milk collection centres
-
Kurnool: అమూల్ ఆధ్వర్యంలో పాలసేకరణ.. పాడి రైతుకు పండగ
రైతు ఇంట పాడిని అభివృద్ధి చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ను రంగంలోకి దించుతోంది. సెప్టెంబర్ నుంచి జిల్లాలో పాలసేకరణ కొనసాగనుంది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. దీంతో పోటీతత్వం పెరిగి పాడి రైతుకు మేలు చేకూరనుంది. పాలకు మెరుగైన ధర లభించనుంది. సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాల్లో పాడి గేదెలు 59,690, పాడి ఆవులు 68,120 ఉన్నాయి. పచ్చిమేత పుష్కలంగా ఉండే సమయంలో రోజుకు 5.5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం గేదెపాలకు వెన్న శాతాన్ని బట్టి లీటరుకు గరిష్టంగా రూ.67 వరకు ధర లభిస్తోంది. ఆవు పాలను గరిష్టంగా లీటరుకు రూ.32 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. పాల కొలతలు, వెన్నశాతం నిర్ధారణలో రైతులను దగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమూల్ వస్తే రైతులకు వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ.77.98 ధర లభించే అవకాశం ఉంది. ఆర్బీకేల పక్కనే బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు అమూల్ ద్వారా సెప్టెంబర్ నెల నుంచి పాల సేకరణ చేపట్టనున్నారు. రైతు భరోసా కేంద్రాల వారీగా 2000 లీటర్ల సామర్థ్యంతో బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పాల ఉత్పత్తి ఉన్న 199 ఆర్బీకేల సమీపంలోనే వీటి ఏర్పాటుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్థలాలు సేకరిస్తోంది. ఒక్కోదానికి ఐదు సెంట్ల స్థలం అవసరం కాగా, ఇప్పటికే 198 పాలశీతలీకరణ కేంద్రాలకు రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 47 భవనాలు కూడా నిర్మిస్తున్నారు. ఇవిగాక గ్రామాల్లో 200 లీటర్ల సామర్థ్యంతో 200కుపైగా పాల సేకరణ కేంద్రాలు(అటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు) కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటికి 3.50 సెంట్ల స్థలం అవసరం కాగా, 168 పాలసేకరణ కేంద్రాల కోసం రెవెన్యూ అధికారులు అవసరమైన స్థలాలను సేకరించారు. వీటిలో అమూల్ సిబ్బంది ఉండి, సేకరించిన పాలను బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లకు తరలిస్తారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా అమూల్ డెయిరీకి పాలు సరఫరా అవుతాయి. ట్యాంకర్లు వెళ్లడానికి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు రూట్లను కూడా సిద్ధం చేశారు. మహిళా సొసైటీల ఏర్పాటు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లో 3.25 లక్షల మంది వరకు మహిళలు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది పాడిపై ఆధారపడి ఉన్నారు. పాలు ఉత్పత్తి చేసే మహిళలతో ఉమెన్ డెయిరీ డెవలప్మెంటు సొసైటీలు ఏర్పాటు కానున్నాయి. వీటిని కో–ఆపరేటివ్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేస్తారు. అమూల్ పాల సేకరణలో డీఆర్డీఏ, పశుసంవర్ధకశాఖ, సహకార శాఖ భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పటికే సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ అయిన వెంకటకృష్ణను ప్రభుత్వం జిల్లా డెయిరీ డెవలప్మెంట్ అధికారిగా నియమించింది. ఉమన్ డెయిరీ డెవలప్మెంట్ సహకార చట్టం కింద సొసైటీలను రిజిస్ట్రేషన్ చేస్తారు. రోజుకు ఎన్ని లీటర్లు ఉత్పత్తి అవుతున్నాయనే వాటిని పర్యవేక్షిస్తారు. ఎన్నో ప్రయోజనాలు మాకు పది పాడి గేదెలు ఉన్నాయి. పచ్చిమేత పుష్కలంగా లభించే సమయంలో రోజుకు 35 లీటర్ల పాలు ఉత్పత్తి అయ్యేవి. గతంలో ఒక డెయిరీకి పాలుపోసే వాళ్లం. లీటరుకు గరిష్టంగా రూ.45 వరకే ధర లభించేది. ఈ ధర గిట్టుబాటు కాకపోవడంతో ప్రస్తుతం పిండిన పాలు పిండినట్లు హోటళ్లకు పోస్తున్నాం. లీటరుకు రూ. 55 ప్రకారం ధర ఇస్తున్నారు. అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణ చేపడితే పాడిరైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. మా గ్రామంలో కూడా బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. – రసూల్, టి.గోకులపాడు, కృష్ణగిరి మండలం పాడి రైతులకు మంచి రోజులు వస్తున్నాయి మాకు గ్రేడెడ్ ముర్రా గేదెలు4, ఆవులు మూడు ఉన్నాయి. రోజు సమతుల్యత కలిగినదాణా, పచ్చిమేత ఇస్తుంటాం. రోజుకు 45 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అవుతాయి. పాడిమీద కష్టపడుతున్నా, తగిన గిట్టుబాటు ధర లభించడం లేదు. అమూల్ పాల సేకరణ మొదలైతేనే పాడిరైతుకు మంచి రోజులు వచ్చినట్లు అవుతుంది. గిట్టుబాటు ధరలు లభిస్తాయనే నమ్మకం ఉంది. – ఖాజావలి, గూడూరు గిట్టుబాటు ధర లభిస్తుంది సెప్టెంబరు నుంచి జిల్లాలో అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఉపాధి నిధులతో పాలశీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అమూల్ ఆధ్వర్యంలో పాల సేకరణ చేపడితే పోటీతత్వం పెరిగి రైతుకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. – డాక్టర్ రామచంద్రయ్య, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి -
25 నుంచి అమూల్ పాలసేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలివిడత మూడు జిల్లాల్లో అమూల్ (ఆనంద్ డెయిరీ) పాలసేకరణ ప్రారంభం కానుంది. చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఈ నెల 25 నుంచి ప్రారంభించడానికి ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. పాలసేకరణ, పాల ఉత్పత్తుల అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్న అమూల్ తన ప్రతినిధులతో వివిధ జిల్లాల్లో సర్వే చేపట్టింది. పాల దిగుబడి అధికంగా ఉన్న జిల్లాలతోపాటు ఏపీ డెయిరీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న ప్లాంట్లలోని యాంత్రిక పరికరాల సామర్థ్యాన్ని పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా పాలను సేకరించనుంది. లోటుపాట్లను సరిచేసుకుని 25 నుంచి అధికారికంగా 300 పాలసేకరణ కేంద్రాలను ప్రారంభించనుంది. ప్రైవేట్ డెయిరీల నుంచి ఎదురయ్యే పోటీని అధిగమించడానికి, పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాల ఏర్పాటుకు ఏపీ డెయిరీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొత్తం 9,899 పాలసేకరణ కేంద్రాలను దశల వారీగా ఏర్పాటు చేయనుంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కోర్ కమిటీలు.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమూల్ కార్యక్రమాలు వేగంగా జరగడానికి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కోర్ కమిటీలను ఏపీ డెయిరీ ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్, డ్వామా పీడీ, డీఆర్డీఏ పీడీ, డీసీవో, సబ్ కలెక్టర్, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్లు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు, రైతులకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పాడిపశువుల కొనుగోలు, సిబ్బందికి శిక్షణ వంటి కార్యక్రమాలను కోర్ కమిటీలు పర్యవేక్షిస్తాయి. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) పరిధిలో ఏర్పాటు కానున్న ఈ పాలసేకరణ కేంద్రాల నిర్మాణాలు, పాలలోని వెన్న శాతం గుర్తించడానికి, ఇతర పనులకు అవసరమైన యాంత్రిక పరికరాల సరఫరా, రూట్‌మ్యాప్‌ల ఖరారు వంటి ప్రధాన బాధ్యతలను ఇవి నిర్వహిస్తాయి. అదేవిధంగా ప్రతి 15 ఆర్బీకేలకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపగల అధికారులు, రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలనే గట్టి నిబద్ధత కలిగిన అధికారులకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు. పాల ఉత్పత్తిదారులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రధాన బాధ్యత వీరికి డెయిరీ అప్పగిస్తుంది. గ్రామాల్లో పశుపోషణ పట్ల రైతులందరికీ ఆసక్తి కలిగించడానికి, ఆ పోషణ చేసేందుకు ముందుకు వస్తున్న రైతులకు ప్రభుత్వం కల్పించనున్న సౌకర్యాలను గ్రామ సభల ద్వారా ప్రభుత్వం వివరించనుంది. భవిష్యత్‌లో పెరగనున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాడిపశువుల సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పాల ఉత్పత్తిదారులకు అనేక సౌకర్యాలు పాల ఉత్పత్తిదారులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాం. సేకరణ కేంద్రాలకు పాలు పోసిన రైతులకు ప్రతి 10 రోజులకు ఒకసారి నగదు చెల్లింపులు చేస్తాం. పాడి పశువులకు అవసరమైన దాణాను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. పశువులకు సత్వర వైద్యం అందుబాటులోకి తీసుకువస్తాం. రెండు వేల లీటర్ల పాలను సేకరించడానికి అవకాశం ఉన్న గ్రామాల్లో ముందుగా పాల సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. పాలలోని వెన్నశాతం, నగదు చెల్లింపులు, ఇతర సేవలు అందించే విషయంలో పారదర్శకంగా ఉంటాం. పశు సంపదను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న పేదల బతుకుల్లో వెలుగులు నింపడానికి చర్యలు తీసుకుంటున్నాం. – బాబు అహ్మద్, ఎండీ, ఏపీ డెయిరీ -
పాలసిరులు
భువనగిరి, న్యూస్‌లైన్ : నార్మాక్స్ (నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం) పరిధిలో 478 పాలసంఘాలు, 650 మిల్క్ కలెక్షన్ సెంటర్లు, రెండు జిల్లాల్లో 21 పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. 55 వేల రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. పాలు పోయడం, వాటి ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.210 కోట్ల ఆదాయం నార్మాక్స్ పొందుతోంది. ఇందులో రూ.160 కోట్లు పాలు పోసిన రైతులకు తిరిగి బిల్లుల రూపంలో చెల్లిస్తున్నారు. అంటే సుమారు 80శాతం చెల్లింపు జరుగుతోందని ఇటీవల నార్మాక్స్ వార్షిక నివేదికలో పేర్కొంది. అలాగే సంస్థ అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు, పన్నుల రూపేణా రూ.10 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాలు, పాల ఉత్పత్తి దారుల సంక్షేమానికి మరికొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు. విద్యార్థులకు ప్రోత్సాహాకాలు.. పాడి రైతుల పిల్లలను ఆదుకునేందుకు, వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి చదువులో ప్రోత్సహించేందుకు పారితోషకాలు, ఉపకార వేతనాలు ఇస్తున్నారు. జనశ్రీ బీమా యోజన ద్వారా విద్యార్థులకు ప్రతి ఏడాది రూ.1200 చొప్పున ఉపకార వేతనాలు ఇస్తున్నారు. పదవ తరగతిలో 9.2 శాతం జీపీఏ సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పును గత ఏడాది వంద మందికి ఆర్థిక సాయం చేశారు. ప్రమాదవశాత్తు పాడి రైతు చనిపోతే అతని కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 460 మంది పాడిరైతుల కుటుంబాలకు రూ.5 వేల ఆర్థికసాయం అందించారు. రైతులకు సబ్సిడీలు.. పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై కోటి రూపాయల విలువైన గడ్డి విత్తనాలు పంపిణీ చేశారు. పాడి పశువుల ఆరోగ్యం కోసం ప్రతి ఏడాది రూ.50 లక్షల విలువైన మందులు సరఫరా చేస్తున్నారు, వాటాధనంపై వచ్చిన వడ్డీలో 40 లక్షల రూపాయలు రైతులకు పంపిణీ చేశారు. అదేవిధంగా 40 లక్షల రూపాయలతో రైతులకు యంత్ర పనిముట్లను అందించారు. రైతులకు బేఫ్ సంస్థ ద్వారా పాడి పశువుల కృత్రిమ గర్భధారణ కోసం రూ.25 లక్షలు ఖర్చు చేశారు.