జిల్లాలోని పాడి రైతుల కష్టాన్ని ప్రైవేటు డెయిరీలు నిలువునా దోచేస్తున్నాయి. పాలకు గిట్టుబాటు ధర కల్పించడంలో మొండిచేయి చూపుతుండడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వెన్నశాతం పేరుతో తక్కువ ధరలు నిర్ణయిస్తూ మితిమీరిన పాలదోపిడీకి పాల్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
చిత్తూరు అగ్రికల్చర్: జిల్లాలోని రైతాంగం అధిక శాతం పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తోంది. దాదాపు 3.80 లక్షల రైతు కుటుంబాలు పంటల సాగుతోపాటు పాడి ఆవులు, గేదెల పెంపకాన్ని జీవనాధారం చేసుకున్నారు. కరువు పరిస్థితుల్లో పంటలు లేకపోయినా పాడి పరిశ్రమతోనే బతుకు నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం పాడి ఆవులు 9,27,776 ఉండగా, గేదెలు 84,605 ఉన్నాయి. అందులో ప్రస్తుతం పాలు ఇస్తున్న ఆవులు 3.75 లక్షలు, గేదెలు 35 వేల వరకు ఉన్నాయి. వీటిద్వారా రోజుకు 32 లక్షల నుంచి34 లక్షల లీటర్ల వరకు పాల ఉత్పత్తి వస్తోంది. అందులో 21 లక్షల నుంచి 22 లక్షల లీటర్ల వరకు రైతులు విక్రయిస్తున్నారు. పాలను అమ్మగా వచ్చిన ఆదాయంతో పశువులను, కుటుంబాలను పోషించుకుంటున్నారు. పాలలో అత్యధికంగా ప్రైవేటు డెయిరీలకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేటు డెయిరీలు పాడి రైతులను నిలువునా దోచుకుంటూ రూ.కోట్లలో కొల్లగొడుతున్నాయి.
నిలువు దోపిడీ..
పాడి రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రైవేటు డెయిరీల మోసాలకు అదుపులేకుండా పోతోంది. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రైవేటు డెయిరీలు చేస్తున్న జిమ్మిక్కులతో పాడి రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు. లీటరు పాలకు రూ.30కి తక్కువ లేకుండా వస్తేనే కొంతమేర గిట్టుబాటు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రైవేటు డెయిరీలు ఎస్‌ఎన్‌ఎఫ్, ఫ్యాట్‌ల ఆధారంగా పాలకు ధర నిర్ణయించడం, వాటిలోనూ ట్యాక్స్‌ల పేరుతో మరికొంత కోత విధిస్తున్నాయి. సాధారణంగా ఎస్‌ఎన్‌ఎఫ్ 8.5, ఫ్యాట్ 4.5 మేరకు వస్తే లీటరుకు రూ.30 పైబడి నిర్ణయించాల్సి ఉంది. కానీ రూ.18 నుంచి రూ.24 వరకు మాత్రమే ధరను ఇస్తున్నాయి. ఈ విధంగా తక్కువ ధరకే కొనుగోలు చేస్తూ రైతులను దోపిడీ చేసేందుకు రోజుకో ప్రైవేటు డెయిరీ పుట్టుకొస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 49 ప్రైవేటు డెయిరీలు ఉన్నాయి. వీటికి రోజుకు 16 లక్షల నుంచి 17 లక్షల లీటర్ల మేరకు రైతులు పాలను విక్రయిస్తున్నారు.
స్వలాభం కోసం సహకారం నిర్వీర్యం..
జిల్లాకే తలమానికంగా నిలిచిన∙సహకార విజయా డెయిరీని చంద్రబాబునాయుడు తన స్వలాభం కోసం నిర్వీర్యం చేశారు. జిల్లావ్యాప్తంగా 5 లక్షల రైతు కుటుంబాలు విజయా డెయిరీకి నిత్యం పాలుపోసి జీవనం సాగిస్తున్నాయి. 2002 ఆగస్టు 31న చంద్రబాబు తన సొంత హెరిటేజ్ డెయిరీ అభివృద్ధి కోసం విజయా డెయిరీని నష్టాలను సాకుగా చూపెట్టి మూయించి వేశారు. జిల్లాలోని పాడి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసి తన హెరిటేజ్ డెయిరీకి మళ్లించుకున్నారు. 2014లో తిరిగి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక పాడి రైతుల కష్టాలు మరింతగా పెరిగాయి. హెరిటేజ్ డెయిరీలో దోపిడీకి అంతే లేకుండా పోతోంది. ఎస్‌ఎన్‌ఎఫ్, ఫ్యాట్‌ల పేరుతో లీటరు ఆవు పాలకు రూ.18 నుంచి రూ.22 వరకు, గేదెపాలు లీటరుకు రూ.26 నుంచి రూ.28 వరకు మాత్రమే ఇస్తూ నిట్టనిలువునా దోచేస్తోంది.
వైఎస్సార్ చొరవతో..
2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్.రాజశేఖరరెడ్డి పాడి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 2006లో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో జిల్లాలో పాలశీతలీకరణ కేంద్రాల (బీఎంసీయూ)లను ఏర్పాటు చేశారు. పాలకు గిట్టుబాటు ధర రావడంతో రైతులు మళ్లీ పాడి పరిశ్రమపై ఉత్సాహం చూపారు. జిల్లా వ్యాప్తంగా 94 బీఎంసీల మేరకు వెలిశాయి. ఈ పాలశీతలీకరణ కేంద్రాల ద్వారా రోజుకు 2.36 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఇక్కడ పాలుపోసే వారికి ఆవు పాలకు లీటరుకు రూ.25 నుంచి రూ.29 వరకు, గేదెపాలకు లీటరుకు రూ.32 నుంచి రూ.40 వరకు ఇస్తున్నారు. దీంతో పాలశీతలీకరణ కేంద్రాలకు పాలుపోసే పాడి రైతులకు మాత్రం కొంత ఊరట కలుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment