఇంకా బలవర్ధకమైన దాణా తయారవుతుంది. రూ. 20 ఖర్చుతోనే సుమారు 1200 గ్రాముల ఆకుల దాణా తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎలా వాడుకోవాలి? పైవిధంగా తయారు చేసిన ఆకుల దాణా వడలను పెద్ద పశువులకు అయితే వీటిని రోజుకు 2 కిలోల వరకు, దూడలకు అర కిలో వరకు, గొర్రె/మేక పిల్లలకు 100–150 గ్రాములు, పెద్ద పొట్టేళ్లు/మేకలకు 250 గ్రాముల వరకు తినిపించవచ్చు. కొద్దిగా తడిపి లేదా నీటిలో ముంచి తినిపించాలి. ఆకుల దాణాతో ప్రయోజనాలు.. ♦ తక్కువ ధరలో తయారు చేసుకోవచ్చు. కేవలం ఒక గంటలో తయారు చేసుకోవచ్చు. త్వరగా జీర్ణమవుతుంది. ఎన్ని రోజులైనా చెడిపోదు. ♦ పశువులు పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది. సకాలంలో ఎదకు వచ్చి సజావుగా ఈనుతాయి. దూడలకు కూడా మంచి దాణాగా పనికి వస్తుంది. ♦ పొట్టేలు పిల్లలకు మంచి ఆహారం, త్వరగా ఎదుగుదల కనిపిస్తుంది. ఇవిæ బరువు బాగా పెరుగుతాయి. ఎముకల పొడి వలన పశువుల శరీరానికి ఖనిజ లవణాలు అందుతాయి. రక్తహీనతను నివారించవచ్చు. ♦ ఆకుల దాణా తయారు చేసి అమ్మకానికి పెట్టవచ్చు. గ్రామాల్లో కొంత మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ఆకుల దాణాలో పోషక విలువలు ♦ ఆకుల దాణాను గన్నవరం వెటర్నరీ కాలేజీ లాబ్‌లో టెస్ట్ చేయించగా.. ఎండు పదార్థం 80.2 శాతం, ముడి మాంసకృత్తులు 8.59 శాతం, ముడి పీచుపదార్థం 30.3 శాతం ఉన్నట్లు తేలింది. వాడిన రైతులు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతున్నారు. ♦ మునగలో బీటా కెరోటిన్, విటమిన్ సీ, మాంసకృత్తులు, ఇనుము, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ♦ అవిసాకులో క్యాల్షియం, విటమిన్ ఏ, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇరవై గుడ్లు లేదా పది కప్పుల పాలు లేదా అర కిలో మాంసం ద్వారా లభించే క్యాల్షియం ఓ గుప్పెడు అవిసాకుల్లో లభిస్తుంది. ♦ ఇరవై కప్పుల పాలు లేదా ఐదు కిలోల మాంసంలో లభించే విటమిన్–ఏ ఓ గుప్పెడు అవిసాకుల్లో లభిస్తుంది. ఇంకా ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, పిండి పదార్థాలు, మాంసకృత్తులు అవిసాకుల్లో ఉన్నాయి. ♦ గంజి వాడటం వలన ఎక్కువ బలం వస్తుంది. సుబాబుల్/ జమ్మిలలో మాంసకృత్తులు ఎక్కువ శాతంలో లభిస్తాయి. బెల్లం వలన రక్తహీనత నివారణతోపాటు త్వరగా బలం వస్తుంది. (వివరాలకు డా.రాంబాబు–94945 88885)– మాచుపల్లె ప్రభాకరరెడ్డి,సాక్షి, వైఎస్సాఆర్ జిల్లా అగ్రికల్చర్ -
ఫాం కోల్పోయిన మిలటరీ డెయిరీ
హైదరాబాద్: వెయ్యి ఎకరాల విస్తీర్ణం.. వందలాది ఆవుల ‘మంద’హాసం. ఉద్యోగుల ఆలనా‘పాల’నా... 125 ఏళ్లపాటు నిరుపమాన సేవలు... సైనికులకు స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తుల సరఫరా... బలగాలకు అంతులేని బలం.. ఇదీ మిలటరీ డెయిరీ ఫార్మ్ సర్వీసెస్ ఘనమైన గతచరిత్ర. మరిప్పుడో! అది ‘ఫాం’కోల్పోయింది.. చివరికి మూసివేత ‘పాలు’అయింది.. కేవలం 20 ఆవులు మాత్రమే మిగిలాయి. వాటిని కూడా నేడోరేపో తరలించనున్నారు. ఇప్పుడది పశువులులేని కొట్టంలా మారింది. ఒడిసిన ముచ్చట అయింది. వెటర్నరీతో మొదలై... ఈస్టిండియా కంపెనీ తమ సైనిక బలగాలలోని గుర్రాలు, ఒంటెలుసహా ఇతర జంతువుల సంరక్షణ కోసం 1794లో రిమౌంట్, వెటర్నరీ ఫార్మ్స్ సర్వీసెస్ ప్రారంభించింది. సైనికులకు స్వచ్ఛమైన, నాణ్యమైన పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు అందించేందుకు ప్రత్యేకంగా మిలటరీ ఫార్మ్స్ సర్వీసెస్ పేరిట దేశవ్యాప్తంగా 39 మిలటరీ డెయిరీఫామ్‌లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అలహాబాద్‌లో తొలి డెయిరీని నెలకొల్పింది. అదే ఏడాది సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అల్వాల్ (అప్పట్లో కంటోన్మెంట్లో అంతర్భాగం)లో 450 ఎకరాల విస్తీర్ణంలో మిలటరీ డెయిరీ ఫామ్ ఏర్పాటైంది. ఈ ఫామ్‌కు ఓ దాత మరో 550 ఎకరాలు విరాళంగా ఇవ్వడంతో మొత్తం 1,000 ఎకరాలకు విస్తరించింది. నాటి నుంచి సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్ పరిధిలోని సైనిక శిక్షణ కేంద్రాలు, బెటాలియన్లు, ట్రూపులకు పాలు, పాల ఉత్పత్తులను అందిస్తూ వచ్చింది. అయితే, బహిరంగ మార్కెట్లో సరసమైన ధరలకే నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు లభిస్తున్న నేపథ్యంలో డెయిరీఫామ్‌లు కొనసాగించాల్సిన అవసరం లేదని మిలటరీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 2017 ‘మిలటరీ ఫామ్స్ సర్వీసెస్’మూసివేత ప్రక్రియను షురూ చేశారు. చివరగా, తాజాగా సికింద్రాబాద్ డెయిరీఫామ్‌ను మూసివేశారు. ఫామ్‌లోని 498 జెర్సీ ఆవులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు అక్కడ కేవలం 20 ఆవులు మాత్రమే మిగిలాయి. సిబ్బందిని సైతం కొద్దిరోజుల్లో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. దీంతో డెయిరీ ఫామ్ పూర్తిస్థాయిలో కనుమరుగు కానుంది. బస్తీ ఖాళీకి ఆదేశాలు... డెయిరీఫామ్‌లో పనిచేసే శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల కోసం 120 క్వార్టర్లను అధికారులు నిర్మించారు. కాలక్రమేణా ఉద్యోగుల వారసులు సైతం అక్కడే స్థిరపడ్డారు. దీంతో ఇక్కడో బస్తీ వెలిసింది. అయితే, ఈ బస్తీలోని ఇళ్లను వచ్చే నెల పదోతేదీ నాటికి ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించినట్లు స్థానికులు చెప్పారు. కాగా, ఫామ్ ఆవరణలోనూ 170 ఎకరాల్లో జట్రోఫా మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికీ ఇక్కడ బయోడీజిల్ ఉత్పత్తి కొనసాగుతోంది. కార్గిల్ వార్‌లోనూ కీలక పాత్ర ‘వెటర్నరీ, ఫార్మ్స్ సర్వీస్’విభాగం కార్గిల్ యుద్ధంలోనూ సైనికులకు కీలక సేవలు అందించాయి. శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పి ఉండే కార్గిల్ సెక్టార్లో సైనికుల పహారాను కూడా నిలిపివేస్తారు. దీన్ని అదనుగా తీసుకుని పాక్ సైన్యం కార్గిల్‌ను ఆక్రమించింది. అయితే ఈ విషయం స్థానిక పశువుల కాపరుల ద్వారా తెలుసుకున్న భారత ఆర్మీ పాక్ సైనికులను తిప్పి పంపింది. అయితే, మిలటరీ డెయిరీ ఫామ్‌ల మూసివేతలో భాగంగా కార్గిల్ మిలటరీ ఫామ్‌ను సైతం మూసివేశారు. పాడి పరిశ్రమకు మార్గదర్శి పల్లెల్లో కుటుంబ పరిశ్రమగా కొనసాగుతున్న పాలపరిశ్రమను మిలటరీ డెయిరీ ఫామ్స్ వ్యవస్థీకృతం చేశాయి. ఈ డెయిరీ ఫామ్స్ పలు కీలక విజయాలను సొంతం చేసుకున్నాయి. వాటిలో కొన్ని.. - జంతువుల్లో కృత్రిమ గర్భధారణ ప్రక్రియ తొలుత మిలటరీ డెయిరీ ఫామ్‌లలోనే మొదలైంది - దేశంలో డెయిరీ అభివృద్ధికి మార్గదర్శిగా నిలిచింది - ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తో కలిసి సంకర జాతి పశువుల ఉత్పత్తిలో ప్రపంచంలో పెద్దదైన ‘ప్రాజెక్ట్ ఫ్రీస్వాల్’ను విజయవంతంగా కొనసాగించింది. -
హైదరాబాద్ వద్ద వల్లభ డెయిరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలు, పాల పదార్థాల రంగంలో ఉన్న వల్లభ డెయిరీ హైదరాబాద్ సమీపంలో అత్యాధునిక ప్లాంటును నెలకొల్పింది. యాదాద్రి–భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును బుధవారం ఆరంభించింది. రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేయగల సామర్థ్యం ఈ కేంద్రానికుంది. మల్కాపూర్ ప్లాంటుకు రూ. 50 కోట్లు వెచ్చించినట్లు వల్లభ డెయిరీ చైర్మన్, వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఇక్కడి ప్లాంటు నుంచి పాలను సరఫరా చేస్తామని తెలిపారు. ఏపీలో మరో కేంద్రం.. కంపెనీ ఏపీలోని రాజమండ్రి దగ్గరున్న ఎర్నగూడెం వద్ద కొత్తగా తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంటుకు రూ.50 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 2020 జనవరి కల్లా ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ చెబుతోంది. అలాగే 2020 చివరి నాటికి వల్లభ డెయిరీ మహారాష్ట్రలో ఎంట్రీ ఇవ్వనుంది. అక్కడ కూడా రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయగలిగే ప్లాంటును రూ.50 కోట్లతో ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండ, చిత్తూరు జిల్లా కాణిపాకంలో ప్లాంట్లున్నాయి. ఒక్కో కేంద్రం సామర్థ్యం రోజుకు 2 లక్షల లీటర్లు. ఈ రెండు యూనిట్ల కోసం సంస్థ రూ.100 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది రూ.500 కోట్లు..: వల్లభ డెయిరీ పాలతోపాటు నెయ్యి, పెరుగు, మజ్జిగ, పాలతో తయారైన స్వీట్లు, పానీయాలను విక్రయిస్తోంది. కంపెనీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో విస్తరించింది. అటు దక్షిణాదిన చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ అడుగు పెట్టింది. ఈ ఏడాది తమిళనాడు, కర్ణాటకలోని ప్రధాన నగరాలు, పట్టణాలను పూర్తిగా కవర్ చేయాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో 50 చిల్లింగ్ సెంటర్లను వల్లభ డెయిరీ నిర్వహిస్తోంది. త్వరలో మరో 25 చిల్లింగ్ కేంద్రాలు తోడవనున్నాయి. 2018–19లో కంపెనీ రూ.250 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.500 కోట్లు సాధించాలని లకి‡్ష్యంచుకున్నట్లు బ్రహ్మనాయుడు వెల్లడించారు. -
తూటుకాడ మొక్క.. జర జాగ్రత్త
కడప అగ్రికల్చర్ : జిల్లాలో వ్యవసాయం తరువాత పాడి పరిశ్రమ, పశుపోషణపై ఆధారపడి మెజార్టీ కుటుంబాలు జీవిస్తున్నాయి. పాడి పరిశ్రమతో ఆదాయం పొందుతున్నాయి. పాడి పశువులను, సాధారణ పశువులను మేత కోసం పొలాల వద్దకు, చెరువు గట్ల వద్దకు, నీటి కుంటల వద్దకు తోలుకుపోతారు. అయితే అక్కడే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. గడ్డితో పాటు గడ్డి మొక్కగా తూటుకాడ మొక్కలు అధికంగా ఉంటున్నాయి. ఈ మొక్కలను పశువులు గడ్డితో పాటు తినడం వల్ల ప్రమాదం సంభవిస్తుందని కడప నగర పరిధిలోని ఆలంఖాన్‌పల్లె పశువైద్యశాల వైద్యుడు గానుగపెంట రచ్చ రాంబాబు రైతులకు సూచిస్తున్నారు. తూటుకాడ మొక్క ఉపయోగాలు... ♦ మొక్క కాడను పేపరు పరిశ్రమలలో ఎక్కువగా వాడతారు. ♦ ఆకుల్లో మార్సిలిస్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని మూర్ఛవ్యాధిలో మత్తు కలిగించడానికి ఉపయోగిస్తారు. ♦ ఆ మొక్కలోని సపోనిన్లు అనే రసాయనిక పదార్థాలను క్యాన్సర్ తగ్గించే మందుల్లో వాడతారు. ♦ పుండ్లు మానడానికి, మధు మేహం తగ్గించడానికి, రోగ నిరోధక శక్తి మందుల్లో వాడతారు. ♦ పూర్వపు రోజుల్లో వీటి కాడను పొగాకు గొట్టాలుగా వాడేవారు. విష ప్రభావం.. ♦ ముఖ్యంగా విష ప్రభావానికి కారణం లైసర్జిక్ ఆమ్లం. ♦ సాధారణంగా మొక్కలను పశువులు తినవు. కానీ ఒక్కసారి తినడం మొదలుపెడితే అదే అలవాటుగా మారి మత్తు పదార్థానికి బానిసలా మారతాయి. తరువాత మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా తింటాయి. ఆ విధంగా తిన్న 3–4 నెలల్లోపు విషప్రభావం వల్ల చనిపోతాయి. ♦ మేకలు, ఆవులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ♦ బ్రెజిల్ దేశంలో దీన్ని దెయ్యపు మొక్కగా వర్ణిస్తారు. ♦ మొక్కలో సెలీనియం అధికంగా ఉండడం వల్ల ఆల్లకీ వ్యాధి వస్తుంది. ♦ మొక్కలోని స్కేయిన్సోనైస్ పదార్థం వలన తలలోని నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. లక్షణాలు.. ♦ ఎక్కువగా ప్రతిరోజు తింటే లక్షణాలు కనిపిస్తాయి. ♦ కనుగుడ్లు తిరగడం, నోటి నుంచి నురగ కారడం, పారడం వంటివి ఉంటాయి. ♦ తలను అటు ఇటు ఊపుతూ ఉంటాయి. నరాల బలహీనత అధికంగా ఉంటుంది. ♦ మూర్ఛరావడం, మత్తు వచ్చినట్లు ప్రవర్తించడం, నాలుగు కాళ్లు సమన్వయం లేక గిరికీలు కొట్టడం.అలాంటి స్థితిలో కూడా మొక్కను తెస్తే తినడానికి ప్రయత్నిస్తుంది. అంతగా పశువులు దానికి బానిస అవుతాయి. చికిత్స.. ♦ ఆ మొక్కలు ఉండే దగ్గర మేపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ ఇంజక్షన్, అట్రోపిన్ సల్ఫేట్ 0.1 మిల్లీ గ్రాములు/ కేజీ బరువుకు ఇంజక్షన్, మేగుడైన్ 1 మిల్లీలీటరు/10 కేజీల బరువుకు రక్తంలోకి ఇవ్వాలి. ♦ దీనితోపాటు ఇంజక్షన్ , మిథైల్ కొబాలమయిన్ 20 మిల్లీ లీటర్లు, టాబ్లెట్ , గాబపెంటిన్ 1 మిల్లీ గ్రాములు వాడాలి. ♦ ఇంజక్షన్. డీఎన్ఎస్(5శాతం) ఒక లీటరు, ఇంజక్షన్, రింగర్ లాక్టేట్ ఒక లీటరు వాడాలి. ♦ పైవన్నీ 3–4 రోజుల్లో వాడాలి. అంతేగాక పశు వైద్యున్ని సంప్రదించి తప్పక సలహాలను పాటించాలి. హోమియో వైద్యం... ♦ పారఫిన్ లేదా వంట నూనెను తాగించడం వల్ల లేదా నేరుగా పొట్టలోకి ఎక్కించాలి. ♦ వంట బొగ్గును మెత్తగా పాడిచేసి నీటిలోకి కలిపి (5 గ్రాములు లీటరు నీటికి) పెద్ద పశువులకు 5 లీటర్లు, చిన్న పశువులకు అయితే అర్ధ లీటరు తాపించాలి. ♦ 10–12 కోడిగుడ్ల తెల్లసొనను, పావు కిలో పంచదారను లీటరు నీటిలో కలిపి 2 రోజులు తాపించాలి. తూడుకాడ మొక్క ఇది కలుపుమొక్కే... ఇది ఒక రకమైన కలుపు మొక్క. దీనికి సాగే గుణం ఉండడం వలన దీన్ని రబ్బరు మొక్క అని కూడా అంటారు. కాండం మధ్యలో బొంగులాగా ఖాళీ ఉండి, పూలు లేత ఎరుపు, తెలుపు రంగులో ఉంటుంది. ఎక్కువగా నీరు నిలువ ఉన్న వంకలు, వాగులు, చెరువు, కుంటలు, కాలువగట్ల మీద పెరుగుతుంది. వీటిని పశువులు తినడం వల్ల నరాలకు వ్యాధులుసంభవించి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. -
పాల దోపిడీ
జిల్లాలోని పాడి రైతుల కష్టాన్ని ప్రైవేటు డెయిరీలు నిలువునా దోచేస్తున్నాయి. పాలకు గిట్టుబాటు ధర కల్పించడంలో మొండిచేయి చూపుతుండడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వెన్నశాతం పేరుతో తక్కువ ధరలు నిర్ణయిస్తూ మితిమీరిన పాలదోపిడీకి పాల్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు అగ్రికల్చర్: జిల్లాలోని రైతాంగం అధిక శాతం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తోంది. దాదాపు 3.80 లక్షల రైతు కుటుంబాలు పంటల సాగుతోపాటు పాడి ఆవులు, గేదెల పెంపకాన్ని జీవనాధారం చేసుకున్నారు. కరువు పరిస్థితుల్లో పంటలు లేకపోయినా పాడి పరిశ్రమతోనే బతుకు నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం పాడి ఆవులు 9,27,776 ఉండగా, గేదెలు 84,605 ఉన్నాయి. అందులో ప్రస్తుతం పాలు ఇస్తున్న ఆవులు 3.75 లక్షలు, గేదెలు 35 వేల వరకు ఉన్నాయి. వీటిద్వారా రోజుకు 32 లక్షల నుంచి34 లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 21 లక్షల నుంచి 22 లక్షల లీటర్ల వరకు రైతులు విక్రయిస్తున్నారు. పాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో పశువులను, కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలలో అత్యధికంగా ప్రైవేటు డెయిరీలకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు డెయిరీలు పాడి రైతులను నిలువునా దోచుకుంటూ రూ.కోట్లలో కొల్లగొడుతున్నాయి. నిలువు దోపిడీ.. పాడి రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రైవేటు డెయిరీల మోసాలకు అదుపులేకుండా పోతోంది. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రైవేటు డెయిరీలు చేస్తున్న జిమ్మిక్కులతో పాడి రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. లీటరు పాలకు రూ.30కి తక్కువ లేకుండా వస్తేనే కొంతమేర గిట్టుబాటు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేటు డెయిరీలు ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ల ఆధారంగా పాలకు ధర నిర్ణయించడం, వాటిలోనూ ట్యాక్స్‌ల పేరుతో మరికొంత కోత విధిస్తున్నాయి. సాధారణంగా ఎస్ఎన్ఎఫ్ 8.5, ఫ్యాట్ 4.5 మేరకు వస్తే లీటరుకు రూ.30 పైబడి నిర్ణయించాల్సి ఉంది. కానీ రూ.18 నుంచి రూ.24 వరకు మాత్రమే ధరను ఇస్తున్నాయి. ఈ విధంగా తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేసేందుకు రోజుకో ప్రైవేటు డెయిరీ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 49 ప్రైవేటు డెయిరీలు ఉన్నాయి. వీటికి రోజుకు 16 లక్షల నుంచి 17 లక్షల లీటర్ల మేరకు రైతులు పాలను విక్రయిస్తున్నారు. స్వలాభం కోసం సహకారం నిర్వీర్యం.. జిల్లాకే తలమానికంగా నిలిచిన∙సహకార విజయా డెయిరీని చంద్రబాబునాయుడు తన స్వలాభం కోసం నిర్వీర్యం చేశారు. జిల్లావ్యాప్తంగా 5 లక్షల రైతు కుటుంబాలు విజయా డెయిరీకి నిత్యం పాలుపోసి జీవనం సాగిస్తున్నాయి. 2002 ఆగస్టు 31న చంద్రబాబు తన సొంత హెరిటేజ్ డెయిరీ అభివృద్ధి కోసం విజయా డెయిరీని నష్టాలను సాకుగా చూపెట్టి మూయించి వేశారు. జిల్లాలోని పాడి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసి తన హెరిటేజ్ డెయిరీకి మళ్లించుకున్నారు. 2014లో తిరిగి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక పాడి రైతుల కష్టాలు మరింతగా పెరిగాయి. హెరిటేజ్ డెయిరీలో దోపిడీకి అంతే లేకుండా పోతోంది. ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్ల పేరుతో లీటరు ఆవు పాలకు రూ.18 నుంచి రూ.22 వరకు, గేదెపాలు లీటరుకు రూ.26 నుంచి రూ.28 వరకు మాత్రమే ఇస్తూ నిట్టనిలువునా దోచేస్తోంది. వైఎస్సార్ చొరవతో.. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్.రాజశేఖరరెడ్డి పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 2006లో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ)లను ఏర్పాటు చేశారు. పాలకు గిట్టుబాటు ధర రావడంతో రైతులు మళ్లీ పాడి పరిశ్రమపై ఉత్సాహం చూపారు. జిల్లా వ్యాప్తంగా 94 బీఎంసీల మేరకు వెలిశాయి. ఈ పాలశీతలీకరణ కేంద్రాల ద్వారా రోజుకు 2.36 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఇక్కడ పాలుపోసే వారికి ఆవు పాలకు లీటరుకు రూ.25 నుంచి రూ.29 వరకు, గేదెపాలకు లీటరుకు రూ.32 నుంచి రూ.40 వరకు ఇస్తున్నారు. దీంతో పాలశీతలీకరణ కేంద్రాలకు పాలుపోసే పాడి రైతులకు మాత్రం కొంత ఊరట కలుగుతోంది. -
‘డెయిరీ’ ముసుగులో క ల్తీ నెయ్యి తయారీ
► సితార అగ్మార్క్ పేరుతో విక్రయం ► ‘వెంకటేశ్వర డెయిరీ ఫామ్’పై ► టాస్క్‌ఫోర్స్ దాడి ► ఇద్దరి అరెస్ట్, 930 లీటర్లు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: డెయిరీ ఫామ్ ముసుగులో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ఓ కేంద్రం గుట్టును ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి భారీగా కల్తీ నెయ్యి, తయారీకి ఉపకరించే పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట మహంకాళి తోట ప్రాంతానికి చెందిన గాజుల నటరాజ్ కార్ఖానాలో వెంకటేశ్వర డెయిరీ ఫామ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. డెయిరీ ఉత్పత్తుల తయారీ కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న ఇతను కల్తీ నెయ్యి తయారీకి తెరలేపాడు. పామాయిల్, వనస్పతి, క్రీమ్‌లు కలిపి నెయ్యిని తయారు చేసి ‘సితార అగ్మార్క్’ పేరుతో విక్రయిస్తున్నాడు. తన డ్రైవర్ జోజిబాబు ద్వారా కల్తీ నెయ్యిని దుకాణాలకు సరఫరా చేయిస్తున్నాడు. వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా మారే ఈ దందాపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ కె.నరేష్ గౌడ్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలో ఎస్సైలు ఎ.సుధాకర్, కె.శివ తమ బృందాలతో దాడి చేసి నటరాజ్, జోజిబాబుల్ని అరెస్టు చేశారు. 930 లీటర్ల కల్తీ నెయ్యి, 700 లీటర్ల క్రీమ్, 92 లీటర్ల పామాయిల్, 10 లీటర్ల వనస్పతి తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సైదాబాద్ పోలీసులకు అప్పగించారు.