సామాజిక మాధ్యమాల్లో మెడికోల పోస్టులు
వేధింపులు నిజమేనంటూ వైద్య విద్యార్థి ఇన్‌స్టాలో పోస్టు
కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్న ప్రిన్సిపాల్
సాక్షి ప్రతినిధి, అనంతపురం :వైద్య విద్యార్థులను వేధించారన్న వార్తలు అనంతపురం మెడికల్ కాలేజీలో కలకలం రేపుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ కాలేజీలోని మూడు విభాగాల్లోని కొందరు అధ్యాపకులు మెడికోలను వేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు ఈ వేధింపులకు గురిచేసినట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి.
వాస్తవానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులు రాష్ట్రంలోని ఇతర కాలేజీలు, ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసుకుంటారు. ఇప్పుడు ఈ గ్రూపుల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని ఏకంగా జనరల్ సర్జరీ విభాగంలో లైంగిక వేధింపులు జరిగాయంటూ తన ఇన్‌స్ట్రాగాంలో వెల్లడించినట్లు మెడికోలు చెబుతున్నారు. ఈ అమ్మాయి చేసిన పోస్టే ఇప్పుడు కలకలం రేపుతోంది.
పలు అనుమానాలకు తావిస్తున్న వైనం..
ప్రస్తుతం అనంతపురం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులు (నాలుగేళ్లకు కలిపి) 600 మంది, పీజీ వైద్య విద్యార్థులు 200 మంది ఉన్నారు. కాలేజీలో జరిగే వ్యవహారాలు బయటకు చెబితే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తారన్న భయంతో విద్యార్థినులు మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతున్న వేళ వేధింపుల కలకలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తాం..
మాకు కూడా ఈ విషయాలు వారం రోజుల కిందటే తెలిశాయి. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తున్నాం. – డాక్టర్ మాణిక్యాలరావు, ప్రిన్సిపాల్, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల
వాళ్లనే అడగండి చెబుతారు..
లైంగిక వేధింపుల విషయం నా దృష్టికి రాలేదు. కొంతమంది పాస్డ్‌ఔట్ విద్యార్థులు పోస్ట్ చేశారని మీరే అంటున్నారు. వాళ్లనే అడగండి.. వాళ్లే మీకు ఏం జరిగిందో చెబుతారు. – డాక్టర్ రామస్వామి నాయక్, హెచ్‌ఓడీ, జనరల్ సర్జరీ విభాగం, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల
Comments
Please login to add a commentAdd a comment