లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణపై ఢిల్లీ పెద్దలు పెట్టిన ఫోకస్ మొత్తానికి ఫలించింది. 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలుపొంది తన విజయం శాతాన్ని మెరుగుపర్చుకుంది. అయితే గెలుపు సంగతి పక్కనపెడితే హాట్ టాపిక్‌గా మారిన హైదరాబాద్ ఎంపీ సీటులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది.
ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే చేసింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెళ్ల మాధవీలతను ఎంచుకుంది. తద్వారా ఎంఐఎం అడ్డాలో నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. కానీ, ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారరి బెడిసి కొట్టింది.
విరించి హాస్పిటల్స్ ఛైర్ పర్సన్‌గా ఉన్న మాధవీలత.. హిందుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలిగే మాధవీలత.. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. పాతబస్తీలో కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో మాధవీలతను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది.
ఇక అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవీలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆమె చిత్రవిచిత్రమైన చేష్టలకు దిగారు. ఆ విన్యాసాలతో సోషల్ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను భాగం చేయకపోవడమూ పెద్ద మైనస్‌గా మారింది. మరోవైపు పోలింగ్ టైంలో హిజాబ్‌లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాకు ఎక్కి.. వివాదాస్పదంగా మారింది కూడా.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏమాత్రం సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థి హోదాతో నవ్వుల పాలు అయ్యిందనేది విశ్లేషకుల మాట.
హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీ 3.35 లక్షల భారీ మెజారిటీతో మాధవీలతపై ఘనవిజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment