భువనగిరి, న్యూస్‌లైన్ : నార్మాక్స్ (నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం) పరిధిలో 478 పాలసంఘాలు, 650 మిల్క్ కలెక్షన్ సెంటర్లు, రెండు జిల్లాల్లో 21 పాల శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. 55 వేల రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. పాలు పోయడం, వాటి ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.210 కోట్ల ఆదాయం నార్మాక్స్ పొందుతోంది. ఇందులో రూ.160 కోట్లు పాలు పోసిన రైతులకు తిరిగి బిల్లుల రూపంలో చెల్లిస్తున్నారు. అంటే సుమారు 80శాతం చెల్లింపు జరుగుతోందని ఇటీవల నార్మాక్స్ వార్షిక నివేదికలో పేర్కొంది. అలాగే సంస్థ అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు, పన్నుల రూపేణా రూ.10 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాలు, పాల ఉత్పత్తి దారుల సంక్షేమానికి మరికొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు.
విద్యార్థులకు ప్రోత్సాహాకాలు..
పాడి రైతుల పిల్లలను ఆదుకునేందుకు, వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి చదువులో ప్రోత్సహించేందుకు పారితోషకాలు, ఉపకార వేతనాలు ఇస్తున్నారు. జనశ్రీ బీమా యోజన ద్వారా విద్యార్థులకు ప్రతి ఏడాది రూ.1200 చొప్పున ఉపకార వేతనాలు ఇస్తున్నారు. పదవ తరగతిలో 9.2 శాతం జీపీఏ సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పును గత ఏడాది వంద మందికి ఆర్థిక సాయం చేశారు. ప్రమాదవశాత్తు పాడి రైతు చనిపోతే అతని కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 460 మంది పాడిరైతుల కుటుంబాలకు రూ.5 వేల ఆర్థికసాయం అందించారు.
రైతులకు సబ్సిడీలు..
పాడి రైతులకు 50 శాతం సబ్సిడీపై కోటి రూపాయల విలువైన గడ్డి విత్తనాలు పంపిణీ చేశారు. పాడి పశువుల ఆరోగ్యం కోసం ప్రతి ఏడాది రూ.50 లక్షల విలువైన మందులు సరఫరా చేస్తున్నారు, వాటాధనంపై వచ్చిన వడ్డీలో 40 లక్షల రూపాయలు రైతులకు పంపిణీ చేశారు. అదేవిధంగా 40 లక్షల రూపాయలతో రైతులకు యంత్ర పనిముట్లను అందించారు. రైతులకు బేఫ్ సంస్థ ద్వారా పాడి పశువుల కృత్రిమ గర్భధారణ కోసం రూ.25 లక్షలు ఖర్చు చేశారు.
పాలసిరులు
Published Sun, Sep 15 2013 3:58 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement