సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు ఈ ఎన్నికలు సుడిగుండంలా మారాయి. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు కొడుకులాంటి వాడినని చెప్పుకునే ఈ విద్యార్థి నాయకుడికి నియోజకవర్గంలో తన పట్టు తప్పుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆశించిన మైలేజీ రాక సొంత పార్టీలోనే విస్మయం కలిగిస్తోంది.
2014 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి అప్పటి సిట్టింగ్ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ అభ్యర్థి వివేక్‌పై అనూహ్యంగా గెలవడంతో సుమన్ ప్రజాప్రాతినిధ్య జీవితానికి తొలి అడుగు పడింది. 2018 ఎన్నికల్లో చెన్నూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలును కాదని ఎంపీగా ఉన్న సుమన్‌కు టికెట్ ఇచ్చారు. ఆ సమయంలో టికెట్‌పై పెట్రోల్ ‘మంటల’ మధ్యలోనే ఎన్నికలు ఎదుర్కొన్నారు. చివరికి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ వెంకటేష్‌నేతపై 28వేల ఓట్ల తేడాతో గెలిచారు. ప్రస్తుతం రెండోసారి చెన్నూర్ టికెట్ దక్కించుకుని బరిలో ఉన్నారు.
అభివృద్ధి చెప్పినా.. వ్యతిరేకతేనా?
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలతో పోలిస్తే చెన్నూర్‌లోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందని ఎమ్మె ల్యే సుమన్, పార్టీ శ్రేణులు చెబుతుంటారు. ప్రత్యేక బుక్‌లెట్ వేసి మరీ ప్రచారం చేస్తున్నా వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. ప్రచారం మొదలైన తొలి రోజు నుంచే ఓటర్లు తిరగబడుతున్నారు. ఆర్కేపీ, ఊరు మందమర్రి, చెన్నూరు, గంగారంలో నిరసనలు ఎదురయ్యాయి. చిత్రంగా మందమర్రి, ఆర్కేపీ, చెన్నూరు ఈ మూడు పట్టణాలకు రెండు వందల కోట్ల చొప్పున నిధులు తెచ్చామని చెప్పినా ఆ మే రకు ఓట్లు రాలుతాయా? అంటే చెప్పలేని పరిస్థితి.
సుమన్ ప్రజలకు అందుబాటులో లేక, ఆయన పేరు చెప్పి నియోజకవర్గంలో కొందరు నాయకుల దందాలే కొంపముంచే పరిస్థితికి తెచ్చాయని అంటున్నారు. కోటపల్లి పరిధిలో ఓ నాయకుడు చేస్తు న్న భూ కబ్జాలు, బెదిరింపులు, మద్యం దందాలు, సెటిల్‌మెంట్లు అక్కడి ఓట్లపై దెబ్బ పడుతున్నాయి. ఇక మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ వర్గీయులను పక్కకు పెట్టి, కేసులు పెట్టించడంతో వారంతా దెబ్బకొట్టేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యే రెండో సెట్ నామినేషన్ వేసే సందర్భంలో ఎమ్మెల్సీని బతిమాలినా రాకపోతే, చివరకు పార్టీ హైకమాండ్‌తో చెప్పించుకోవల్సిన పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు.
సొంత నియోజకవర్గ సీనియర్ నాయకుడినే ఆయన లెక్క చేయకపోగా కార్యకర్తలు, నాయకులకు ఫోన్‌లోనైనా అందుబాటులో ఉండరనే అపవాదు సామాన్య కార్యకర్తల్లో ఉంది. మందమర్రి, ఆర్కేపీలో సింగరేణి క్వార్టర్లు, భూములు ఎమ్మెల్యే అనుచరుల కబ్జాలు, ఆయన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడడంతో వందల కోట్ల అభివృద్ధి ఈ వ్యతిరేకత ముందు నిలవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment