హైదరాబాద్: వెయ్యి ఎకరాల విస్తీర్ణం.. వందలాది ఆవుల ‘మంద’హాసం. ఉద్యోగుల ఆలనా‘పాల’నా... 125 ఏళ్లపాటు నిరుపమాన సేవలు... సైనికులకు స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తుల సరఫరా... బలగాలకు అంతులేని బలం.. ఇదీ మిలటరీ డెయిరీ ఫార్మ్ సర్వీసెస్ ఘనమైన గతచరిత్ర. మరిప్పుడో! అది ‘ఫాం’కోల్పోయింది.. చివరికి మూసివేత ‘పాలు’అయింది.. కేవలం 20 ఆవులు మాత్రమే మిగిలాయి. వాటిని కూడా నేడోరేపో తరలించనున్నారు. ఇప్పుడది పశువులులేని కొట్టంలా మారింది. ఒడిసిన ముచ్చట అయింది.
వెటర్నరీతో మొదలై...
ఈస్టిండియా కంపెనీ తమ సైనిక బలగాలలోని గుర్రాలు, ఒంటెలుసహా ఇతర జంతువుల సంరక్షణ కోసం 1794లో రిమౌంట్, వెటర్నరీ ఫార్మ్స్ సర్వీసెస్ ప్రారంభించింది. సైనికులకు స్వచ్ఛమైన, నాణ్యమైన పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు అందించేందుకు ప్రత్యేకంగా మిలటరీ ఫార్మ్స్ సర్వీసెస్ పేరిట దేశవ్యాప్తంగా 39 మిలటరీ డెయిరీఫామ్‌లు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా అలహాబాద్‌లో తొలి డెయిరీని నెలకొల్పింది. అదే ఏడాది సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అల్వాల్ (అప్పట్లో కంటోన్మెంట్‌లో అంతర్భాగం)లో 450 ఎకరాల విస్తీర్ణంలో మిలటరీ డెయిరీ ఫామ్ ఏర్పాటైంది. ఈ ఫామ్‌కు ఓ దాత మరో 550 ఎకరాలు విరాళంగా ఇవ్వడంతో మొత్తం 1,000 ఎకరాలకు విస్తరించింది.
నాటి నుంచి సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్ పరిధిలోని సైనిక శిక్షణ కేంద్రాలు, బెటాలియన్లు, ట్రూపులకు పాలు, పాల ఉత్పత్తులను అందిస్తూ వచ్చింది. అయితే, బహిరంగ మార్కెట్‌లో సరసమైన ధరలకే నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు లభిస్తున్న నేపథ్యంలో డెయిరీఫామ్‌లు కొనసాగించాల్సిన అవసరం లేదని మిలటరీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 2017 ‘మిలటరీ ఫామ్స్ సర్వీసెస్’మూసివేత ప్రక్రియను షురూ చేశారు. చివరగా, తాజాగా సికింద్రాబాద్ డెయిరీఫామ్‌ను మూసివేశారు. ఫామ్‌లోని 498 జెర్సీ ఆవులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు అక్కడ కేవలం 20 ఆవులు మాత్రమే మిగిలాయి. సిబ్బందిని సైతం కొద్దిరోజుల్లో ఇతర ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. దీంతో డెయిరీ ఫామ్ పూర్తిస్థాయిలో కనుమరుగు కానుంది.
బస్తీ ఖాళీకి ఆదేశాలు...
డెయిరీఫామ్‌లో పనిచేసే శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల కోసం 120 క్వార్టర్లను అధికారులు నిర్మించారు. కాలక్రమేణా ఉద్యోగుల వారసులు సైతం అక్కడే స్థిరపడ్డారు. దీంతో ఇక్కడో బస్తీ వెలిసింది. అయితే, ఈ బస్తీలోని ఇళ్లను వచ్చే నెల పదోతేదీ నాటికి ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించినట్లు స్థానికులు చెప్పారు. కాగా, ఫామ్ ఆవరణలోనూ 170 ఎకరాల్లో జట్రోఫా మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికీ ఇక్కడ బయోడీజిల్ ఉత్పత్తి కొనసాగుతోంది.
కార్గిల్ వార్‌లోనూ కీలక పాత్ర
‘వెటర్నరీ, ఫార్మ్స్ సర్వీస్’విభాగం కార్గిల్ యుద్ధంలోనూ సైనికులకు కీలక సేవలు అందించాయి. శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పి ఉండే కార్గిల్ సెక్టార్‌లో సైనికుల పహారాను కూడా నిలిపివేస్తారు. దీన్ని అదనుగా తీసుకుని పాక్ సైన్యం కార్గిల్‌ను ఆక్రమించింది. అయితే ఈ విషయం స్థానిక పశువుల కాపరుల ద్వారా తెలుసుకున్న భారత ఆర్మీ పాక్ సైనికులను తిప్పి పంపింది. అయితే, మిలటరీ డెయిరీ ఫామ్‌ల మూసివేతలో భాగంగా కార్గిల్ మిలటరీ ఫామ్‌ను సైతం మూసివేశారు.
పాడి పరిశ్రమకు మార్గదర్శి
పల్లెల్లో కుటుంబ పరిశ్రమగా కొనసాగుతున్న పాలపరిశ్రమను మిలటరీ డెయిరీ ఫామ్స్ వ్యవస్థీకృతం చేశాయి. ఈ డెయిరీ ఫామ్స్ పలు కీలక విజయాలను సొంతం చేసుకున్నాయి. వాటిలో కొన్ని..
- జంతువుల్లో కృత్రిమ గర్భధారణ ప్రక్రియ తొలుత మిలటరీ డెయిరీ ఫామ్‌లలోనే మొదలైంది
- దేశంలో డెయిరీ అభివృద్ధికి మార్గదర్శిగా నిలిచింది
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తో కలిసి సంకర జాతి పశువుల ఉత్పత్తిలో ప్రపంచంలో పెద్దదైన ‘ప్రాజెక్ట్ ఫ్రీస్వాల్’ను విజయవంతంగా కొనసాగించింది.
Comments
Please login to add a commentAdd a comment