ఆకుల దాణా అదరహో! | Leaves Feeding Good For Dairy Fa | Sakshi
Sakshi News home page

ఆకుల దాణా అదరహో!

Published Tue, Jul 30 2019 12:52 PM | Last Updated on Tue, Jul 30 2019 12:52 PM

Leaves Feeding Good For Dairy Fa - Sakshi

ఆకుల దాణా తయారీ ∙ఆకుల దాణా వడియాలసు గేదెకు తినిపిస్తున్న మహిళా రైతు

అసలే కరువు కాలం. పశువులకు గ్రాసం అందించడం పాడి రైతులు, పశుపోషకులకు కష్టమవుతోంది. వర్షాభావంతో పచ్చి మేత లభ్యత తగ్గిపోయింది. ఎండు మేత (చొప్ప)తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పశువులను రైతులు పోషించలేక తెగనమ్ముకునే స్థితికి వచ్చారు. మేతతోపాటు పోషక విలువలతో కూడిన దాణా కూడా పశువులకు అందిస్తేనే పాల దిగుబడి పెరుగుతుంది, పొట్టేళ్లు/మేకలు కండపుష్టితో చక్కగా పెరుగుతాయి. అయితే, నాణ్యమైన పోషక విలువలున్న దాణాను బజారులో కొనుగోలు చేయడం కూడా రైతులకు ఈ కష్టకాలంలో ఇబ్బందే.

ఇటువంటి పరిస్థితుల్లో ఆకుల దాణా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల పప్పుజాతి చెట్ల ఆకులతో రైతులు ఇంటి దగ్గరే ఆకుల దాణా  తయారు చేసుకొని పశువులకు పచ్చి/ఎండు మేతతోపాటు మేపుకుంటే పాల దిగుబడి పెంచుకోవచ్చని, పొట్టేళ్లను లాభదాయకంగా పెంచుకోవచ్చని వైఎస్సార్‌ కడప రూరల్‌ పశుసంవర్థక శాఖ వైద్యులు డా. జి. ఆర్‌. రాంబాబు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లైవ్‌ స్టాక్‌ డీపీఎం డాక్టర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి సూచిస్తున్నారు. పప్పు జాతి గ్రాసాల్లోను.. పశు గ్రాసపు చెట్లయిన మునగ, అవిసె, సుబాబుల్, సుంకేసుల ఆకులలోను మాంసకృత్తులు(ప్రొటీన్లు) ఎక్కువగా లభిస్తాయి. ఈ ఆకులతో ఇంటి దగ్గరే మంచి పోషక విలువలు కలిగిన ఆకుల దాణాను తయారు చేసుకోవచ్చు. ఆకుల దాణాను రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు.

ఆకుల దాణా (మొదటి రకం) తయారీకి కావాల్సిన వస్తువులు: మునగ/అవిసె/ సుబాబుల్‌/ జమ్మి ఎండు ఆకులు (వీటిలో ఏదైనా ఒక రకంæ లేదా అన్ని రకాల ఆకులు కలిపి) 600 గ్రాములు.
గంజి (అన్నం వార్చినప్పుడు వచ్చే గంజి) దాదాపు అర లీటరు.
ఉప్పు సరిపడేటంత అంటే 15–20 గ్రాములు.
మిరల్‌ మిక్చర్‌ (ఎముకల పొడి) 10–15 గ్రాములు.

తయారీ విధానం
గంజిని గోరు వెచ్చగా చల్లార్చి ఉప్పు, మినరల్‌ మిక్సర్‌ను కలపాలి. తర్వాత ఎండు ఆకుల పొడిని అందులో వేసి కలిపి ముద్దగా చేసి.. ఏదేని పాలిథిన్‌ కవర్‌పై వడియాల రూపంలో వేసుకుని బాగా ఎండబెట్టాలి.
ఆకుల దాణా (రెండో రకం) తయారీకి కావాల్సిన వస్తువులు:
మునగ /అవిసె/ సుబాబుల్‌/ జమ్మి ఎండు ఆకులు (వీటిలో ఏదైనా ఒక రకంæ లేదా అన్ని రకాల ఆకులు కలిపి) 600 గ్రాములు.
గోధుమ పిండి 300 గ్రాములు
ఉప్పు దాదాపు 15–20 గ్రాములు

తయారీ విధానం
గోధుమపిండిని కొంచెం చల్ల నీరు పోసి గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత తగినంత నీటిని మరగబెట్టి (గోధుమ పిండిని ఒకేసారి వేడి నీటిలో కలిపితే ముద్దలు ముద్దలుగా ఉండిపోతాయి) కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేసి కలపాలి. గోరు వెచ్చగా చల్లార్చి నిదానంగా ఉప్పు, ఎముకలపొడి మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత ఎండు ఆకుల పొడిని అందులో వేసి గట్టిగా అయ్యే విధంగా కలిపి ముద్దలుగా చేసుకోవాలి. పాలిథిన్‌ కవర్‌పై వడియాలు మాదిరిగా వత్తుకొని బాగా ఎండబెట్టుకోవాలి.

గమనిక: పై రెండు పద్ధతుల్లో 250 గ్రాముల ముడిబెల్లం తరిగి పెట్టుకొని వేడి దశలో కలిపినట్లయితే ఇంకా బలవర్ధకమైన దాణా తయారవుతుంది. రూ. 20 ఖర్చుతోనే సుమారు 1200 గ్రాముల ఆకుల దాణా తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు.

ఎలా వాడుకోవాలి?
పైవిధంగా తయారు చేసిన ఆకుల దాణా వడలను పెద్ద పశువులకు అయితే వీటిని రోజుకు 2 కిలోల వరకు, దూడలకు అర కిలో వరకు, గొర్రె/మేక పిల్లలకు 100–150 గ్రాములు, పెద్ద పొట్టేళ్లు/మేకలకు 250 గ్రాముల వరకు తినిపించవచ్చు. కొద్దిగా తడిపి లేదా నీటిలో ముంచి తినిపించాలి.

ఆకుల దాణాతో ప్రయోజనాలు..
తక్కువ ధరలో తయారు చేసుకోవచ్చు. కేవలం ఒక గంటలో తయారు చేసుకోవచ్చు. త్వరగా జీర్ణమవుతుంది. ఎన్ని రోజులైనా చెడిపోదు.
పశువులు పాల దిగుబడి, వెన్న శాతం పెరుగుతుంది. సకాలంలో ఎదకు వచ్చి సజావుగా ఈనుతాయి. దూడలకు కూడా మంచి దాణాగా పనికి వస్తుంది.
పొట్టేలు పిల్లలకు మంచి ఆహారం, త్వరగా ఎదుగుదల కనిపిస్తుంది. ఇవిæ బరువు బాగా పెరుగుతాయి. ఎముకల పొడి వలన పశువుల శరీరానికి ఖనిజ లవణాలు అందుతాయి. రక్తహీనతను నివారించవచ్చు.
ఆకుల దాణా తయారు చేసి అమ్మకానికి పెట్టవచ్చు. గ్రామాల్లో కొంత మందికి ఉపాధి కూడా దొరుకుతుంది.

ఆకుల దాణాలో పోషక విలువలు
ఆకుల దాణాను గన్నవరం వెటర్నరీ కాలేజీ లాబ్‌లో టెస్ట్‌ చేయించగా.. ఎండు పదార్థం 80.2 శాతం, ముడి మాంసకృత్తులు 8.59  శాతం, ముడి పీచుపదార్థం 30.3 శాతం ఉన్నట్లు తేలింది. వాడిన రైతులు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతున్నారు.
మునగలో బీటా కెరోటిన్, విటమిన్‌ సీ, మాంసకృత్తులు, ఇనుము, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
అవిసాకులో క్యాల్షియం, విటమిన్‌ ఏ, ఐరన్‌ అధికంగా ఉంటాయి. ఇరవై గుడ్లు లేదా పది కప్పుల పాలు లేదా అర కిలో మాంసం ద్వారా లభించే క్యాల్షియం ఓ గుప్పెడు అవిసాకుల్లో లభిస్తుంది.
ఇరవై కప్పుల పాలు లేదా ఐదు కిలోల మాంసంలో లభించే విటమిన్‌–ఏ ఓ గుప్పెడు అవిసాకుల్లో లభిస్తుంది. ఇంకా ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, పిండి పదార్థాలు, మాంసకృత్తులు అవిసాకుల్లో ఉన్నాయి.
గంజి వాడటం వలన ఎక్కువ బలం వస్తుంది. సుబాబుల్‌/ జమ్మిలలో మాంసకృత్తులు ఎక్కువ శాతంలో లభిస్తాయి. బెల్లం వలన రక్తహీనత నివారణతోపాటు త్వరగా బలం వస్తుంది.
(వివరాలకు డా.రాంబాబు–94945 88885)– మాచుపల్లె ప్రభాకరరెడ్డి,సాక్షి, వైఎస్సాఆర్‌ జిల్లా అగ్రికల్చర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement