గేదె పాలతో పాల పొడిని తయారు చేయడం కురియన్ సాధించిన మొదటి విజయం. ఆవు పాల ఉత్పత్తుల తయారీలో పట్టున్న న్యూజిలాండ్ ఇంజినీర్లు.. గేదె పాలతో పొడిని తయారు చేయడం అసాధ్యమన్నారు. కానీ, మన రైతుల దగ్గర గేదెలే ఎక్కువగా ఉన్నాయి. స్వతహాగా మెకానికల్ ఇంజినీర్ అయిన కురియన్ దేశీయంగానే సాంకేతికతను సహకార రంగంలో అభివృద్ధి చేయడం ద్వారా గేదె పాలతో పొడిని, ఇతర ఉత్పత్తులను తొట్టతొలిగా తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. ‘అముల్’ బ్రాండ్‌ను సృష్టించి గుజరాత్‌లో సహకార పాడి పరిశ్రమకు గట్టి పునాదులు వేశారు. ఆ స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా రైతుల సహకార డెయిరీలు ఏర్పాటయ్యాయి.
మానవ జాతికి అమృత తుల్యమైన తల్లి పాలే మొదటి ఆహారం. మనుషులే కాదు పాలిచ్చే జంతువులన్నిటికీ ఇంతే. అయితే, కాలక్రమంలో పెంపుడు జంతువుల పాలను ఆహారంగా ఉపయోగించడం మనిషి అలవాటు చేసుకున్నాడు. వ్యవసాయం ప్రారంభ దినాల నుంచే సుమారు 11 వేల సంవత్సరాల క్రితం నుంచి, గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెల పాలను మనుషులు ఆహారంగా తీసుకోవడం మొదలైంది.
వేదకాలంలోనూ ఆవుపాలకు ప్రాధాన్యం ఉంది. బాస్ ప్రిమిజెనియస్ అనే ఆదిమజాతి పశువులు భారత ఉపఖండంలో 13వ శతాబ్దం వరకూ ఉండేవి. ఆ పురాతన ఆవుల జాతి నుంచే మన దేశీ గోజాతులు వృద్ధి చెందాయన్న అభిప్రాయం ఉంది. సుమేరియన్లు తొలుత పాలు వాడారని మరో అభిప్రాయం ఉంది.
పాల ఉత్పత్తులే మన రైతుకు జవజీవాలు
ప్రపంచంలో ఏ ఇతరదేశం కన్నా మిన్నగా మన దేశానికి పాడిపరిశ్రమ ప్రాణప్రదమైనది. ఒకటో రెండో ఆవులనో, గేదెలనో పెంచుకునే మన పేద రైతులకు, భూమి లేని గ్రామీణ నిరుపేదలకు పాడి ద్వారా వచ్చే దినసరి ఆదాయం అతి పెద్ద భరోసా. పంటలు పండినా పండకపోయినా రెండు పాడి ఆవులో, గేదెలో ఉంటే చాలు ఇంట్లో తిండికి, పై ఖర్చులకు చేయి చాచాల్సిన అవసరం ఉండదు అనేదే ప్రతి రైతు కుటుంబం అనుభవం.
దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది చిన్న రైతులు, పాల సహకార సంఘాలు, చిన్నా చితక పాల వ్యాపారుల సమూహాలు.. వీళ్లందరి కృషి వల్ల మన దేశం పాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే కాదు, ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారుగా ఎదిగింది. వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల జాతీయోత్పత్తిలో పశువుల వాటా 25% ఉండగా, అందులో 67% వాటా పాల నుంచి సమకూరుతోంది.
కురియన్ పాల విప్లవం
డాక్టర్ వర్గీస్ కురియన్ రైతుల సహకార డెయిరీల ద్వారా పాల విప్లవాన్ని సృష్టించారు. పాల నురగను విప్లవంగా మార్చిన మహనీయుడాయన. 1949లో గుజరాత్‌లో కైరా జిల్లా ఆనంద్‌లో పాడి పరిశ్రమలో ఇంజినీరుగా పనిలో చేరిన కురియన్ రైతుల కష్టాలు చూసి చలించారు. అప్పట్లోనే పాల్సన్ అనే ప్రైవేటు డెయిరీ కంపెనీ సరైన ధర ఇవ్వకపోవడంతో గుజరాత్ పాడి రైతులు సమ్మె చేశారు. ఈ పూర్వరంగంలోనే కైర జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం 1946లో ఏర్పడింది. దీనిపేరు తదనంతరం ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్(అముల్)గా మారింది. 1955లో ఆనంద్‌లో తొలి అముల్ సహకార డెయిరీ ప్లాంట్ ఏర్పాటైంది. అప్పటి వరకు పాల సేకరణకే పరిమితమైన రైతుల సహకార సంఘం బట్టర్, నెయ్యి, పాల పొడి తయారు చేయడం మొదలుపెట్టింది. అధికారుల జోక్యం లేకుండా పాడి రైతులే స్వతంత్ర విధాన నిర్ణేతలుగా ఉండే సహకార డెయిరీ వ్యవస్థ వేరూనుకునేలా పాటుపడిన కురియన్ దేశవ్యాప్తంగా సహకార పాల విప్లవానికి ఊపిర్లూదారు.
గేదె పాలతో ప్రపంచంలోనే తొట్టతొలిగా పాల పొడిని తయారు చేయడం కురియన్ సాధించిన మొదటి విజయం. అప్పటి వరకు ఆవు పాల ఉత్పత్తుల తయారీలో పట్టున్న న్యూజిలాండ్ ఇంజినీర్లు.. గేదె పాలతో పొడిని తయారు చేయడం అసాధ్యమన్నారు. కానీ, మన రైతుల దగ్గర గేదెలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఉన్న గేదెల్లో 57%, ఆవుల్లో 16% మన దేశంలో ఉన్నాయి. స్వతహాగా మెకానికల్ ఇంజినీర్ అయిన కురియన్ దేశీయంగానే సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా గేదె పాలతో పొడిని, ఇతర ఉత్పత్తులను తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడానికి ‘అముల్’ బ్రాండ్‌ను సృష్టించి సహకార పాడి పరిశ్రమకు గట్టి పునాదులు వేశారు. ఆ స్ఫూర్తితోనే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతుల సహకార డెయిరీల ఏర్పాటయ్యాయి.
నిర్ణయాధికారం రైతులదే
ఈ సహకార సంఘాల్లోని పాడి రైతులకే కాకుండా.. పాలను రైతుల నుంచి వినియోగదారులకు చేర్చే క్రమంలో పనిచేసే వారు లేదా పాలతో వివిధ ఉత్పత్తులు తయారు చేసి అమ్మే లక్షలాది చిన్న వ్యాపారులకు కూడా ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతోంది.
♦ చిన్నతరహా పాల వ్యాపార సంస్థల్లో ప్రతి వంద లీటర్ల పాలు సేకరించి, శుద్ధి చేసి, వివిధ ఉత్పత్తులు తయారు చేసి విక్రయించే క్రమంలో పరిస్థితులను బట్టి 4 నుంచి 17 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించవచ్చని అంచనా. పాలను ప్రాసెస్ చేసి ఆ ప్రాంత వినియోగదారుల అవసరాల మేరకు వివిధ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తుంటారు. ఏ స్థాయి డెయిరీ సంస్థల్లో ప్రాసెసింగ్ జరుగుతుందన్న దాన్ని బట్టి ఎంత మందికి ఉపాధి కల్పించగలమన్నది ఆధారపడి ఉంటుంది.
♦ 1950–51లో కోటి 70 లక్షల టన్నుల పాలు మన దేశంలో ఉత్పత్తయ్యేవి. అయితే, ప్రజల అవసరాలు తీర్చడానికి అవి సరిపోక అప్పట్లో 55 వేల టన్నుల ఆవు పాల పొడిని విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్లం. కురియన్ సారథ్యంలోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(1965) చేపట్టిన ‘ఆపరేషన్ ఫ్లడ్’ పథకం ద్వారా సహకార డెయిరీ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఫలితంగా పాల ఉత్పత్తిలో మన దేశం స్వయం సమృద్ధిని సాధించింది. 1998 నాటికి ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తి దేశంగా, అత్యధిక సంఖ్యలో పాడి పశువులున్న దేశంగా భారత్ ప్రసిద్ధికెక్కింది.
1,85,903 గ్రామాల్లో పాల సంఘాలు
మన దేశంలో ఇప్పుడు 1,85,903 గ్రామాల్లో పాల సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఇందులో 32,000 సంఘాలకు మహిళలే నేతృత్వం వహిస్తున్నారు. పాల ఉత్పత్తి శ్రమలో 70% వరకూ గ్రామీణ మహిళలదే. మన దేశంలో 210 సహకార పాల డెయిరీలు, 9 పెద్ద పాల ఉత్పత్తిదారుల కంపెనీలు ఉన్నాయి. 2017–18 నాటికి మన దేశంలో పాల ఉత్పత్తి 17.64 కోట్ల టన్నులకు పెరిగింది. 2021–22 నాటికి 25.45 కోట్ల టన్నులకు పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామాల్లో రైతులు పాల సంఘాలకు పోసే పాలల్లో 47% పాలను ఆయా గ్రామాల్లోని ప్రజలే వినియోగించుకుంటున్నారు. మిగతా 53% పాలు పాల సహకార డెయిరీలు, ప్రైవేటు డెయిరీల ద్వారా దగ్గర్లోని పట్టణాలు, నగరాలకు సరఫరా అవుతున్నాయి. వినియోగదారులు చెల్లించే ధరలో 70% మొత్తాన్ని పాడి రైతులు పొందుతున్నారు. సహకార డెయిరీల్లో సభ్యులైన పాడి రైతులకు మరో పది శాతం ఎక్కువ లబ్ధి కలుగుతోంది.
♦ 1950లో ప్రతి మనిషి రోజుకు 130 గ్రాముల పాలు అందుబాటులో ఉంటే.. సహకార పాడి పరిశ్రమ పుణ్యమా అని 2018 నాటికి రోజుకు 374 గ్రాముల పాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ సగటు తలసరి పాల లభ్యత రోజుకు 294 గ్రాములకన్నా ఇది 80 గ్రాములు ఎక్కువ కావడం విశేషం.
డెయిరీ పరిశ్రమ మొదలైంది ఇలా..
ఐరోపా పారిశ్రామిక విప్లవం(1830) తర్వాత గ్రామాల నుంచి పాలను పట్టణ ప్రాంతాలకు తరలించడానికి రవాణా సదుపాయం ఏర్పడింది. ఆ క్రమంలోనే డెయిరీ పరిశ్రమకు అవసరమైన సాంకేతికతలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. 1860లో నెదర్లాండ్స్‌లో మెకానికల్ కూలర్‌ను కనుగొనడంతో సాంద్ర డెయిరీ పరిశ్రమకు పునాదులు పడ్డాయి. 1864లో ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ లూయిస్ పాశ్చర్ పాల శీతలీకరణ ప్రక్రియను కనుగొన్నాడు. 1880లలోనే అటస్టె గాలిన్ హోమోజెనైజేషన్‌ను కనుగొన్నాడు. దీంతో స్కిమ్ మిల్క్, లో ఫాట్ మిల్క్ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తుల తయారీ ప్రారంభమైంది. ఈ ఆవిష్కరణల మూలంగా పాల నాణ్యత దెబ్బతినకుండా నిల్వచేయడం, దూర ప్రాంతాలకు తరలించడం సులభమైంది. ఈ విధంగా అంతర్జాతీయంగా పాల ఉత్పత్తుల తయారీ ఒక పరిశ్రమగా రూపుదాల్చింది.
పాల ఉత్పత్తిలో మనమే నంబర్ వన్
ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మంది రైతులు పాలను ఉత్పత్తి చేస్తున్నారు. 2018లో ప్రపంచవ్యాప్తంగా 84.32 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తయ్యాయి. ఇందులో మన దేశం వాటా అత్యధికంగా 19%. మన తర్వాత స్థానాల్లో ఐరోపా దేశాల కూటమి(ఈయూ), అమెరికా, చైనా, పాకిస్తాన్, బ్రెజిల్, రష్యా, న్యూజిలాండ్ ఉన్నాయి. అయితే, పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈయూ, న్యూజిలాండ్, అమెరికా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చైనా పాలు, పాల ఉత్పత్తులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. న్యూజిలాండ్ ఉత్పత్తి చేసే 2.2 కోట్ల టన్నుల పాలలో 1.9 కోట్ల టన్నులను ఎగుమతి చేస్తుంటుంది. పాల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించిన మన దేశంలో 15 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు. వీళ్లంతా ఐదెకరాల లోపు భూములున్న చిన్న, సన్నకారు రైతులే.విదేశాల్లో ఒక్కో రైతుకే వేలాది ఎకరాల భూములుంటాయి. పారిశ్రామిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తుంటారు. అందుకే అక్కడ రైతుల సంఖ్య తక్కువే అయినా దేశ అవసరాలకు పోను మిగులు పాల ఉత్పత్తులు పెద్ద పరిమాణంలో ఉంటాయి. అందువల్ల న్యూజిలాండ్‌లో 12,000 మంది, ఆస్ట్రేలియాలో 6,300 మంది రైతులు మాత్రమే పాల ఉత్పత్తులు తయారుచేస్తున్నప్పటికీ విదేశాలకు పాల ఉత్పత్తులను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. కొన్ని చిన్న దేశాలకు మనమూ పాల ఉత్పత్తులను కొంతమేరకు ఎగుమతి చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment