salavuddin
-
వైరల్: మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు 5 లీటర్ల పెట్రోల్!
భోపాల్: పెట్రోధరలు రోజురోజుకు భగ్గుమంటున్నాయి. కొన్నిరాష్టాల్లో పెట్రోధరలు ఇప్పటికే సెంచరీ దాటేయగా, మరికొన్ని చోట్ల సెంచరీకి చేరువలో ఉన్నాయి. డీజీల్ కూడా అదే బాటలో పయనిస్తోంది. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తమదైన శైలీలో వ్యంగ్యంగా నిరసనలు తెలియజేస్తున్నారు. కాగా, ఇటీవల భోపాల్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్.. పెట్రోల్ ధరల సమస్యను ప్రత్యేకమైన రీతిలో హైలైట్ చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్‌కు 5 లీటర్ల పెట్రో క్యాన్‌ను నిర్వాహకులు బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, సలావుద్దీన్ అబ్బసీ ఈ పెట్రో అవార్డును గెలుచుకున్నాడు. ఈ టోర్నమెంట్ భోపాల్ కాంగ్రెస్ నాయకుడు మనోజ్‌శుక్లా ఆధ్వర్యంలో జరిగింది. అయితే, ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ ముందు నిలబడి పెట్రోల్ రేటు సెంచరి కొట్టేసిందోచ్ అంటూ తన నిరసనను బ్యాట్ పైకెత్తి మరీ చూపించాడు.. కాగా, కరూర్ జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ యజమాని తిరుక్కురుల్ పద్యాలను తప్పులు లేకుండా చదివిన విద్యార్థులకు 1 లీటర్ పెట్రోల్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: పెట్రో బేజారు..సైకిల్ షి‘కారు’ -
హైదరాబాద్ @ మజ్లిస్ అడ్డా
సాక్షి, హైదరాబాద్ : దాదాపు 400 సంవత్సరాల ప్రాచీన నగరం హైదరాబాద్ పాతబస్తీ. ఇదే హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం. హిందూ, ముస్లింలు సోదర భావంతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా కనిపిస్తుంటారు. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాల మేనిఫెస్టోలు, ఇతరత్రా ప్రచార అంశాలేవీ ప్రభావం చూపవు. బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలే జెండా ఎగురవేస్తాయి. దీంతో ఇక్కడ పార్టీల కంటే మత రాజకీయాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ఇక్కడ ముస్లిం సామాజికవర్గం ఓట్లు అధికం. ముస్లిం పక్షాన గళం విప్పే మజ్లిస్ పార్టీకి గట్టి పట్టుంది. ఇక్కడి ప్రజానీకంపై ఆ పార్టీ తనదంటూ చెరగని ముద్ర వేసుకుంది. గత మూడున్నర దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. ఆదిలో కాంగ్రెస్ శకం సాగినప్పటికీ.. ఆ తర్వాత మజ్లిస్ పార్టీ పాగా వేసి తిరుగులేని శక్తిగా ఎదిగింది. దశాబ్దాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో హేమాహేమీలను రంగంలోకి దింపి మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. తొలిదశలో కాంగ్రెస్‌దే హవా.. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. నిజాం పాలన విముక్తి కోసం తెలంగాణ సాయిధ పోరాటానికి సారధ్యం వహించిన ‘కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్’ (పీడీఎఫ్) ఎన్నికల బరిలో దిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందు నిలవలేక పోయింది. హైదరాబాద్ స్టేట్‌లో లోక్‌సభకు తొలిసారిగా 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నిజాం పాలనలో మంత్రిగా పనిచేసిన అహ్మద్ మోహియిద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ప్రముఖ కమ్యూనిస్టు నేత మగ్దూం మోహియుద్దీన్పై విజయం సాధించారు. తర్వాత 1957లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజతో అహ్మద్ మొహియుద్దీన్ కొత్తగా ఏర్పడ్డ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మారిపోయారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా వినాయక్‌రావు రంగంలోకి దిగి ఇండిపెండెంట్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన గోపాల్ ఎస్ మెల్కొటే వరుసగా 1962, 1967లో విజయ ఢంకా మోగించారు. 1971లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మెల్కొటే తెలంగాణ ప్రజా సమితి పక్షాన బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ నుంచి కేఎస్ నారాయణ వరుసగా రెండుసార్లు గెలిచారు. 1984 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో పడిపోయి.. క్రమంగా పూర్తిగా ‘హైదరాబాద్’లో వెనుకబడిపోయింది. హైదరా‘బాద్’షా మజ్లిస్ మజ్లిస్ పార్టీకి కంచుకోట హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి మూడున్నర దశాబ్దాలుగా వరుసగా ప్రాతినిథ్యం వహిస్తోంది. మజ్లిస్‌కు ఆదిలో వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ పట్టు వీడకుండా ఎన్నికల బరిలో దిగి పట్టు బిగించి వరస విజయాలు తన ఖాతాలో వేసుకుంటోంది. మొదట్లో మజ్లిస్ పార్టీ ‘స్వతంత్రుల’ పేరుతో ఎన్నికల బరిలో దిగి గట్టిపోటీ ఇచ్చింది. ‘మజ్లిస్ ఇతేహదుల్ ముస్లిమీన్’ (ఎంఐఎం) పార్టీ పునర్నిర్మాణం తర్వాత తొలిసారిగా ఇండిపెండెంట్‌గా బరిలో దిగి పరాజయం పాలైంది. 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వాహెద్ ఒవైసీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గట్టి పోటీనిచ్చినా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాహెద్ అనంతరం ఆయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత పార్టీ పక్షాన మహ్మద్ అమానుల్లా ఖాన్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దింపగా.. ఆయన మూడోస్థానానికే పరిమితమయ్యారు. 80వ దశకంలో టీడీపీ ఆవిర్భావం మజ్లిస్ పార్టీకి కలిసొచ్చింది. 1984లో మజ్లిస్ బోణీ లోక్‌సభకు 1984లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నుంచి ఇండిపెండెంట్‌గా సుల్తాన్ సలావుద్దీన్ బరిలోకి దిగి తొలిసారి గెలుపు ఖాతా తెరిచారు. అప్పట్లో కొత్తగా ఆవిర్భ వించిన టీడీపీ నుంచి పోటీ చేసిన కె.ప్రభాకర్‌రెడ్డి రెండో స్థానంలోను, కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. తిరిగి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నేరుగా ‘మజ్లిస్ పార్టీ’ పేరుతో ఎన్నికల బరిలో దిగి విజయం సాధించింది. తర్వాత మజ్లిస్ పార్టీ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతిసారి ఎన్నికల్లో అధికార పక్షాలతో చేసుకున్న ఒప్పందాలు కూడా ఆ పార్టీకి కలిసొచ్చాయి. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వరుసగా ఆరు సార్లు ఎంపీగా ఎన్నికవగా.. తద నంతరం ఆయన వారసుడిగా అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల బరిలోకి దిగి వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆయనే బరిలోకి దిగుతున్నారు. వికసించని ‘కమలం’ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కమలం హిందుత్వ ఎజెండాతో గట్టిపోటీ ఇస్తున్నా విజయాన్ని మాత్రం చేరుకోలేకపోతోంది. ప్రతిసారి ఎన్నికల్లో హేమా హేమీలను రంగంలోకి దింపి విజయం కోసం శత విధాలా ప్రయత్నిస్తూనే ఉంది. తొలిసారి 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్ అభ్యర్థిగా ఆలెæ నరేంద్ర బరిలోకి దిగి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చినా విజయాన్ని దక్కించుకోలేకపోయారు. టీడీపీ ఆవిర్భావం అనంతరం మిత్రపక్షం కారణంగా బీజేపీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు. తర్వాత 1991లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బద్దం బాల్‌రెడ్డి కూడా పోటీ ఇచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. 1996లో పార్టీ అగ్రనేత ఎం. వెంకయ్యనాయుడు ఎన్నికల బరిలో దిగినా పరాభవమే ఎదురైంది. తర్వాత వరుసగా రెండుసార్లు తిరిగి బద్దం బాల్‌రెడ్డి పోటీ చేసినా ఓటమే పునరావృతమైంది. బాల్‌రెడ్డి తర్వాత సుభాష్ చంద్రాజీ, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్ భగవంతరావులను ఎన్నికల బరిలోకి దింపినా ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. తాజాగా ప్రస్తుత (2019) లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా భగవంతరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీకి సైతం పరాభవమే.. తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే పరాభవం ఎదురైంది. పార్టీ ఆవిర్భావం నుంచి వరసగా రెండు పర్యాయాలు బీజేపీ మద్దతుతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ ‘సైకిల్’కు పరాజయం తప్పలేదు. 1984లో కె. ప్రభాకర్‌రెడ్డి, 1989లో తీగల కృష్ణారెడ్డి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానానంతో సరిపెట్టుకున్నారు. తర్వాత పటోళ్ల ఇంద్రారెడ్డి బరిలోకి దిగి మూడో స్థానంలోకి పడిపోయారు.1996లో తిరిగి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా.. ఆరోస్థానానికి పరిమితమయ్యారు. తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ పక్షాన ‘సియాసత్’ ఉర్దూ పత్రిక ఎడిటర్ జహీద్ అలీఖాన్ గట్టి పోటీ ఇచ్చిన్పపటికీ రెండో స్థానంలోనే ఉండిపోయారు. ఆ తర్వాత టీడీపీ పోటీ ఉనికికే పరిమితమైంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడి నుంచి నామమాత్రపు పోటీతోనే సరిపెట్టుకుంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ‘గులాబీ’ అభ్యర్థి పోటీ చేసినా డిపాజిట్ కోల్పోయాడు. గెలుపు ఓటములు తొలిసారి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ కమ్యూనిస్టు నేత మగ్దూం మొహియుద్దీన్ ‘పీడీఎఫ్’ పక్షాన పోటీచేసి ఓటమి పాలయ్యారు. స్వాతంత్య్రం అనంతరం మజ్లిస్ పార్టీ పగ్గాలు చేపట్టిన అబ్దుల్ వాహేద్ ఓవైసీ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి గట్టి పోటీ ఇచ్చినా విజయం కాంగ్రెస్‌నే వరించింది. జీఎస్ మెల్కోటే హ్యాట్రిక్ సాధించారు. రెండుసార్లు కాంగ్రెస్ పక్షాన, ఒకసారి తెలంగాణ ప్రజా సమితి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పక్షాన కేఎస్ నారాయణ రెండుసార్లు విజయం సాధించారు. మజ్లిస్ పార్టీకి చెందిన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఒకసారి ఓటమి పాలైనా తర్వాత వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. ఒకసారి ఇండిపెండెంట్‌గా, ఐదుసార్లు మజ్లిస్ పక్షాన ఎన్నికయ్యారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వరసగా మూడు సార్లు ఎన్నికై హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగారు. బీజేపీ పక్షాన బద్దం బాల్‌రెడ్డి మూడు పర్యా యాలు, ఆలె నరేంద్ర, ఎం.వెంకయ్య నాయుడు ఒక్కోసారి పోటీచేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఒకసారి ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. విజయం.. ఏ పార్టీ ఎన్నిసార్లు.. కాంగ్రెస్ : 06 టీపీఎస్ : 01 మజ్లిస్ : 09 తొలి ఎంపీ : అహ్మద్ మొహియుద్దీన్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ : అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్ హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు.. చార్మినార్ చాంద్రాయణగుట్ట యాకుత్‌పురా బహదూర్‌పురా కార్వాన్ మలక్‌పేట గోషామహల్ -
హ్యాట్రిక్ విన్
సాక్షి,సిటీబ్యూరో: ఎంఐఎంకు కంచుకోటగా నిలిచిన హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత సలావుద్దీన్ ఒవైసీ, ఆయన తనయుడు అసదుద్దీన్ ఒవైసీ వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్‌సాధించారు. ప్రతి ఎన్నికలోనూ ప్రత్యర్థులను మట్టికరిపించి,తిరుగులేని నేతలుగా రాణించారు. సలావుద్దీన్ ఒవైసీ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించి,డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ♦ సలావుద్దీన్ ఒవైసీ మజ్లిస్ పార్టీని స్థాపించి నగరంలో అత్యంత ప్రభావితమైన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ఎంఐఎం వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్దుల్ వాహెద్ ఒవైసీ తనయుడు సలావుద్దీన్ తండ్రికి రాజకీయ వారసుడిగా నిలిచారు. 1958 నుంచే నగర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగా రు. వాహెద్ మరణానంతరం ఎంఐఎం అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 1960లో తొలిసారి మల్లేపల్లి నుంచి మున్సిపల్ కౌన్సిలర్‌గా గెలిచారు. 1962లో పత్తర్‌గట్టి, 1967లో యాకుత్‌పురా, 1972లో పత్తర్‌గట్టి అసెంబ్లీ స్థానాల నుంచి, 1978, 1983లలో చార్మినార్ నుంచి గెలిచారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 38.13 శాతం మెజారిటీతో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. 1989 ఎన్నికల్లో 45.91 శాతం, 1991లో 46.18 శాతం మెజారిటీ సొంతం చేసుకున్నారు. 1996 ఎన్నికల్లో 34.57 శాతం, 1998లో 44.65 శాతం, 1999లో 44.36 శాతం మెజారిటీతో గెలిచారు. వరుసగా ఆరుసార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అనారోగ్యం కారణంగా 2004లో రాజకీయాలకు దూరమైన సలావుద్దీన్ 2008 సెప్టెంబర్‌లో మరణించారు. ♦ అసదుద్దీన్ ఒవైసీ సలావుద్దీన్ తర్వాత ఎంఐఎం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అసదుద్దీన్ ఒవైసీ 1994 నుంచి వరుసగా మూడుసార్లు చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2004లో తన తండ్రి సలావుద్దీన్ క్రియాశీలక రాజకీయాల కు దూరం కావడంతో హైదరాబాద్ పార్లమెంట్ సానం పోటీ చేసి విజయం సాధించారు. 2009లో అసద్‌ను ఓడించేందుకు టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలన్నీ ఏకమయ్యాయి. అసద్‌కు వ్యతిరేకంగా సియాసత్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ ను బరిలోకి దింపాయి. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొంది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హైదరాబాద్ ఎంపీగా తిరుగులేని నేతగా నిలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఆయన ఘన విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం నాలుగో పోటీకి సిద్ధమవుతున్నారు. ♦ సూదిని జైపాల్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన సూదిని జైపాల్‌రెడ్డి అపర మేధావి. ఆయన పార్లమెంట్లో ఆంగ్లంలో ప్రశ్నలడిగితే సభ్యులు నిఘంటువులు వెతకాల్సిన పరిస్థితి. సమస్యలను, సవాళ్లను చాకచక్యంగా చర్చించగల సమర్థుడిగా పేరొందిన జైపాల్‌రెడ్డికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కీలకమైన పదవులే లభించాయి. కాంగ్రెస్‌లో గొప్ప నేతగా ఎదిగిన జైపాల్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించారు. మంత్రిగా వివిధ హోదాల్లో పని చేశారు. శాస్త్ర సాంకేతిక, ప్రసార, సమాచార శాఖలు చూశారు. యూపీఏలో కీలకమైన నేతగా ఎదిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ తన కర్తవ్యాన్ని నిర్వహించారు. 1999, 2004 ఎన్నికల్లో వరుసగా మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో మిర్యాలగూడ రద్దయింది. కొత్తగా చేవెళ్ల నియోజకవర్గం ఆవిర్భవించింది. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి జైపాల్‌రెడ్డి వరుసగా మూడోసారి గెలుపొందారు. మన్మోహన్ కేబినెట్లోనూ కేంద్రమంత్రిగాసేవలందించారు. -
చూడితోనే పాడి
* పశుపోషణలో పౌష్టికాహారం, పరిశుభ్రతే ముఖ్యం * హవేళీఘనపూర్ ఎల్ఎస్ఏ సలావుద్దీన్ పాడి అభివృద్ధిలో.. పశువులు క్రమం తప్పకుండా చూడి కట్టడం అత్యంత ప్రధానమైన అంశమని హవేళీఘనపూర్ వెటర్నరీ లైవ్‌స్టాక్ అసిస్టెంట్ (ఎల్ఎస్ఏ) సలావుద్దీన్(సెల్: 9908696833) తెలిపారు. సహజంగా 75శాతం పాడి గేదెలు, ఆవులు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య ఎదకు వస్తాయని చెప్పారు. ఈ సమయాన్ని బ్రీడింగ్ సీజన్ అంటారన్నారు. ఈ కాలంలో చూడి కట్టని మూగజీవాలు సక్రమంగా ఎదకు రావ ని స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి లాభం లేకుండా వీటిని ఏడాది పొడవునా పోషించాల్సి ఉంటుందన్నారు. ఇలా కాకుండా రైతులు, పశు పోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. - మెదక్ రూరల్ సకాలంలో ఎదను గుర్తించాలి * పాడి పశువులు చూడి కట్టడం అనేది అవి ఎదకు వచ్చిన సమయాన్ని గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. * ఎదకు వచ్చిన పశువు అరవడం, తెల్లని తీగలు వేయడం, యోని ఉబ్బడం, మేత సరిగ్గా మేయకపోవటం, పాలు తగ్గటం, నిలకడగా ఉండకపోవడం, అదేపనిగా మూత్రం పోయడం, ఇతర పశువులపైకి ఎక్కడం వంటివి చేస్తుంటాయి. * వేసవిలో ఎద లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. * ముర్రా, బ్రీడెడ్ జాతి గేదెలు ఎదకు వచ్చినా ఎలాంటి లక్షణాలను ప్రదర్శించవు. దీన్ని మూగ ఎద అంటారు. * ఈ లక్షణాలను వేకువజామున సులభంగా గుర్తించవచ్చు. * మూగ ఎదను గుర్తించడానికి దున్నపోతును ఉపయోగించవచ్చును. సరైన పోషణ ఉండాలి * బ్రీడింగ్ సీజన్లో ప్రతీ పాడి గేదెపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. * తొలకరి వర్షాలకు పెరిగే పచ్చగడ్డి పశువుల్లో పోషక విలువలను గణనీయంగా పెంచుతుంది. * ఈ సమయంలో ప్రతీ పశువుకు రోజుకు 30 నుంచి 40 కిలోల పచ్చిగడ్డి మేతగా వేయాలి. * ఇందులోని విటమిన్-ఏ పశువు ఎదకు రావడానికి, గర్భం ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. * పచ్చిగడ్డి సరిగ్గా మేయలేని పశువుకు రోజుకు కిలో దాణా వారానికొకసారి విట మిన్ యూనిట్ల ఇంజక్షన్లు ఇప్పించాలి. * రోజుకు 25నుంచి 50 గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వాలి. * పోషణ సక్రమంగా ఉన్న పశువులు క్రమం తప్పకుండా ఎదకు వస్తాయి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి * ఎద ఇంజక్షన్ చేయించిన అనంతరం 45 నుంచి 60 రోజుల మధ్య చూడి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. * ఒక్కో గేదె 10 ఈతల వరకు ఈనుతుంది. 7ఈతల తర్వాత పాలఉత్పత్తితగ్గుతుంది. * చూడి నిర్ధారణ జరిగాక పశువుకు పౌష్టిక ఆహారం అందించాలి. * పచ్చగడ్డి, ఖనిజ లవణాలు, విటమిన్లు అధికంగా ఉండే మేతను పశువుకు వేయాలి. * సాధారణ రోజుల కంటే చూడి కాలంలో ఒకటినుంచి రెండు కిలోల అదనపు దాణా అందించాలి. * సరైన పోషణ లేకపోతే చూడికాలం పూర్తవకుండానే దూడ పుట్టే అవకాశాలు ఉన్నాయి. * ఇలా జరిగిందంటే పుట్టిన దూడ బలహీనంగా ఉండటంతో పాటు వ్యాధి నిరోధ క శక్తిలేక మరణించే ప్రమాదం ఉంటుంది. చల్లని ప్రదేశంలో కట్టేయాలి * ఆవులు, గేదెల ఎద కాలం ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే ఉంటుంది. * పశువు యోని వెంట పచ్చని నీటి లాంటి తీగలు పడుతుంటాయి. * ఇది గమనించి పశువు వెన్నుపై నిమిరితే తోక కొంచెం పైకిత్తుతుంది. * ఈ లక్షణాలను గుర్తించి పశువు ఎదకు వచ్చిందని గుర్తించాలి. * చూడి కట్టించేటప్పుడు పశువును శుభ్రంగా కడగాలి. * ముఖ్యంగా మానం చుట్టూ పేడ, మట్టి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. * ఎదకు వచ్చిన గేదె, ఆవులను ఆరోగ్యవంతమైన, మేలురకం దున్నపోతు, కోడెతో క్రాస్ చేయించాలి. * పదేళ్ల వయస్సు దాటిన దున్నపోతులు, కోడెలను చూడి కట్టించేందుకు ఉపయోగించవద్దు. * ఎదను గుర్తించిన తర్వాత గేదెలు, ఆవులను పశువైద్యశాలకు తీసుకెళ్లి సిమన్ వేయించాలి. * ఒకేసారి రెండు ఇంజక్షన్లు కాకుండా 5నుంచి 6గంటల వ్యవధిలో రెండు సూదులు వేయించాలి. * చూడి కట్టించిన రోజున సదరు గేదె, ఆవును బయటకు వదలకూడదు. * చల్లని, పరిశుభ్రంగా ఉన్న ప్రదేశంలో కట్టేయాలి. * ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో శుభ్రంగా కడగాలి. -
‘నిర్మల భారత్’తో ఇంటింటా మరుగుదొడ్డి
జిల్లాలో 2.10 లక్షల మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం జెడ్పీ సీఈఓ మహమ్మద్ సలావుద్దీన్ సాక్షి, బళ్లారి :నిర్మల భారత్ పథకం కింద ఇంటింటా మరుగుదొడ్లు నిర్మించేందుకు మూడు రోజుల పాటు అధికారులు సర్వే జరిపేందుకు చర్యలు తీసుకున్నట్లు జెడ్పీ సీఈఓ మహమ్మద్ సలావుద్దీన్ తెలిపా రు. గురువారం ఆయన జెడ్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిర్మల భారత్‌లో ఇంటింటా మరుగుదొడ్డిని నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొదట ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు అభియాన్ కార్యక్రమం ఉంటుందని, 26 నుంచి మరో మూడు రోజుల పాటు నిర్మించిన వాటికి డబ్బులు చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. అక్టోబర్ 14 నుంచి మూడు రోజుల పాటు నిర్మించిన మరుగుదొడ్లను తనిఖీ చేస్తామని, మరుగుదొడ్లు నిర్మించక పోతే నిధులు ఇవ్వబోమన్నారు. ఒక్కొక్క మరుగుదొడ్డికి రూ.10,100 ఉంటుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4,700, మిగిలిన వాటా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,11,799 కుటుంబాలు ఉండగా, ఇందులో 1,01,852 కుటుంబాలు మరుగుదొడ్లు పొంది ఉన్నారని, ఇంకా 2,09,947 కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. 2013 -14లో 22 వేల మరుగుదొడ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో 13,998 మాత్రమే నిర్మాణం జరిగిందన్నారు. 2014-15లో 48,684 మరుగుదొడ్లు లక్ష్యం ఉండగా, ఇందులో ఆగస్టు నెలాఖరు వరకు 4,474 నిర్మాణం జరిగిందన్నారు. నిర్మల భారత్ అభియాన్ పథకం ద్వారా రూ.2.10 కోట్లు, ఉపాధిహామీ పథకం ద్వారా రూ.2.41 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఈ మొత్తం నిధులన్నీ మరుగుదొడ్ల కోసం ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా 48 పాఠశాలలు, 28 అంగన్వాడీ కేంద్రాల్లోనూ మరుగుదొడ్లు నిర్మించే ప్రక్రియ సాగుతుందని తెలిపారు. ఈ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీకి వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ ఉప కార్యదర్శి శివరామగౌడ పాల్గొన్నారు.