తాండూరు సభలో మాట్లాడుతున్న ఎంపీ అసదుద్దీన్
సాక్షి, అనంతగిరి: లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 ఎంపీ స్థానాలను సాధిస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్‌లో గురువారం రాత్రి నిర్వహించిన పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరి ఆశీర్వాదంతో తమ పార్టీ 7 స్థానాల్లో గెలిచిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ మూడుసార్లు హైదరాబాద్ వచ్చారని, ఆయన సభలకు జనం పెద్దగా రాలేదని గుర్తుచేశారు. ఈ ప్రాంత ప్రజలు తన తండ్రిని 6సార్లు ఎంపీగా గెలిపించారని, తనను కూడా గెలిపించి ఆదరించిన విషయం ఎప్పటికే మరిచిపోలేనని చెప్పారు. హైదరాబాద్‌లో ఈసారి విజయం మనదేనని స్పష్టంచేశారు.
మిగిలిన 16 స్థానాల్లో కేసీఆర్‌కు మద్దతిచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఉండవన్నారు. ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని వెల్లడించారు. వీరంతా కలిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్పష్టంచేశారు.ఈ దశలో 16 ఎంపీ సీట్లు అత్యంత కీలకంగా మారుతాయని ధీమా వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ చేస్తున్న రాజకీయం దేశంలో సెక్యులరిజాన్ని బలహీనం చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని తెలిపారు. ఇందుకు కేవలం సీఎం కేసీఆర్ పాలనే కారణమన్నారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అరాచకాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇలాంటివి సహించలేమన్నారు. నరేంద్రమోదీ, కేసీఆర్‌లు ఇద్దరూ హిందువులే అయినప్పటికీ వీరి హిందుత్వం మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందన్నారు. వైఎస్ మరణాంతం కాంగ్రెస్ పాలనలో తనను, తన తమ్మున్ని ఎన్నో ఏళ్ల కిందటి కేసు పేరుతో జైలుకు పంపి అవస్థలు పెట్టారని తెలిపారు. అయినా తామెక్కడా జంకలేదని, ప్రస్తుతం తాము కాంగ్రెస్ వెంటపడ్డామని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో ముస్లింలు, దళితులు చాలా వెనుకబడి పోయారన్నారు. చేవెళ్ల ఎంపీగా బరిలో ఉన్న రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 2014లో టీఆర్‌ఎస్ ఎంపీగా గెలిచిన విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారన్నారు. కోట్‌పల్లిలో బోటింగ్ షురూ చేసిన ఎంపీ తమ చేపలను నాశనం చేస్తున్నారని ఎంతో మంది బాధితులు తన వద్ద మొరపెట్టుకున్నారని తెలిపారు.
తాండూరు: ఏపీలో జగన్ సీఎం అవుతాడని.. బాబు ఇంటికి వెళ్లడం ఖాయమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.గురువారం రాత్రి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఎంఐఎం తాండూరు అధ్యక్షుడు ఎంఏ హదీ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో అసద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 16 స్థానాలు వస్తాయన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎం విజయం సాధిస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు 20 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పారు. తనకు మంత్రి కావాలి, బుగ్గ కారులో ఎక్కి తిరగాలని అనే ఆలోచన ఎప్పుడూ లేదన్నారు. ప్రజల మధ్య ఉంటూ సేవ చేయడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. హిందువులకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు మాత్రమే తాము వ్యతిరేకులమని తెలిపారు. దేశంలోని ప్రధాని నరేంద్రమోదికన్నా, రాహుల్‌గాంధీ కన్నా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి వారని కొనియాడారు. చెవెళ్లలో రంజిత్‌రెడ్డి 70వేల మెజార్టీతో గెలుపొందడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. సభకు 8వేల మందికి ముస్లిం నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సాజిద్, నాయకులు యూసూఫ్‌ఖాన్, ఖుర్షీద్‌హుస్సేన్, భగవాన్‌కరీం తదితరులు ఉన్నారు.
బహిరంగ సభకు తరలిరండి
వికారాబాద్‌లో 8న నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు భారీగా తరలిరావాలని అసద్ పిలుపునిచ్చారు. ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో తరలివెళ్లాలని తెలిపారు. వికారాబాద్‌లోని సమస్యల పరిష్కారంపై తాను సీఎంతో మట్లాడుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం సీనియర్ నాయకులు హక్‌నజీర్, ఎండీ అలీం, మహ్మద్ అలీం, మజీద్, ఎజాస్, అలీమొద్దీన్, మోయిస్ ఖురేషి, కలీం, అఫ్జల్ షరీఫ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment