నవతరంఫై నజర్ | MIM Party Talk With Youth Programme in Hyderabad | Sakshi
Sakshi News home page

నవతరంఫై నజర్

Published Sat, Mar 23 2019 11:06 AM | Last Updated on Wed, Mar 27 2019 7:53 AM

MIM Party Talk With Youth Programme in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో :హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో పోలింగ్‌వన్‌సైడ్‌ జరిగే ఆనవాయితీ ఉన్నా.. మెజారిటీ సాధించేందుకు మాత్రం పోలింగ్‌ శాతమే మజ్లిస్‌ పార్టీకి ప్రాణంగా మారింది. వాస్తవంగా పాతబస్తీ పరిధిలో విస్తరించి ఉన్న లోక్‌సభ నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి పట్టు ఉంది. ఒకే సామాజిక వర్గం కావడంతో గణనీయమైన ఓటుబ్యాంకు ఉంది. దీంతో  మజ్లిస్‌కు గంపగుత్తగా ఓట్లు పడతాయి. కాగా, ప్రతి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా పోలింగ్‌ శాతం మాత్రం ఆ స్థాయిలో పెరగడంలేదు. ఈసారి కొత్తగా నమోదైన యువ ఓటర్లపై మజ్లిస్‌ దృష్టి సారించింది. ఏకంగా లెర్న్‌ ప్రాజెక్టును ప్రారంభించికళాశాల విద్యార్థులతో ‘టాక్‌ విత్‌ అసదుద్దీన్‌’ పేరుతో ముఖాముఖీ ప్రారంభించింది. ఇప్పటికే రెండు టౌన్‌ హాల్‌ కార్యక్రమాలను నిర్వహించింది. తాజాగా పాదయాత్రలతో పోలింగ్‌ శాతం పెంపుపై దృష్టి సారించింది.

ఆదిలో తీవ్ర ప్రభావం..
ఎన్నికల్లో మజ్లిస్‌కు ఆదిలో గెలుపు ఓటములపై పోలింగ్‌ శాతం తీవ్ర ప్రభావం చూపింది. మొదట్లో  ఆ పార్టీకి వరుస అపజయాలు తప్పలేదు. హైదరాబాద్‌ లోక్‌సభకు తొలిసారిగా 1962లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్‌ పక్షాన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన అబ్దుల్‌ వాహెద్‌ ఒవైసీ, 1977లో సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీల ఓటములకు పోలింగ్‌ శాతమే తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత పోలింగ్‌ శాతం పెంపుపై దృష్టి సారించడంతో 1984లో సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ కేవలం 0.6 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. క్రమంగా పెరుగుతూ వస్తున్న పోలింగ్‌ శాతం మజ్లిస్‌కు కలిసి వస్తోంది. మూడున్నర దశాబ్దాలుగా పాతబస్తీపై గట్టి పట్టు సాధించి ఎన్నికలను ఏకపక్షంగా మార్చినప్పటికీ మెజారిటీ ఆశించినంత స్థాయిలో రాకపోడం మింగుడుపడని అంశంగా మారింది. ప్రతిసారీ పోలింగ్‌ నమోదు 60 నుంచి 75 శాతం మధ్యనే ఊగిసలాడుతుండటంతో మెజారిటీపై ప్రభావాన్ని పార్టీ నాయకత్వం పసిగట్టింది. దీంతో ఈసారి మంచి భారీ విజయాన్ని నమోదు చేసుకునేందుకు పోలింగ్‌ శాతంపెంపుపై ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికలు రూపొదించింది.  

మహిళా పోలింగ్‌ శాతం స్వల్పం..  
పాతబస్తీలో పురుష ఓటర్లతో పోల్చితే మహిళల పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవుతోంది. సాధారణంగా ఇంటి పనులతో తీరికలేకపోవడం, కట్టుబాట్లు, ఇతరాత్రా‡ కారణాలతో  
ప్రత్యేక సమయం కేటాయించి బయటకి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి కనబర్చడంలేఉద. ప్రతిసారీ మహిళా పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవుతోంది. దీంతో మజ్లిస్‌ పార్టీ ఈసారి మహిళా ఓటర్లపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. వారిని చైతన్యపరిచేందుకు సిద్ధమైంది.  ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళల సమస్యలపై గ్రూప్‌లవారీగా చర్చిస్తోంది.

గల్ఫ్‌గండం..
హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ముస్లింలు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తుంటారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు ఇద్దరు వెళ్లడంతో వారు ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నారు.  దీంతో సుమారు 10 నుంచి 12 శాతం వరకు పోలింగ్‌ తక్కువగా నమోదవుతోంది. గత లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్‌ ఏకంగా గల్ఫ్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారు తిరిగి వచ్చి  ఓటుహక్కు వినియోగించుకుంటే వారిని గౌరవించి  ప్రత్యేకంగా సభలు నిర్వహించి సన్మానం చేస్తామని బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినా ఫలితం లేకుండాపోయింది. మరోవైపు స్థానికంగా ఉన్న వారిపేర్లు సైతం ఓటర్ల జాబితాలో గల్లంతు కావడం పోలింగ్‌ తగ్గడానికి మరో కారణంగా కనిపిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement