త్వరలో అరబిందో క్విప్ ఇష్యూ!
రూ. 2,000 కోట్ల నిధుల సమీకరణ యోచన
రూ. 900 కోట్లతో కొత్త యూనిట్ల ఏర్పాటు
రెండేళ్లలో రూ. 20,000 కోట్ల ఆదాయ లక్ష్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో త్వరలోనే క్విప్ ఇష్యూకి రావాలని అరబిందో ఫార్మా యోచిస్తున్నట్లు సమాచారం. ఇండిగో ఎయిర్‌లైన్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతం కావడంతో మార్కెట్ నుంచి నిధులు సమీకరించడానికి ఇదే సరైన తరుణమని కంపెనీ భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత నెలలోనే రావాలని ఆశించినా మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) విధానంలో సుమారు రూ. 2,000 కోట్ల నిధులను సమీకరించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నిధుల సేకరణ గురించి నవంబర్ 6న జరిగే బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అరబిందో ఫార్మా మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది.
లక్ష్యం మూడు బిలియన్ డాలర్ల క్లబ్
వచ్చే రెండేళ్లలో మూడు బిలియన్ డాలర్ల క్లబ్‌లో (సుమారు రూ. 20,000 కోట్ల ఆదాయం) చేరాలని అరబిందో ఫార్మా లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.12,120 కోట్లుగా ఉంటే 2017-18 నాటికి రూ.20,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకనుగుణంగా భారీ విస్తరణ ప్రణాళికలను కూడా కంపెనీ సిద్ధం చేసుకుంటోంది. ఈ ఒక్క ఏడాదిలోనే తెలుగు రాష్ట్రాల్లో యూనిట్ల విస్తరణ కోసం రూ.900 కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించింది. రూ.300 కోట్లతో విస్తరణ చేపట్టిన తెలంగాణలోని మెదక్ జిల్లా యూనిట్ విస్తరణకు ఇప్పటికే అన్ని అనుమతులూ వచ్చాయి. ఈ విస్తరణ పూర్తయితే ఈ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 96 టన్నుల నుంచి 421 టన్నులకు పెరుగుతుంది. వీటితోపాటు జడ్చర్లలో పెన్సిలిన్ యూనిట్, విశాఖపట్నం నాయుడిపేటలో ఫినిష్డ్ డోసేజ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. క్విప్ ఇష్యూ ద్వారా సేకరించే నిధులను ఈ విస్తరణ కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
ఈ ఏడాది రెండోసారి మధ్యంతర డివిడెండ్ ఇవ్వడానికి కంపెనీ సిద్ధపడింది. శుక్రవారం జరిగే బోర్డు సమావేశంలో డివిడెండ్‌పై తుది నిర్ణయం తీసుకోనుంది. తొలి త్రైమాసికంలో 50 శాతం మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికంలో రూ.2,220 కోట్ల ఆదాయంపై రూ. 406 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ ద్వితీయ త్రైమాసికంలో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడంతో కంపెనీ లాభాలు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ షేరు ధర 52 వారాల గరిష్ట స్థాయికి సమీపంలో రూ. 841 వద్ద కదులుతోంది.