అన్నదాతలకు ‘అమూల్‌’ ఫార్ములా భేష్‌ | Devinder Sharma Opinion Amul Dairy Formula Benefits Farmers | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు ‘అమూల్‌’ ఫార్ములా భేష్‌

Published Sat, Nov 28 2020 12:53 AM | Last Updated on Sat, Nov 28 2020 12:55 AM

Devinder Sharma Opinion Amul Dairy Formula Benefits Farmers - Sakshi

దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రైతు ఉద్యమాలకు మూలం ఎక్కడుందో పాలకులు గ్రహించాలి. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కాదు కదా.. నామమాత్రపు ధర కూడా రావడం లేదు. ఇందుకు టమాటా, బెండ, ఉల్లి రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలే ఉదాహరణ. మన కళ్లముందే అత్యద్భుతమైన అమూల్‌ డైరీ సహకార వ్యవస్థ ఉండగా, సాగు దిగుబడులకు సైతం అలాంటి సహకార వ్యవస్థను ఎందుకు వర్తింప చేయకూడదు? అమూల్‌ డైరీ సహకార వ్యవస్థలో వినియోగదారులు పాలపై వెచ్చించే ప్రతి రూపాయిలో 70 నుంచి 80 పైసల వరకు రైతుల చేతికి వస్తుంది. భారతదేశం విజయవంతమైన తన సహకార డైరీల బ్రాండ్‌ నుంచి పాఠం నేర్చుకోకూడదా? వినియోగదారు చెల్లించే ధరల్లో 40 నుంచి 50 శాతం రైతుకి దక్కేలా విధానాలు రూపొందించకూడదా?

ఈ వార్త ఇప్పుడు ఎవరికీ షాక్‌ కలిగించకపోవచ్చు. బెండకాయలను మార్కెట్లో వినియోగదారులు కిలోకు రూ. 40లు వెచ్చిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌లోని బద్వానీలో బెండకాయల హోల్‌సేల్‌ ధర కిలోకి ఒక్కరూపాయికు పడిపోయింది. దీంతో కడుపు మండిన రైతు నాలుగు ఎకరాల్లో పండించిన పంటను ట్రాక్టర్‌ను ఉపయోగించి దున్నించేశాడు. బెండకాయ ధరలు ఇంత తక్కువకు పడిపోవడం చూసిన ఈ జిల్లాలోని మరికొందరు రైతులు తమ భూమిలో పండిం చిన పంటను పశువులకు వదిలేశారు. మధ్యప్రదేశ్‌ మాత్రమే కాదు, కూరగాయల అమ్మకాలు ఇలా పతనం కావడం అనేది దేశవ్యాప్తంగా కొనసాగుతుండటం విషాదకరం.

ఇప్పుడు పంజాబ్‌లో చెరకు రైతుల దుస్థితిని పరిశీలిద్దాం. చెరకు కోత సీజన్‌ ప్రారంభమవుతున్న సమయానికి కూడా రాష్ట్రంలోని 16 చెరకు మిల్లులలో 14 (సహకార, ప్రైవేట్‌ రంగాలకు చెందిన వాటిలో) మిల్లులు గత సంవత్సరం చెరకు కోతకుగాను చెల్లించాల్సిన 250 కోట్ల రూపాయల బకాయిని ఇప్పటికీ చెల్లించలేదన్న విషయం బయట పడింది. ఒక్క పంజాబ్‌ మాత్రమే మినహాయింపు కాదు. సెప్టెంబర్‌ 11 నాటికి దేశవ్యాప్తంగా చెల్లించని చెరకు కోత బకాయిలు రూ. 15,683 కోట్లకు చేరుకున్నాయని, దీంట్లో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని పార్లమెంటులో ఇటీవల ఒక సభ్యుడు వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. తమ బకాయిలను చెరకు మిల్లులు ఒకటి రెండు సంవత్సరాలు సకాలంలో చెల్లించకపోయినప్పటికీ చెరకు రైతులు ఎలాగోలా జీవించగలిగారు. ఉద్యోగుల వేతనం ఒక్క నెల ఆలస్యం అయిందంటే చాలు ఎంత గగ్గోలు మొదలవుతుందో ఎవరైనా ఊహించుకోవలసిందే.

ఈ వార్తల్లో అసాధారణమైన విషయం ఏముందని మీరు ప్రశ్నిం చవచ్చు. ఇది సర్వసాధారణంగా జరిగే వ్యవహారమే కదా. పంటలకు గిట్టుబాటుధరలు రాకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు వీధుల్లోనే టమాటాలను, బంగాళదుంపలను, ఉల్లిపాయలను పారబోస్తున్న దృశ్యాలు మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. 2018–19 బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్రప్రభుత్వం రూ. 500 కోట్లతో ఆపరేషన్‌ గ్రీన్స్‌ పథకాన్ని ప్రారంభించిన తర్వాత కూడా ఇలాంటి పరిణామాలను దేశం చూసింది. సగటు కుటుంబం తీసుకునే కూరగాయల్లో ఈ మూడింటికి అగ్రభాగం ఉంటుంది. టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంపల ధరను స్థిరీకరించడమే ఆపరేషన్‌ గ్రీన్స్‌ పథకం లక్ష్యం. అనేక కారణాల వల్ల ఈ పథకం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. అయితే మూడింటికి మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని ఈ జూన్‌ నుంచి ఆరునెలల కాలానికి అన్ని కూరగాయలు, పండ్ల ఉత్పత్తులకు వర్తిస్తూ పొడిగించారు.

ఈ ప్రకటనలతో పనిలేకుండానే, ఆయా సీజన్లలో పండే కూరగాయల ధరలు ఎప్పుడూ పతనదిశలోనే ఉంటాయి. కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్‌ కారణంగా స్థానిక వాల్యూ చైన్‌కు అంతరాయం కలగక ముందే, కూరగాయలు పండించే రైతులు ధరల విషయంలో పదేపదే దెబ్బతింటూ వచ్చారు. తృణధాన్యాలకు, ఇతర ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ఉన్నట్లుగా కూరగాయలకు మద్దతు ధర అనేది లేకపోవడంతో తమ కూరగాయలకు మార్కెట్లో లభిస్తున్న రేటు నిజమైనదా కాదా అని తెలుసుకోలేని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కూరగాయలు పండించడానికి, కోయడానికి, రవాణా చార్జీలకు అయిన ఖర్చులను తీసివేయగా రైతులు ఉత్తిచేతులతో మార్కెట్‌ నుంచి వెనుదిరగాల్సిన సందర్భాలు అనేకసార్లు వారికి అనుభవంలోకి వచ్చాయి. నిజానికి, రైతులు కూరగాయలను పండిస్తున్నప్పుడు, తాము పంటపై లాభాన్ని కాకుండా నష్టాలను పండిస్తున్నామన్న విషయం వారికి అవగాహనలో ఉండటం లేదు. 2000–2016 కాలానికి ఓఈసీడీ–ఐసీఆర్‌ఐఈఆర్‌ సంయుక్త అధ్యయనం ప్రకారం, పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధరను తమకు కల్పించనందుకు గానూ భారతీయ రైతులు ప్రతి ఏటా రూ.2.64 లక్షల కోట్లను నష్టపోతున్నారని తేలింది. అయితే ఈ అధ్యయనం పేర్కొన్న నష్టాలు చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే తమ అధ్యయనంలో భాగంగా వీరు చాలా తక్కువ పంటలను మాత్రమే పరిశీలించారు. ఈ స్వల్ప స్థాయి అధ్యయనం సైతం.. ప్రతి ఏటా మన రైతులకు చివరికి ఏం మిగులుతోంది అనే అంశంపై దారుణ సత్యాలను వెల్లడించింది. 

రైతులు పండించే పంటలకు నిర్ణీత ధర చెల్లిస్తామన్న హామీ లేకుండా, పంటల తీరును వైవిధ్యభరితంగా మార్చాలన్న ఆలోచన అర్థరహితం మాత్రమే. అందుకనే పంజాబ్‌ రైతులను గోధుమ, వరి పంట నుంచి మళ్లించి పంటల వైవిధ్యత వైపు మళ్లించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నింటినీ ఆ రైతులు వమ్ము చేస్తూనే వచ్చారు. తృణధాన్యాలు, కాయ ధాన్యాలు, నూనె గింజలు, మొక్క జొన్న వంటి పంటలను పండించడం చాలా అవసరం అనే విషయాన్ని తోసిపుచ్చాల్సిన పని లేదు కానీ, తాము పండించే పంటలకు కచ్చితమైన ధర, సమర్థవంతమైన సేకరణ వ్యవస్థను ఏర్పర్చకుండా, మార్కెట్‌ శక్తుల ప్రభావానికి తమను బలిచేసే వైవిధ్యపూరితమైన పంటల వైపు రైతులు మారిపోతారని ఎలా భావించాలి? దశాబ్దాలుగా రైతులు న్యాయమైన ధరలకోసం పోరాడాల్సి వస్తున్న పరిస్థితుల్లో తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రూపొందించిన ఆర్థిక నమూనా భారాన్ని నిశ్శబ్దంగా మోయాల్సి వస్తోంది. మరోవైపు పారిశ్రామిక అనుకూల దృక్పథాన్ని దాటి రైతుల వైపు చూడటంలో మన ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు విఫలమవుతున్నారు.

దశాబ్దాలుగా వ్యవసాయంలో మార్కెట్‌ సంస్కరణలు అమల్లో ఉన్న అమెరికాలో సైతం చిన్న సన్నకారు రైతులు కుప్పగూలిపోయారు. అమెరికా వ్యవసాయం శ్రేష్టమైనదని భావిస్తుంటారు. వారి వ్యవసాయం జాతీయ, అంతర్జాతీయ వాల్యూ చైన్లలో భాగంగా ఉంటుంది కాబట్టి రైతులకు అది సంపదలను కొనితెస్తుందని భావి స్తుంటారు. కానీ వాస్తవికత మాత్రం పూర్తి భిన్నంగా ఉంటోంది. అమెరికా వ్యవసాయ విభాగం చెబుతున్న దానిప్రకారం వినియోగదారులు ఆహార పదార్థాలకోసం పెట్టే ప్రతి డాలర్‌ వ్యయంలో 8 శాతం మాత్రమే రైతులకు దక్కుతోందని తెలుస్తోంది. పైగా బడా రిటైల్‌ వ్యాపార సంస్థలు ఉనికిలోకి రావడంతో రైతుల వాటా మరింత క్షీణించిపోయింది.

దీన్ని అమూల్‌ డైరీ సహకార వ్యవస్థతో పోల్చి చూడండి.  అమూల్‌ పాల వినియోగదారులు పాలకోసం వెచ్చించే ప్రతి రూపాయిలో 70 నుంచి 80 శాతం వరకు రైతులకు అందుతోంది. మరి వ్యవసాయ సరకులకు కూడా ఈ దేశీయ డైరీ సహకార సంస్థ నమూనాను విస్తరింపచేస్తే ఉత్తమంగా ఉండదా? అమెరికా వ్యవసాయంలో బడా వ్యాపారులు అడుగు పెట్టడం అనేది అక్కడ చిన్న రైతులకు ఎలాంటి మేలూ కలిగించకపోగా వారిని వ్యవసాయంనుంచే పక్కకు నెట్టేశారు. మరి భారత దేశం తన సొంత విజయవంతమైన సహకార డైరీ వ్యవస్థల నుంచి పాఠం నేర్చుకోకూడదా? ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై వినియోగదారులు వెచ్చించే ప్రతి రూపాయలో (పాల విషయంలో 80 శాతం వాటా రైతులకే దక్కుతోంది) కనీసం 40 నుంచి 50 శాతం వరకైనా రైతు పరమయ్యే విధంగా సరికొత్త ఆర్థిక నమూనాలను తీసుకురావడంపై మన విధాన నిర్ణేతలు ఆలోచించకూడదా?

వ్యవసాయ ధరలను క్షీణింప చేయడం ద్వారా వ్యవసాయంపై నిరంతరం భారం మోపుతూ ఆర్థిక సంస్కరణలు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగానే రైతులు న్యూఢిల్లీ వరకు మార్చ్‌ చేస్తున్నారు. శీతల వాతావరణంలో పోలీసులు తమపై ప్రయోగిస్తున్న వాటర్‌ కానన్లను సైతం లెక్క చేయని రైతులు తమ జీవితాలపై పేరుకున్న సుదీర్ఘ శీతాకాలానికి ముగింపు పలకాలని చూస్తున్నారు. ఆర్థిక సంస్కరణలను చెల్లుబాటయ్యేలా చూడటానికి ఎంతకాలమిలా వ్యవసాయరంగాన్ని దారిద్య్రంలో ముంచెత్తుతూ ఉంటారు? వ్యవసాయదారులకు కూడా కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలను, పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. వేరు మార్గం లేక పండిం చిన పంటలను వీధుల్లోనే పారబోసే గతి పట్టకుండా తమను కాపాడే ఒక సమర్థ యంత్రాం గాన్ని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటిది అమలైనప్పుడు దశాబ్దాలుగా వ్యవసాయ వ్యాపారం ద్వారా కలుగుతున్న దుస్థితి నుంచి బయటపడగలమని వీరి నమ్మకం. అందుకనే రైతు అనుకూల విధానాలను రూపొందించడంలో కొనసాగుతున్న కరువుకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. చారిత్రకంగా రైతులకు జరుగుతూ వస్తున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఢిల్లీలో రైతు మార్చ్‌ చెబుతోంది. అప్పుడు మాత్రమే వ్యవసాయం గర్వకారణంగా ఉండే పరిస్థితి మళ్లీ నెలకొంటుంది.
వ్యాసకర్త: దేవీందర్‌ శర్మ, వ్యవసాయ నిపుణులు

ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement