చెన్నూర్ : జిల్లాలో పాడి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాడి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. యాక్షన్ ప్లాన్ పంపించాలని మండల సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (పాల శీతలీకరణ కేంద్రం) నిర్వాహకులకు సూచించింది.
పాడి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 2003లో జిల్లాలో 11 పాల శీతలీకరణ కేంద్రాలు ప్రారంభించారు. పాడి సంపద అంతరిస్తుండడంతో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, ఉట్నూర్, బోథ్, ఇచ్చోడలోని పాలడెయిరీ కేంద్రాలు మూతపడ్డాయి. ఆదిలాబాద్, నిర్మల్, లక్సెట్టిపేట, చెన్నూర్, భైంసా, కడెం మండలాల్లో కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం మూడు నుంచి నాలుగు వేల లీటర్ల పాల సేకరిస్తున్నారు. దీంతో వెయ్యి మందికి పైగా రైతులకు ఉపాధి లభిస్తోంది.
రైతుకు మేలు..
పాడి సంపద అభివృద్ధితోనే రైతులకు మేలు జరుగుతోందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రైతులకు డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గేదెలు, ఆవులు మంజూరు చేసి 20 వేల లీటర్ల పాలు సేకరించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పాల డెయిరీ జిల్లా మేనేజర్ గజ్జరామ్ తెలిపారు. పాడి సంపదను అభివృద్ధి చేస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మందికి లాభం చేకూరడంతోపాటు ఉపాధి మెరుగయ్యే అవకాశాలున్నాయి.
పాల డెయిరీల ఆధునికీకరణ
పాల డెయిరీల బలోపేతంలో భాగంగా జిల్లాలోని పాలడెయిరీలను ఆధునికరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో పాల సామర్థ్యాన్ని పాల డెయిరీలో పనిచేసే ఉద్యోగులు పరీక్షించే వారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి ఈఎంటీ(ఎలక్ట్రానిక్ మెనికో టైసర్) ద్వారా పాలను పరీక్షించాలని పరికరాలు పంపిణీ చేయనుంది. అవసరమైనంత మంది బాలమిత్రలను ఎంపిక చేసి గౌరవ వేతనంతోపాటు ఇన్‌సెంటివ్ ఇవ్వనుంది.
పాడి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
Published Thu, Nov 6 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement