న్యూఢిల్లీ: 2020 జూన్ 15. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ. భారత్, చైనా సరిహద్దులోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–14. సరిగ్గా అక్కడే ఇరు దేశాల సైనికుల నడుమ భీకర స్థాయిలో ఘర్షణ జరిగింది. పదునైన ఆయుధాలతో చైనా జవాన్లు దాడి చేయగా, దెబ్బకు దెబ్బ అన్నట్లుగా భారత సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ కొట్లాటలో తమ జవాన్లు ఎంతమంది బలయ్యారో చైనా ప్రభుత్వం ఇప్పటికీ బయటపెట్టలేదు. 40 మందికిపైగానే చనిపోయి ఉంటారని అంచనా. భారత్ వైపు నుంచి దాదాపు 20 మంది చనిపోయారు. రణక్షేత్రంగా రక్తంతో తడిసిపోయిన పీపీ–14 ఇప్పుడు క్రికెట్ మైదానంగా మారింది.
పటియాలా బ్రిగేడ్‌కు చెందిన త్రిశూల్ డివిజన్ క్రికెట్ పోటీ నిర్వహించింది. సైనికులు సరదాగా క్రికెట్ ఆడారు. పీపీ–14కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఈ పోటీ జరిగింది. జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలను భారత సైన్యం శుక్రవారం ట్విట్టర్‌లో పోస్టు చేసింది. గడ్డ కట్టించే తీవ్రమైన చలిలో పూర్తి ఉత్సాహంతో ఈ పోటీ జరిగిందని వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఉద్ఘాటించింది. జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు సందర్భంగా గురువారం ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే గల్వాన్‌లో భారత సైనికులు క్రికెట్ పోటీ నిర్వహించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment