సాక్షి, అమరావతి: బలహీన వర్గాలకు చెందిన మహిళా పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. జగనన్న పాల వెల్లువ పథకం కింద రుణాలిస్తూ ఉపాధి కల్పన, సాంఘిక భద్రత కల్పిస్తోంది. సహకార పాడి రంగానికి జవసత్వాలు కల్పించేందుకు అమూల్ సంస్థతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా గుర్తించిన పాల ఉత్పత్తిదారుల సంఘాలకు ఆప్కాబ్, ఇతర బ్యాంకుల ద్వారా ఆర్థిక చేయూత అందిస్తోంది. ప్రభుత్వ కృషి ఫలితంగా ఎలాంటి హామీ లేకుండా రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్‌తోపాటు మేలు జాతి పశువుల కొనుగోలుకు సైతం రుణాలు ఇస్తున్నారు. ఇప్పటికే 8,064 మంది మహిళా పాడి రైతులకు రూ.45.74 కోట్ల రుణాలు అందించారు. వీరిలో 5,010 మంది 5,283 పాడి పశువులను కొనుగోలు చేశారు.
ఆర్బీకేల ద్వారా దరఖాస్తుల స్వీకరణ
గేదె కొనుగోలుకు రూ.93 వేలు, ఆవు కొనుగోలుకు రూ.76 వేల వరకు ప్రభుత్వం రుణం ఇప్పిస్తోంది. అంతేకాకుండా మహిళా రైతులు ప్రస్తుతం పెంచుతున్న పాడి పశువులపై వర్కింగ్ క్యాపిటల్ కింద గేదెల కోసం రూ.30 వేలు, ఆవుల కోసం రూ.25 వేల చొప్పున అందిస్తున్నారు. దీర్ఘకాలిక రుణాన్ని 60 నెలల్లో తీర్చాల్సి ఉండగా, వర్కింగ్ క్యాపిటల్ అప్పును 12 నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్‌ను అర్హతను బట్టి రెన్యువల్ కూడా చేస్తారు. ఎస్టీలకు మాత్రం వడ్డీ అగ్రి ఇన్‌ఫ్రా ఇంట్రెస్ట్ సబ్‌వెన్షన్ కింద వడ్డీ మినహాయింపు కూడా లభిస్తుంది. రుణాలు పొందగోరే మహిళలు ఆర్బీకేల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరో గేదె కొనుక్కున్నాం
మాకు రెండు గేదెలున్నాయి. జగనన్న పాల వెల్లువ పథకం కింద అమూల్ కేంద్రానికి పాలు పోస్తున్నాం. వెన్న శాతాన్ని బట్టి లీటరుకు రూ.50 నుంచి రూ.60 చెల్లిస్తున్నారు. రూ.81 వేలు రుణం రావడంతో మరో గేదె కొనుక్కున్నాం.
– ఎం.మంజుల, పార్నపల్లి, పులివెందుల
జగనన్న పాల వెల్లువ పథకంలో రిజిస్టర్ అయ్యా
అమూల్ కేంద్రానికి పాలు పోసేలా జగనన్న పాల వెల్లువ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న పాడి ద్వారా వచ్చే పాలను ప్రతి రోజు క్రమం తప్పకుండా పోస్తున్నాం. ఇప్పుడు రూ.81 వేల రుణం రావడంతో మరో పాడి గేదె కొనుక్కున్నా.
– మొక్కపాటి వెంకాయమ్మ, ఇక్కూరు, గుంటూరు జిల్లా
సద్వినియోగం చేసుకోవాలి
జగనన్న పాల వెల్లువ కింద అమూల్ కేంద్రాలకు పాలు పోసే మహిళా సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్, దీర్ఘకాలిక రుణ పథకం కింద డీసీసీబీల ద్వారా ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
– ఎ.బాబు, ఎండీ, ఏపీడీడీసీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment