సంబంధం చెడిపోతే అత్యాచారం అంటారా?
అప్పటివరకు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఆ తర్వాత తమ మధ్య సంబంధం చెడిపోతే ఒకరిపై ఒకరు అత్యాచారం ఆరోపణలు చేసుకుంటారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గత సంవత్సరం ఇచ్చిన ఓ తీర్పులో ఢిల్లీ హైకోర్టు ఈ అంశాన్ని లేవనెత్తింది. పురుషుల మీద పగ తీర్చుకోడానికి, బలవంతంగా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి కూడా అత్యాచారం కేసులను ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వకపోయినా.. తన పరిశీలనను మాత్రం సుప్రీం తెలిపింది.
ఐడీఎఫ్సీ బ్యాంకు ఉన్నతాధికారికి, ఓ అంతర్జాతీయ విమానయాన సంస్థలోని మాజీ ఉద్యోగికి మధ్య ఉన్న సంబంధం చెడిపోయిన కేసు సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఆమె చాలా ఉన్నత విద్యావంతురాలని, ఇంటర్నెట్ వాడకం కూడా బాగా అలవాటు ఉందని, తనకు పెళ్లయ్యి ఇద్దరు పిల్లలున్న విషయం కూడా ఆమెకు ముందునుంచి తెలుసని, దాన్ని దాచడం సాధ్యం కాదని సదరు వ్యక్తి చెప్పారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం పెట్టుకునే అవకాశం తనకు లేదన్నారు.
అయితే ఆమె మాత్రం.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అతడు తనతో సంబంధం పెట్టుకున్నాడని తన ఆరోపణలో పేర్కొన్నారు. తామిద్దరం సన్నిహితంగా ఉన్న వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడని కూడా అన్నారు. ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ విక్రమ్జిత్ సేన్, జస్టిస్ ఎస్కే సింగ్లతో కూడిన ధర్మాసనం విచారణలో భాగంగా ప్రశ్నించింది. అలాంటి అసభ్య ఫొటో ఎందుకు తీయనిచ్చారని, సెల్ఫీ అయితే మొత్తం శరీరాన్ని ఫొటో తీయడం సాధ్యమేనా అని ధర్మాసనం అడిగింది. రెండేళ్ల పాటు సంబంధం కొనసాగించి, అది చెడిపోయిన తర్వాత అత్యాచారం అని ఎలాఅంటారని నిలదీసింది.