సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దమ్ముం టే హైదరాబాద్ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌నేత రాహుల్‌గాందీకి ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. రాహుల్‌గాంధీ పెద్దపెద్ద ప్రకటనలు చేయడం కాదని, బరిలోకి దిగి తనతో తలపడాలని ఒవైసీ సూచించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ దారుసలాం మైదానంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బాబ్రీమసీదు కూల్చివేశారని, పునరుద్ధరణ జరగలేదని, అదే తెలంగాణ సచివాలయంలో మసీదు కూలి్చవేసినా, తిరిగి పునరుద్ధరించారని గుర్తు చేశారు. లోక్‌సభలో బీఎస్పీకి చెందిన ఓ ముస్లిం ఎంపీని బీజేపీ ఎంపీ మతపరంగా అవమానపర్చేవిధంగా దూషణలు చేశారని, పార్లమెంటులో ముస్లిం సభ్యుల హత్యలకు పాల్పడేరోజు ఎంతో దూరంలో లేనట్టు కనిపిస్తోందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సబ్‌కాసాత్..సబ్‌కావికాస్ ఎక్కడ ఉందని, ఆయన ఒక్కమాట కూడా మాట్లాడరని విమర్శించారు. మజ్లిస్ మహిళాబిల్లుకు వ్యతిరేకం కాదని, అందులో వెనుకబడిన తరగతుల మహిళల రిజర్వేషన్ కోసమే వ్యతిరేకించినట్టు స్పష్టం చేశారు.
బరిలో లేని స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయని స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు సహకరించాలని ఒవైసీ పిలుపునిచ్చారు. మజ్లిస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే అభ్యర్థులకు ఏ మాత్రం సహకరించొద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణలో అల్లర్లు జరిగాయని, అలాంటి ఘటనలు ప్రస్తుత బీఆర్‌ఎస్ పాలనలో లేవన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు దెబ్బతీసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment