పాడి సొమ్ము పక్కదారి | amount of Dairy Farm By the wayside | Sakshi
Sakshi News home page

పాడి సొమ్ము పక్కదారి

Published Fri, Nov 6 2015 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

పాడి సొమ్ము పక్కదారి

పాడి సొమ్ము పక్కదారి

పాల సేకరణ ప్రోత్సాహకంలో అక్రమాలు
(బొల్లోజు రవి)  రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం ప్రకటించిన ‘ప్రోత్సాహకం’ పక్కదారి పడుతోంది.. ప్రభుత్వ సంస్థ అయిన రాష్ట్ర డెయిరీ సమాఖ్య (విజయ డెయిరీ) ప్రైవేటు డెయిరీల నిర్వాహకులకు, దళారులకు కొమ్ముకాస్తోంది.. పాల సేకరణపై రైతులకు లీటరుకు రూ. 4 చొప్పున చెల్లించాల్సిన ప్రోత్సాహకం వ్యాపారులు, అధికారుల జేబుల్లోకి వెళుతోంది. పలు ప్రైవేటు డెయిరీలు, దళారులు పాల ధర తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ..

విజయ డెయిరీకి సరఫరా చేస్తున్నారు. అధికారులు కమీషన్లు పుచ్చుకుని ఆ పాలను సేకరిస్తున్నారు. మొత్తంగా సాధారణ పాడి రైతుల నుంచి పాల సేకరణను గాలికి వదిలేసి, వారి నోట్లో మట్టికొడుతున్నారు. ఈ అవకతవకల్లో దాదాపు రూ. 10 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు అంచనా. ప్రైవేటు డెయిరీల నుంచి పాలు సేకరిస్తున్న ఈ అధికారులే.. రైతులకు ప్రకటించిన ప్రోత్సాహకంతో పాల సేకరణ నాలుగు రెట్లు పెరిగిందంటూ గొప్పలు చెప్పుకుంటుండడం గమనార్హం. ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధి ఒకరు దీనికి వంతపాడుతుండటం విమర్శలకు తావిస్తోంది.

రైతులను ఆదుకొనేందుకు..
విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తూ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో సన్న, చిన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు పాడిని ప్రత్యామ్నాయంగా మలుచుకుంటున్నందున.. వారిని ఆదుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీని ప్రకారం గత ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ సేకరణ ధర లీటరుకు రూ.24కు అదనంగా మరో రూ. 4 చొప్పున చెల్లిస్తున్నారు. అంటే మొత్తంగా లీటరుకు రూ.28 ఇస్తున్నారు.
 
ఈ ప్రోత్సాహకం అమల్లోకి రావడానికి ముందు గతేడాది అక్టోబర్ నెలలో విజయ డెయిరీ 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించింది. కానీ ‘ప్రోత్సాహకం’ అమల్లోకి వచ్చాక నెలవారీ పాల సేకరణ భారీగా పెరిగిపోతూ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌లో సేకరించిన పాలు 5.27 లక్షల లీట ర్లు కావడం గమనార్హం. ఏడాదిలోనే నాలుగు రెట్లకు పైగా పెరిగింది. దీనికి కారణం ప్రైవే టు డెయిరీలు, దళారులు, బినామీదారులు విజయ డెయిరీకి పాలు సరఫరా చేయడమే.

పక్క రాష్ట్రాల నుంచి సేకరిస్తూ..
ప్రస్తుతం విజయ డెయిరీ అధికారులు నెలకు 5.27 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. అందులో ప్రైవేటు డెయిరీల నుంచే దాదాపు 75 వేల నుంచి లక్ష లీటర్ల వరకు, మరో లక్షన్నర లీటర్లను దళారులు, బినామీదారుల నుంచి సేకరిస్తున్నారు. ఈ దళారులు, వ్యాపారులు కూడా రాష్ట్ర రైతులను కాదని.. పక్క రాష్ట్రాల రైతుల నుంచి పాలను కొనుగోలు చేసుకుని వచ్చి విజయ డెయిరీకి ఇస్తున్నారు.

అసలు కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు లీటరు పాలకు రూ.18 ను మాత్రమే రైతులకు చెల్లిస్తున్నాయి. అదే విజయ డెయిరీ రూ. 4 ప్రోత్సాహకంతో కలిపి రూ. 28 చెల్లిస్తోంది. లీటరుకు రూ. 10 తేడా ఉండటంతో ఆ రాష్ట్రాల నుంచి రూ. 18 చొప్పున సేకరించి, రూ. 28 ధరకు విజయ డెయిరీకి విక్రయిస్తున్నారు. అయితే ఇలా పక్క రాష్ట్రాల నుంచి సేకరించిన పాలను తీసుకోవడం, రూ.కోట్ల విలువైన సొంత ఫారాలు నడుపుతున్న వ్యాపారులకు కూడా రూ. 4 ప్రోత్సాహకం ఇవ్వడం వెనుక లాలూచీ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
 
పెద్ద ఎత్తున అవకతవకలు
ఏప్రిల్ నుంచి సరిత, ఎంఎన్‌ఆర్, ధరణి, లక్ష్మీనరసింహ డెయిరీ ఫారాలు, జూన్ నుంచి డెక్కన్ ఆగ్రో, కపిల డెయిరీలు, ఆగస్టు నుంచి సిరి డెయిరీ పాలను ‘విజయ’కు విక్రయిస్తున్నాయి. అంటే ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించిన త ర్వాతే వీరంతా విజయ డెయిరీతో ఒప్పం దాలు చేసుకున్నారని స్పష్టమవుతోంది. ఈ ఏడాది కాలంలో ప్రోత్సాహకం కింద విజ య డెయిరీ రూ. 42 కోట్లు చెల్లించగా..

అందులో దాదాపు రూ. 5 కోట్లు ప్రైవేటు డెయిరీల చేతుల్లోకి, మరో రూ. 5 కోట్ల వరకు దళారులు, బినామీదారుల చేతుల్లోకి వెళ్లినట్లు అంచనా. విచిత్రమేమంటే ప్రైవేటు డెయిరీలకు రూ. 4 ప్రోత్సాహకంతోపాటు నిర్వహణ, రవాణా ఖర్చుల కిం ద రూ. 4 నుంచి రూ. 5 వరకు కూడా చెల్లిస్తున్నారు. సొంత పాల సేకరణ కేంద్రాల నిర్వహణకు ఇచ్చే సొమ్మును కూడా ప్రైవే టు డెయిరీలకు ఇవ్వడంపై వి మర్శలు వస్తున్నాయి.

మొత్తంగా రూ. 10 కోట్ల వర కు పక్కదారి పట్టినట్లు తెలుస్తోం ది. ఇక రైతులకు బిల్లుల సొమ్ము చెల్లించడానికి 15 నుంచి 20 రోజులు తీసుకుంటున్న విజయ డెయిరీ... కొన్ని ప్రైవేటు డెయిరీలకు రోజువారీగా చెల్లిస్తుండటం గమనార్హం.
 
జీవోలో రైతులకే అని ఉంది.. కానీ..
‘‘ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో రైతులకే రూ. 4 ప్రోత్సాహకం చెల్లించాలన్న నిబంధన ఉంది. మేం పాలు సేకరిస్తున్న ఇతర డెయిరీలన్నీ కూడా సొంతంగా ఫారా లు పెట్టుకొని నడిపిస్తున్నాయి. వాటిల్లో ఒక్కోదానిలో వంద నుంచి 800 వరకు గేదెలున్నాయి. ఈ డెయిరీల నుంచి సేకరించకూడదన్న నిబంధనలేమీ లేవు. విజయ డెయిరీకి పాలను సేకరించాలంటే ఇది తప్పదు. ఆ డెయిరీలేవీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి పాలను సేకరించడం లేదు..’’
- కామేష్, విజయ డెయిరీ జనరల్ మేనేజర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement