హ్యాట్రిక్ విన్ | Hatrk Win Political Leaders in Hyderabad | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ విన్

Published Sat, Mar 16 2019 11:32 AM | Last Updated on Sat, Mar 16 2019 11:32 AM

Hatrk Win Political Leaders in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఎంఐఎంకు కంచుకోటగా నిలిచిన హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఆ పార్టీ నేత సలావుద్దీన్‌ ఒవైసీ, ఆయన తనయుడు అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్‌సాధించారు. ప్రతి ఎన్నికలోనూ ప్రత్యర్థులను మట్టికరిపించి,తిరుగులేని నేతలుగా రాణించారు. సలావుద్దీన్‌ ఒవైసీ ఏకంగా ఆరుసార్లు విజయం సాధించి,డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టారు.

సలావుద్దీన్‌ ఒవైసీ 
మజ్లిస్‌ పార్టీని స్థాపించి నగరంలో అత్యంత ప్రభావితమైన రాజకీయ నేతగా గుర్తింపు పొందిన ఎంఐఎం వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీ తనయుడు సలావుద్దీన్‌ తండ్రికి రాజకీయ వారసుడిగా నిలిచారు. 1958 నుంచే నగర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగా రు. వాహెద్‌ మరణానంతరం ఎంఐఎం  అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 1960లో తొలిసారి మల్లేపల్లి నుంచి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలిచారు. 1962లో పత్తర్‌గట్టి, 1967లో యాకుత్‌పురా, 1972లో పత్తర్‌గట్టి అసెంబ్లీ స్థానాల నుంచి, 1978, 1983లలో చార్మినార్‌ నుంచి గెలిచారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 38.13 శాతం మెజారిటీతో హైదరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా గెలుపొందారు. అప్పటి నుంచి వెనుదిరిగి  చూడలేదు. 1989 ఎన్నికల్లో 45.91 శాతం, 1991లో 46.18 శాతం మెజారిటీ సొంతం చేసుకున్నారు. 1996 ఎన్నికల్లో  34.57 శాతం, 1998లో 44.65 శాతం, 1999లో 44.36 శాతం మెజారిటీతో గెలిచారు. వరుసగా ఆరుసార్లు గెలిచి డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించారు. అనారోగ్యం కారణంగా 2004లో రాజకీయాలకు దూరమైన సలావుద్దీన్‌ 2008 సెప్టెంబర్‌లో మరణించారు.  

అసదుద్దీన్‌ ఒవైసీ 
సలావుద్దీన్‌ తర్వాత ఎంఐఎం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అసదుద్దీన్‌ ఒవైసీ 1994 నుంచి వరుసగా మూడుసార్లు చార్మినార్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2004లో తన తండ్రి సలావుద్దీన్‌ క్రియాశీలక రాజకీయాల కు దూరం కావడంతో హైదరాబాద్‌ పార్లమెంట్‌ సానం పోటీ చేసి విజయం సాధించారు. 2009లో అసద్‌ను ఓడించేందుకు టీడీపీ, టీఆర్‌ఎస్, వామపక్షాలన్నీ ఏకమయ్యాయి. అసద్‌కు వ్యతిరేకంగా  సియాసత్‌ ఎడిటర్‌ జాహెద్‌ అలీఖాన్‌ ను బరిలోకి దింపాయి. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొంది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హైదరాబాద్‌ ఎంపీగా తిరుగులేని నేతగా నిలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఆయన ఘన విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం నాలుగో పోటీకి సిద్ధమవుతున్నారు.  

సూదిని జైపాల్‌రెడ్డి 
ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన సూదిని జైపాల్‌రెడ్డి అపర మేధావి. ఆయన పార్లమెంట్‌లో ఆంగ్లంలో ప్రశ్నలడిగితే సభ్యులు నిఘంటువులు వెతకాల్సిన పరిస్థితి. సమస్యలను, సవాళ్లను చాకచక్యంగా చర్చించగల సమర్థుడిగా పేరొందిన జైపాల్‌రెడ్డికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కీలకమైన పదవులే లభించాయి. కాంగ్రెస్‌లో గొప్ప నేతగా ఎదిగిన జైపాల్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించారు. మంత్రిగా వివిధ హోదాల్లో పని చేశారు. శాస్త్ర సాంకేతిక, ప్రసార, సమాచార శాఖలు చూశారు. యూపీఏలో కీలకమైన నేతగా ఎదిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ తన కర్తవ్యాన్ని నిర్వహించారు.

1999, 2004 ఎన్నికల్లో వరుసగా మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనలో మిర్యాలగూడ రద్దయింది. కొత్తగా చేవెళ్ల నియోజకవర్గం ఆవిర్భవించింది. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి జైపాల్‌రెడ్డి వరుసగా మూడోసారి గెలుపొందారు. మన్మోహన్‌ కేబినెట్‌లోనూ కేంద్రమంత్రిగాసేవలందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement