సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మజ్లిస్ దూసుకెళ్తోంది. నోటిఫికేషన్ రోజే నామినేషన్ దాఖలు చేసిన ఆ పార్టీ అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదే రోజు పాదయాత్రతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ ప్రచార శైలిలో మిగతా ప్రధాన రాజకీయ పక్షాల కంటే విభిన్నంగా వెళుతోంది. ఎన్నికల మేనిఫెస్టో, హామీలకు దూరంగా ఉండే మజ్లిస్ పార్టీ ఎత్తుగడలను సైతం రాజకీయ పరిశీలకులు కూడా ఉహించడం కష్టతరం. హంగూ ఆర్భాటం లేకుండా సాదాసీదా ప్రచారంలో కూడా వ్యూహాత్మక సరిళిని అనుసరిస్తోంది. ఓట్లడిగే తీరు కూడా మిగతా పక్షాలతో పోల్చితే భిన్నమే.
ప్రధానంగా ఈసారి పోలింగ్ శాతం పెంపుపైనే ప్రధాన దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. నియోజకవర్గంలో విజయావకాశాలపై ఎలాంటి అనుమానాలు లేనప్పటికీ పోలింగ్ భారీగా జరిగేలా సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ అధినేత, అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ పాదయాత్రలు, బహిరంగ సభల్లో సైతం పోలింగ్ పెంపు ప్రస్తావనే ప్రధానాంశంగా మారింది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో మెజారిటీ ఓటర్లు ముస్లిం సామాజిక వర్గం వారే. టీఆర్‌ఎస్ మిత్రపక్షం కావడంతో ఓటుబ్యాంక్ కూడా కలిసివస్తుందని మజ్లిస్ విశ్వాసం. ఇటీవల ఓటరు నమోదుకు లభించిన అవకాశాన్ని సైతం మజ్లిస్ పార్టీ బాగానే సద్వినియోగం చేసుకుంది. పోలింగ్ ఎంత ఎక్కువగా నమోదైతే అదే స్థాయిలో మెజారిటీ పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
పనితీరే గుర్తింపుగా ముందుకు..
సార్వత్రిక ఎన్నికల్లో తమ పని తీరే గుర్తింపు అన్న మంత్రం మజ్లిస్ జపిస్తోంది. మజ్లిస్ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించలేదు. ఎన్నికల కోసం హామీల వర్షం కురిపించలేదు. కానీ, చేసిన అభివృద్ధిని మాత్రం పదే పదే ప్రసావించడం మజ్లిస్ సంప్రదాయం. ఓటు పోలైతే చాలు అది తమ ఖాతాలో పడినట్టేనని ఆ పార్టీ భావిస్తోంది. ఓటుహక్కు వినియోగించాలంటూ పాదయాత్రలతో ఆ పార్టీ నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment