హైదరాబాద్‌ @ మజ్లిస్‌ అడ్డా | Hyderabad Parliament Shandhar Majlis Party | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ @ మజ్లిస్‌ అడ్డా

Published Sun, Mar 24 2019 11:11 AM | Last Updated on Sun, Mar 24 2019 11:11 AM

Hyderabad Parliament Shandhar  Majlis Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దాదాపు 400 సంవత్సరాల ప్రాచీన నగరం హైదరాబాద్‌ పాతబస్తీ. ఇదే హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం. హిందూ, ముస్లింలు సోదర భావంతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా కనిపిస్తుంటారు. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాల మేనిఫెస్టోలు, ఇతరత్రా ప్రచార అంశాలేవీ ప్రభావం చూపవు. బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలే జెండా ఎగురవేస్తాయి. దీంతో ఇక్కడ పార్టీల కంటే మత రాజకీయాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి.

ఇక్కడ  ముస్లిం సామాజికవర్గం ఓట్లు అధికం. ముస్లిం పక్షాన గళం విప్పే మజ్లిస్‌ పార్టీకి గట్టి పట్టుంది. ఇక్కడి ప్రజానీకంపై ఆ పార్టీ తనదంటూ చెరగని ముద్ర వేసుకుంది. గత మూడున్నర దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది.  ఆదిలో కాంగ్రెస్‌ శకం సాగినప్పటికీ.. ఆ తర్వాత మజ్లిస్‌ పార్టీ పాగా వేసి తిరుగులేని శక్తిగా ఎదిగింది. దశాబ్దాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో హేమాహేమీలను రంగంలోకి దింపి మజ్లిస్‌ కంచుకోటను బద్దలు కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది.

తొలిదశలో కాంగ్రెస్‌దే హవా.. 
హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్‌ హవా కొనసాగింది. నిజాం పాలన విముక్తి కోసం తెలంగాణ సాయిధ పోరాటానికి సారధ్యం వహించిన ‘కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌’ (పీడీఎఫ్‌) ఎన్నికల బరిలో దిగినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ముందు నిలవలేక పోయింది. హైదరాబాద్‌ స్టేట్‌లో లోక్‌సభకు తొలిసారిగా 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నిజాం పాలనలో మంత్రిగా పనిచేసిన అహ్మద్‌ మోహియిద్దీన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి ప్రముఖ కమ్యూనిస్టు నేత మగ్దూం మోహియుద్దీన్‌పై విజయం సాధించారు.

తర్వాత 1957లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజతో అహ్మద్‌ మొహియుద్దీన్‌ కొత్తగా ఏర్పడ్డ సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి మారిపోయారు. దీంతో  కాంగ్రెస్‌ అభ్యర్థిగా వినాయక్‌రావు రంగంలోకి దిగి ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పక్షాన గోపాల్‌ ఎస్‌ మెల్కొటే వరుసగా 1962, 1967లో విజయ ఢంకా మోగించారు. 1971లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ మెల్కొటే తెలంగాణ ప్రజా సమితి పక్షాన బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్‌ నుంచి కేఎస్‌ నారాయణ వరుసగా రెండుసార్లు గెలిచారు. 1984 ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానంలో పడిపోయి.. క్రమంగా పూర్తిగా ‘హైదరాబాద్‌’లో వెనుకబడిపోయింది.  

హైదరా‘బాద్‌’షా మజ్లిస్‌ 
మజ్లిస్‌ పార్టీకి కంచుకోట హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి మూడున్నర దశాబ్దాలుగా వరుసగా ప్రాతినిథ్యం వహిస్తోంది. మజ్లిస్‌కు ఆదిలో వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ పట్టు వీడకుండా ఎన్నికల బరిలో దిగి పట్టు బిగించి వరస విజయాలు తన ఖాతాలో వేసుకుంటోంది. మొదట్లో మజ్లిస్‌ పార్టీ ‘స్వతంత్రుల’ పేరుతో ఎన్నికల బరిలో దిగి గట్టిపోటీ ఇచ్చింది. ‘మజ్లిస్‌ ఇతేహదుల్‌ ముస్లిమీన్‌’ (ఎంఐఎం) పార్టీ పునర్నిర్మాణం తర్వాత తొలిసారిగా ఇండిపెండెంట్‌గా బరిలో దిగి పరాజయం పాలైంది.

1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వాహెద్‌ ఒవైసీ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి గట్టి పోటీనిచ్చినా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాహెద్‌ అనంతరం ఆయన కుమారుడు సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఓవైసీ 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి కాంగ్రెస్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత పార్టీ పక్షాన మహ్మద్‌ అమానుల్లా ఖాన్‌ను ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీకి దింపగా.. ఆయన మూడోస్థానానికే పరిమితమయ్యారు. 80వ దశకంలో టీడీపీ ఆవిర్భావం మజ్లిస్‌ పార్టీకి కలిసొచ్చింది.  

1984లో మజ్లిస్‌ బోణీ 
లోక్‌సభకు 1984లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ నుంచి ఇండిపెండెంట్‌గా సుల్తాన్‌ సలావుద్దీన్‌ బరిలోకి దిగి తొలిసారి గెలుపు ఖాతా తెరిచారు. అప్పట్లో కొత్తగా ఆవిర్భ వించిన టీడీపీ నుంచి పోటీ చేసిన కె.ప్రభాకర్‌రెడ్డి రెండో స్థానంలోను, కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. తిరిగి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నేరుగా ‘మజ్లిస్‌ పార్టీ’ పేరుతో ఎన్నికల బరిలో దిగి విజయం సాధించింది. తర్వాత మజ్లిస్‌ పార్టీ వెనక్కి తిరిగి చూడలేదు.

ప్రతిసారి ఎన్నికల్లో అధికార పక్షాలతో చేసుకున్న ఒప్పందాలు కూడా ఆ పార్టీకి కలిసొచ్చాయి. సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఓవైసీ వరుసగా ఆరు సార్లు ఎంపీగా ఎన్నికవగా.. తద నంతరం ఆయన వారసుడిగా అసదుద్దీన్‌ ఓవైసీ ఎన్నికల బరిలోకి దిగి  వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆయనే బరిలోకి దిగుతున్నారు. 

వికసించని ‘కమలం’ 
హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కమలం హిందుత్వ ఎజెండాతో గట్టిపోటీ ఇస్తున్నా విజయాన్ని మాత్రం చేరుకోలేకపోతోంది. ప్రతిసారి ఎన్నికల్లో హేమా హేమీలను రంగంలోకి దింపి విజయం కోసం శత విధాలా ప్రయత్నిస్తూనే ఉంది. తొలిసారి 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్‌ అభ్యర్థిగా ఆలెæ నరేంద్ర బరిలోకి దిగి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చినా విజయాన్ని దక్కించుకోలేకపోయారు.

టీడీపీ ఆవిర్భావం అనంతరం మిత్రపక్షం కారణంగా బీజేపీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు. తర్వాత 1991లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బద్దం బాల్‌రెడ్డి కూడా పోటీ ఇచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. 1996లో పార్టీ అగ్రనేత ఎం. వెంకయ్యనాయుడు ఎన్నికల బరిలో దిగినా పరాభవమే ఎదురైంది. తర్వాత వరుసగా రెండుసార్లు తిరిగి బద్దం బాల్‌రెడ్డి పోటీ చేసినా ఓటమే పునరావృతమైంది.

బాల్‌రెడ్డి తర్వాత సుభాష్‌ చంద్రాజీ, భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్‌ భగవంతరావులను ఎన్నికల బరిలోకి దింపినా ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. తాజాగా ప్రస్తుత (2019) లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా భగవంతరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 

టీడీపీకి సైతం పరాభవమే.. 
తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే పరాభవం ఎదురైంది. పార్టీ ఆవిర్భావం నుంచి వరసగా రెండు పర్యాయాలు బీజేపీ మద్దతుతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ ‘సైకిల్‌’కు పరాజయం తప్పలేదు. 1984లో కె. ప్రభాకర్‌రెడ్డి, 1989లో తీగల కృష్ణారెడ్డి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానానంతో సరిపెట్టుకున్నారు. తర్వాత పటోళ్ల ఇంద్రారెడ్డి బరిలోకి దిగి మూడో స్థానంలోకి పడిపోయారు.1996లో  తిరిగి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా.. ఆరోస్థానానికి పరిమితమయ్యారు. తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ పక్షాన ‘సియాసత్‌’ ఉర్దూ పత్రిక ఎడిటర్‌ జహీద్‌ అలీఖాన్‌ గట్టి పోటీ ఇచ్చిన్పపటికీ రెండో స్థానంలోనే ఉండిపోయారు. ఆ తర్వాత టీడీపీ పోటీ ఉనికికే పరిమితమైంది. టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఇక్కడి నుంచి నామమాత్రపు పోటీతోనే సరిపెట్టుకుంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ‘గులాబీ’ అభ్యర్థి పోటీ చేసినా డిపాజిట్‌ కోల్పోయాడు. 

గెలుపు ఓటములు 

  • తొలిసారి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ కమ్యూనిస్టు నేత మగ్దూం మొహియుద్దీన్‌ ‘పీడీఎఫ్‌’ పక్షాన పోటీచేసి ఓటమి పాలయ్యారు. 
  • స్వాతంత్య్రం అనంతరం మజ్లిస్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన అబ్దుల్‌ వాహేద్‌ ఓవైసీ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి గట్టి పోటీ ఇచ్చినా విజయం కాంగ్రెస్‌నే వరించింది.  
  • జీఎస్‌ మెల్కోటే హ్యాట్రిక్‌ సాధించారు. రెండుసార్లు కాంగ్రెస్‌ పక్షాన, ఒకసారి తెలంగాణ ప్రజా సమితి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 
  • కాంగ్రెస్‌ పక్షాన కేఎస్‌ నారాయణ రెండుసార్లు విజయం సాధించారు.  
  • మజ్లిస్‌ పార్టీకి చెందిన సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఓవైసీ ఒకసారి  ఓటమి పాలైనా తర్వాత వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. ఒకసారి ఇండిపెండెంట్‌గా, ఐదుసార్లు మజ్లిస్‌ పక్షాన ఎన్నికయ్యారు. 
  • ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వరసగా మూడు సార్లు ఎన్నికై హ్యాట్రిక్‌ కొట్టారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగారు. 
  • బీజేపీ పక్షాన బద్దం బాల్‌రెడ్డి మూడు పర్యా యాలు, ఆలె నరేంద్ర, ఎం.వెంకయ్య నాయుడు ఒక్కోసారి పోటీచేసి పరాజయం పాలయ్యారు. 
  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కూడా ఒకసారి ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

విజయం.. ఏ పార్టీ ఎన్నిసార్లు..

  • కాంగ్రెస్‌ :   06 
  • టీపీఎస్‌ :   01 
  • మజ్లిస్‌  :  09 
  • తొలి ఎంపీ :  అహ్మద్‌ మొహియుద్దీన్‌ 
  • ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ :  అసదుద్దీన్‌ ఓవైసీ 
  • ప్రస్తుత రిజర్వేషన్‌  : జనరల్‌  

హైదరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు.. 

  • చార్మినార్‌
  • చాంద్రాయణగుట్ట
  • యాకుత్‌పురా
  • బహదూర్‌పురా
  • కార్వాన్‌
  • మలక్‌పేట
  • గోషామహల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement