వాణిజ్యపరంగా పాల ఉత్పత్తి బాగుండాలంటే పాడి పశువులకు మేపే పచ్చి మేతలో 3 పాళ్లు ధాన్యపు జాతి పచ్చి మేతలు, ఒక పాలు పప్పు జాతి పచ్చి మేత ఉండాలన్నది నిపుణుల మాట.
లూసర్ను: ఆనంద్–2, ఆర్.ఎల్.–52, కాంప్–3, ఆర్.ఎల్–58, సి.ఓ.–1 తదితర రకాల లూసర్న్ రకాలు మేలైన పచ్చిమేత దిగుబడినిస్తాయి. అక్టోబర్ – నవంబర్ మధ్యకాలంలో విత్తుకోవాలి. హెక్టారుకు 20–25 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య 25 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం ఉండాలి. హెక్టారుకు 30 కిలోల నత్రజని, 100 కిలోల పొటాష్ వేయాలి. మొదటి 2–3 నీటి తడులను వారానికి ఒకసారి, ఆ తర్వాత 10–12 రోజులకు ఇవ్వాలి. మొదటి కోత 60 రోజులకు వస్తుంది. తర్వాత ప్రతి 30 రోజులకు ఒకసారి, 8–10 కోతలు వస్తాయి. హెక్టారుకు పచ్చిమేత దిగుబడి 60–80 టన్నులు వస్తుంది.
స్టైలో: స్టైలో పశుగ్రాస జాతిలో స్టైలో హమట, స్టైలో గానెన్సిస్, స్టైలో స్కాబ్రా అనే రకాలున్నాయి. వీటిని వర్షాధారంగా జూన్–జూలైలలో, నీటి పారుదల కింద సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో విత్తుకోవాలి. హెక్టారుకు 20–25 కిలోల విత్తనం అవసరం. విత్తనాలు వెదజల్లుతూ, మరీ ఎక్కువ లోతుగా పడకుండా జాగ్రత్తపడాలి. హెక్టారుకు 35 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ వేయాలి. 30 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. స్టైలో పచ్చిమేతలు విత్తిన 75 రోజులకు మొదటి సారి కోతకు వస్తాయి. ప్రతి 50 రోజులకు ఒకసారి 8–10 కోతలు వస్తాయి. హెక్టారుకు ఏడాదికి వర్షాధారంగా 30–35 టన్నులు, నీటిపారుదల ఆధారంగా 50 టన్నుల వరకు పచ్చిమేత దిగుబడి వస్తుంది. అలసంద: పప్పుజాతి పచ్చి మేతల్లో ముఖ్యమైన రకం అలసంద. అలసందలో యు.పి.సి. 5286, ఇ.సి. 4216, ఐ.సి. 4216, రష్యన్ అలసంద, బుందేల్ లోబియా 1,2 రకాలు పశుగ్రాసంగా మేలైనవి. వర్షాధారంగా జూన్–జూలై నెలల్లో, నీటిపారుదల కింద ఫిబ్రవరి – జూన్ మధ్య విత్తుకోవాలి. హెక్టారుకు 30–40 కిలోల విత్తనాలు కావాలి. వరుసల మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండాలి. హెక్టారుకు 20 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ వేయాలి. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా మాగిన పశువుల ఎరువు/ఘనజీవామృతం / వర్మీ కంపోస్టు / జీవామృతంలను మోతాదు మేరకు వేసుకోవాలి. 12–15 రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలి. 60–70 రోజులకు పూత దశలో కోసి పశువులకు మేపుకోవాలి. అలసంద ఒకేసారి కోతకు వస్తుంది. హెక్టారుకు నీటి పారుదల ఉండే 20–30 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. వర్షాధారంగా 10–15 టన్నుల దిగుబడి వస్తుంది.
పిల్లి పెసర: పప్పుజాతి పచ్చి మేతగా పిల్లి పెసరను సాగు చేసుకోవచ్చు. శీతాకాలంలో (ఆగస్టు–జనవరి), రబీ పంటగా సాగు చేసుకోవచ్చు. విత్తుకోవడానికి అనువైన సమయం డిసెంబర్ – జనవరి నెలలు. హెక్టారుకు ఏకపంటగా విత్తుకోవడానికి 25–30 కిలోల విత్తనాలు కావాలి. మిశ్రమ పంటగా అయితే 15–20 కిలోల విత్తనాలు అవసరం. హెక్టారుకు 10 బండ్ల మాగిన పశువుల ఎరువుతోపాటు.. విత్తనాలు వేసే ముందు దుక్కిలో 20 కిలోల యూరియా, 30 కిలోల మూరేట్ 60 కిలోల సూపర్ ఫాస్పేట్ వేసుకోవాలి. నీటి తడుల∙అవసరం లేదు. వరి కోసిన తర్వాత భూమిలో ఉండే తేమతోనే పిల్లిపెసర మొలిచి పెరుగుతుంది. మొదటి కోత 50 రోజులకు వస్తుంది. రెండో కోత 45 రోజులకు వస్తుంది. హెక్టారుకు 20–25 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది.
జనుము: వరి కోసిన తర్వాత అదే పొలంలో మిగిలిన తేమతో సాగు చేసుకోదగిన మరో రకం పప్పుజాతి పచ్చిమేత రకం జనుము. ఫిబ్రవరి, మార్చి, అక్టోబర్ – నవంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. హెక్టారుకు 30–40 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య 10 అంగుళాల దూరం ఉండాలి. దుక్కిలో హెక్టారుకు 12 బండ్ల మాగిన పశువుల ఎరువును చల్లాలి. విత్తనాలు వేసేముందు 22 కిలోల యూరియా, దుక్కిలో 50 కిలోల సూపర్ ఫాస్పేట్, 35 కిలోల మ్యూరేట్ వేసుకోవాలి. వరి కోసిన తర్వాత జనుము వేస్తే అప్పుడున్న తేమతోనే పెరుగుతుంది. పొలంలో విత్తుకుంటే 15–20 రోజులకోసారి నీటి తడి ఇవ్వాలి. 50% పూత దశలో మొదటి కోత కోయాలి. ఒకే కోత వస్తుంది. హెక్టారుకు 25–30 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment