
తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమారుడు
నేరేడుచర్ల: తల్లి మృతిపై కుమారుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పూడ్చిన ఆమె మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం సోమారం గ్రామానికి చెందిన పెద్దపంగు అమృతం, ఆయన భార్య కనకమ్మ మేళ్లచెరువు మండలం మైహోం సిమెంట్ కర్మాగారం క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.
అమృతం మైహోం సిమెంట్ కర్మాగారంలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా.. కనకమ్మ కోదాడ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. జనవరి 21న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కనకమ్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సోమారం గ్రామంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కనకమ్మ మృతదేహాన్ని ఖననం చేశారు.
అయితే కనకమ్మ పెద్ద కుమారుడు సందీప్‌కుమార్ తన తల్లి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మేళ్లచెరువు పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 10వ తేదీన ఫిర్యాదు చేశాడు. కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, మేళ్లచెరువు ఇన్‌చార్జి ఎస్ అంతిరెడ్డి, మేళ్లచెరువు మండల తహసీల్దార్ జ్యోతి సమక్షంలో హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రి సిబ్బందితో కలిసి మంగళవారం సోమారం గ్రామంలో కనకమ్మ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment