animal feed
-
పప్పుజాతి పచ్చి మేతల సాగు ఇలా..
వాణిజ్యపరంగా పాల ఉత్పత్తి బాగుండాలంటే పాడి పశువులకు మేపే పచ్చి మేతలో 3 పాళ్లు ధాన్యపు జాతి పచ్చి మేతలు, ఒక పాలు పప్పు జాతి పచ్చి మేత ఉండాలన్నది నిపుణుల మాట. లూసర్ను: ఆనంద్–2, ఆర్.ఎల్.–52, కాంప్–3, ఆర్.ఎల్–58, సి.ఓ.–1 తదితర రకాల లూసర్న్ రకాలు మేలైన పచ్చిమేత దిగుబడినిస్తాయి. అక్టోబర్ – నవంబర్ మధ్యకాలంలో విత్తుకోవాలి. హెక్టారుకు 20–25 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య 25 సెం.మీ., మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం ఉండాలి. హెక్టారుకు 30 కిలోల నత్రజని, 100 కిలోల పొటాష్ వేయాలి. మొదటి 2–3 నీటి తడులను వారానికి ఒకసారి, ఆ తర్వాత 10–12 రోజులకు ఇవ్వాలి. మొదటి కోత 60 రోజులకు వస్తుంది. తర్వాత ప్రతి 30 రోజులకు ఒకసారి, 8–10 కోతలు వస్తాయి. హెక్టారుకు పచ్చిమేత దిగుబడి 60–80 టన్నులు వస్తుంది. స్టైలో: స్టైలో పశుగ్రాస జాతిలో స్టైలో హమట, స్టైలో గానెన్సిస్, స్టైలో స్కాబ్రా అనే రకాలున్నాయి. వీటిని వర్షాధారంగా జూన్–జూలైలలో, నీటి పారుదల కింద సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో విత్తుకోవాలి. హెక్టారుకు 20–25 కిలోల విత్తనం అవసరం. విత్తనాలు వెదజల్లుతూ, మరీ ఎక్కువ లోతుగా పడకుండా జాగ్రత్తపడాలి. హెక్టారుకు 35 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ వేయాలి. 30 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. స్టైలో పచ్చిమేతలు విత్తిన 75 రోజులకు మొదటి సారి కోతకు వస్తాయి. ప్రతి 50 రోజులకు ఒకసారి 8–10 కోతలు వస్తాయి. హెక్టారుకు ఏడాదికి వర్షాధారంగా 30–35 టన్నులు, నీటిపారుదల ఆధారంగా 50 టన్నుల వరకు పచ్చిమేత దిగుబడి వస్తుంది. అలసంద: పప్పుజాతి పచ్చి మేతల్లో ముఖ్యమైన రకం అలసంద. అలసందలో యు.పి.సి. 5286, ఇ.సి. 4216, ఐ.సి. 4216, రష్యన్ అలసంద, బుందేల్ లోబియా 1,2 రకాలు పశుగ్రాసంగా మేలైనవి. వర్షాధారంగా జూన్–జూలై నెలల్లో, నీటిపారుదల కింద ఫిబ్రవరి – జూన్ మధ్య విత్తుకోవాలి. హెక్టారుకు 30–40 కిలోల విత్తనాలు కావాలి. వరుసల మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండాలి. హెక్టారుకు 20 కిలోల నత్రజని, 60 కిలోల పొటాష్ వేయాలి. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు రసాయనిక ఎరువులకు బదులుగా మాగిన పశువుల ఎరువు/ఘనజీవామృతం / వర్మీ కంపోస్టు / జీవామృతంలను మోతాదు మేరకు వేసుకోవాలి. 12–15 రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలి. 60–70 రోజులకు పూత దశలో కోసి పశువులకు మేపుకోవాలి. అలసంద ఒకేసారి కోతకు వస్తుంది. హెక్టారుకు నీటి పారుదల ఉండే 20–30 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. వర్షాధారంగా 10–15 టన్నుల దిగుబడి వస్తుంది. పిల్లి పెసర: పప్పుజాతి పచ్చి మేతగా పిల్లి పెసరను సాగు చేసుకోవచ్చు. శీతాకాలంలో (ఆగస్టు–జనవరి), రబీ పంటగా సాగు చేసుకోవచ్చు. విత్తుకోవడానికి అనువైన సమయం డిసెంబర్ – జనవరి నెలలు. హెక్టారుకు ఏకపంటగా విత్తుకోవడానికి 25–30 కిలోల విత్తనాలు కావాలి. మిశ్రమ పంటగా అయితే 15–20 కిలోల విత్తనాలు అవసరం. హెక్టారుకు 10 బండ్ల మాగిన పశువుల ఎరువుతోపాటు.. విత్తనాలు వేసే ముందు దుక్కిలో 20 కిలోల యూరియా, 30 కిలోల మూరేట్ 60 కిలోల సూపర్ ఫాస్పేట్ వేసుకోవాలి. నీటి తడుల∙అవసరం లేదు. వరి కోసిన తర్వాత భూమిలో ఉండే తేమతోనే పిల్లిపెసర మొలిచి పెరుగుతుంది. మొదటి కోత 50 రోజులకు వస్తుంది. రెండో కోత 45 రోజులకు వస్తుంది. హెక్టారుకు 20–25 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. జనుము: వరి కోసిన తర్వాత అదే పొలంలో మిగిలిన తేమతో సాగు చేసుకోదగిన మరో రకం పప్పుజాతి పచ్చిమేత రకం జనుము. ఫిబ్రవరి, మార్చి, అక్టోబర్ – నవంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. హెక్టారుకు 30–40 కిలోల విత్తనాలు అవసరం. సాళ్ల మధ్య 10 అంగుళాల దూరం ఉండాలి. దుక్కిలో హెక్టారుకు 12 బండ్ల మాగిన పశువుల ఎరువును చల్లాలి. విత్తనాలు వేసేముందు 22 కిలోల యూరియా, దుక్కిలో 50 కిలోల సూపర్ ఫాస్పేట్, 35 కిలోల మ్యూరేట్ వేసుకోవాలి. వరి కోసిన తర్వాత జనుము వేస్తే అప్పుడున్న తేమతోనే పెరుగుతుంది. పొలంలో విత్తుకుంటే 15–20 రోజులకోసారి నీటి తడి ఇవ్వాలి. 50% పూత దశలో మొదటి కోత కోయాలి. ఒకే కోత వస్తుంది. హెక్టారుకు 25–30 టన్నుల పచ్చిమేత దిగుబడి వస్తుంది. -
మెళకువలు పాటిస్తేనే అధిక దిగుబడి
♦ పశువులకు మాంసకృత్తులు, విటమిన్లు ♦ సమపాళ్లలో అందించాలి ♦ రైతులకు పశువైద్యురాలు ♦ దుర్గా రమాదేవి సూచనలు మిర్యాలగూడ రూరల్ : పశువులకు తమ దైనందిన కార్యక్రమాల నిర్వహణకు కావాల్సిన శక్తి కోసం, శరీరాభివృద్ధికి, పునరుత్పాదకశక్తికి మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వు లవణాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు చాలా అవసరం ఉంటుంది. రైతులు మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ పశు వైద్యురాలు దుర్గరమాదేవి పేర్కొంటున్నారు. ఈ విషయంపై రైతులు తీసుకోవాల్సిన సలహాలను వివరించారు. మాంసకృత్తులు.. శరీర పెరుగుదలకు, వ్యాధి నిరోధక శక్తి, హిమోగ్లోబిన్ నివారణకు తోడ్పడతాయి. శరీరానికి శక్తిని అందజేస్తాయి. పెయ్యలు, పడ్డల ఎదుగుదలకు, పాడిపశువుల్లో పాడి దిగుబడికి దోహదపడతాయి. మాంసకృత్తులు ఆహారంలో లోపిస్తే పశువులు చిక్కిపోవడం, పెరుగుదల స్తంభించడం, అండాశయాలు చిన్నగా ఉండడం, ఆలస్యంగా యుక్త వయసుకు రావడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, కండరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి. పత్తి గింజలు, వేరుశనగ పిండి, కొబ్బరి పిండి, నువ్వుల పొడి, చేపల, మాంస పొడి వంటి ముడిపదార్థాల్లో, పప్పు జాతికి చెందిన పశుగ్రాసాల్లో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. పిండి పదార్థాలతో 50 శాతం శక్తి పశువుల్లో రోజువారి కార్యక్రమా ల నిర్వహణకు కావాల్సిన శక్తిలో 50 శాతం పిండి పదార్థాల ద్వారా లభి స్తుంది. ఒకగ్రాము పిండి పదార్థాలు నాలుగు కిలో ల క్యాలరీల శక్తిని అందజేస్తుంది. పిండిపదార్థాలు తక్కువైతే కొవ్వుగా మారి పశువుల స్థూలకాయానికి దారితీస్తుంది. పిండి పదా ర్థాలు సరిపోను లభ్యంకాకపోతే పశువుల శరీరాభివృద్ధి, ఉత్పాదక సామర్థ్యం దెబ్బతిని శరీర బరువు తగ్గి నీరపడిపోతాయి. మొక్కజొన్న, జొన్న, నూకలు, సజ్జల వంటి ధాన్యాలు, చెరుకు మడ్డి, ఎండు మేతలు, చొప్ప ధాన్యం జాతి పశుగ్రాసాల్లో పిండి పదార్థాలు లభిస్తాయి. కొవ్వు పదార్థాలు ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని కొంత వరకు అందజేస్తాయి. విటమిన్ ‘ఏ’ శరీరంలో సక్రమంగా వినియోగపడేందుకు దోహదపడతాయి. శరీరంలో అంతర్గత కొవ్వు నిల్వలు దెబ్బలనుంచి అంతర్గత అవయవాలను రక్షిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తాయి. ఆహారంలో రుచిని పెం పొందిస్తాయి. పశువుల కృత్తిమ పునరుత్పత్తిలో మాంసకృత్తుల కంటే కొవ్వు అం దించే శక్తి అధికంగా ఉంటుంది. ఒక గ్రాము కొవ్వు పదార్థం 9 కిలో క్యాలరీల ఉష్ణ శక్తిని విడుదల చేస్తుంది. వేరుశనగపిండి, బొబ్బరి పిండి, నూనె గింజల చక్క, గోధుమ, వరి తౌడు లాంటి పదార్థాల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. జీవక్రియలకు నీరు దోహదం మేత లేకుండా పశువు మూడు నెలలు బతుకుతుంది గానీ.. నీరు లేకుండా ఐదు రోజుల పాటు బతుకలేదు. నీరు శరీర జీవ క్రియలకు, ఉత్పాదకతకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. నీరు శరీరంలో వివిధ పోషక పదార్థాలు సంగ్రహించడానికి, పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరంలో వివిధ భాగాలకు చేర్చడానికి, శారీరక ఊష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, శ్వాసక్రియ కొనసాగించడానికి చర్మం సాగే గుణం ఉండడానికి, జీర్ణక్రియలో ఉపయోగపడే కొన్ని ఎంజైముల తయారీకి, వ్యర్థ పదార్థాలను విసర్జించడానికి నీరు దోహదపడుతుంది. పాలల్లో 90 శాతం నీరు ఉంటుంది. సాధారణంగా పచ్చి మేతలో 70 శాతం, ఎండు మేతలో 10 శాతం నీరు ఉంటుంది. ఈ మేత తినడం ద్వారా కొంత నీరు లభిస్తుంది. శరీరంలో నీరు తక్కువ అయితే పొడిగా మారడం, మూత్ర సంబంధ వ్యాధులు, అజీర్తి, మలబద్దకం వంటి వ్యాధి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. పశువులు ఢీహైడేరషన్కు గురై మరణిస్తాయి. కాబట్టి పశువులకు నీరు కూడా పశు పోషణలో అత్యవసరమైన పోషక పదార్థంగా గుర్తించాలి. పశువుకు రోజుకు 50 నుంచి 60 లీటర్ల నీరు అవసరం.