‘రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈసారి ఇక్కడ పప్పులు ఉడకడం లేదని పసిగట్టింది. దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని చూస్తోంది. దాని ఫలితంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తోంది.
వచ్చే ఐదేళ్లలో సంకీర్ణంతో బలోపేతం కావాలనుకుంటోంది. ప్రజలు మజ్లిస్‌కు 9, బీఆర్‌ఎస్‌కు 110 సీట్లలో సంపూర్ణ మద్దతు ఇచ్చి.. కేసీఆర్ మామకు అధికారం కట్టబెట్టాలి’ అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. బధవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్
కాంగ్రెస్‌తోనే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది
కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. కేంద్రంలో వరుసగా గెలుస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఎంపీల బలం 50కి పడిపోయింది. మోదీ ప్రధాని కావడానికి ఆయనే కారణం. తమ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కోపమంతా మజ్లిస్‌పై ప్రదర్శిస్తున్నారు. ఓట్లు చీల్చుతున్నామని అపవాదు అంటకడుతున్నారు. అమేథీలో మజ్లిస్ పోటీ చేయకపోయినా స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు.
తాత ముత్తాత, నానమ్మ సీట్లను కూడా కాపాడుకోలేకపోయారు. కేరళలోని వయనాడ్‌లో ముస్లిం లీగ్ సహకారంతో 30 శాతం ముస్లిం ఓట్లతో రాహుల్ గెలిచారు. శివసేనతో అధికారం పంచుకున్నప్పుడు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది. ఎంఐఎం, బీఆర్‌ఎస్ కోసం తలుపులు మూసేశామని రాహుల్ చెబుతున్నారు. ఇండియా కూటమిలో మేము ఎలా భాగస్వాములం అవుతాం.
అజహరుద్దీన్.. అసమర్థ రాజకీయవాది
అజహరుద్దీన్ మంచి క్రికెటరే.. కానీ, రాజకీయాల్లో అసమర్థుడు. యూపీలోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రజలు గెలిపిస్తే అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆ తర్వాత రాజస్తాన్‌కు పంపిస్తే అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి ముఖం చూపించలేదు. సొంతగడ్డపై కేటీఆర్ ఆయనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగిస్తే దాని స్థాయి దిగజార్చారు. ఆయన అవినీతిపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే తప్పేంటి? అసమర్థ నేత కాబట్టి ఆయనపై బలమైన మజ్లిస్ అభ్యర్థిని రంగంలోకి దింపాం.
కాంగ్రెస్ చీఫ్ పక్కా ఆర్‌ఎస్‌ఎస్‌వాది
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలో ఏబీవీపీలో పనిచేశారు. కార్వాన్‌లో కిషన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతుగా గుడిమల్కాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆయనను టీడీపీకి పంపిస్తే ఆ పార్టీ అడ్రస్ తెలంగాణలో గల్లంతైంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచనతో కాంగ్రెస్‌లో చేరారు. మోహ¯న్ భగవత్ రిమోట్ కంట్రోల్‌తోనే గాంధీభవన్ పనిచేస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. హైదరాబాద్‌లో మజ్లిస్ బలంగా ఉంది కాబట్టి తెలంగాణలో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించారు. కానీ కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గడ్‌లలో ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలి? అక్కడ ముస్లింలు లేరా..? లేక వారి అభివృద్ధిపై చిత్తశుద్ది లేదా?
బీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తులేదు
బీఆర్‌ఎస్‌తో మజ్లిస్‌కు ఎలాంటి పొత్తు లేదు. ఫ్రెండ్లీ పార్టీ మాత్రమే. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధం ఉంది. మేము ఎవరికీ బీ–టీమ్ కాదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంది కాబట్టి సమర్థిస్తున్నాం.
బీజేపీతో కేసీఆర్‌కు సంబంధం ఉంటే.. తొమ్మిదిన్నరేళ్లలో మైనారిటీల కోసం పెద్దఎత్తున బడ్జెట్ కేటాయింపు జరిగేదా? 201 మైనార్టీ గురుకులాల ఏర్పాటు చేసేవారా? ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తోపాటు ఏటా రూ.650 కోట్లు ముస్లింల విద్య కోసం ఖర్చు పెట్టేవారా? కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. భైంసా ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మతఘర్షణలు జరుగుతాయి. మత సామరస్యం దెబ్బతీంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల.
మతప్రాతిపదిక రిజర్వేషన్ కాదు
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన చేసినవి కావు. ముస్లిం సామాజిక వర్గంలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వారికి మాత్రమే అమలు చేస్తున్నారు. అదీ పీఎస్ కృష్ణన్, మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్ అమలవుతోంటే బీజేపీకి వచ్చిన ఇబ్బందేంటి? తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి మోదీ ప్రభుత్వానికి పంపితే మంజూరు చేయలేదు. బీజేపీ ఇప్పుడు దీన్ని రద్దు చేస్తామని చెబుతోంది. పాఠ్యపుస్తకాల్లో గాం«దీని అవమానపర్చి.. గాంధీని చంపిన గాడ్సే గురించి చదివిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment