
సెబీకి స్టడ్స్ ప్రాస్పెక్టస్
పార్క్ మెడి వరల్డ్, ఎస్‌ఐఎస్ క్యాష్ సర్వీస్ కూడా రెడీ..
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించుకునేందుకు మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేస్తున్నాయి. తాజాగా స్టడ్స్ హెల్మెట్స్, పార్క్ మెడి వరల్డ్, ఎస్‌ఐఎస్ క్యాష్ సర్వీస్ మొదలైన సంస్థలు తమ ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇక ఐపీవో సన్నాహాల్లో ఉన్న ఒక్కొక్క సంస్థ వివరాలను చూస్తే..
రూ. 1,260 కోట్ల పార్క్ మెడి వరల్డ్ ఇష్యూ..
పార్క్ బ్రాండ్ కింద హాస్పిటల్ చెయిన్ నిర్వహించే పార్క్ మెడి వరల్డ్ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,260 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. ఈ ఇష్యూ కింద రూ. 900 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రీ–ఐపీవో ప్లేస్‌మెంట్ కింద రూ. 192 కోట్లు సమీకరించే యోచనలో కంపెనీ ఉంది.
ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 410 కోట్ల మొత్తాన్ని రుణాలను తీర్చేసేందుకు, రూ. 110 కోట్లను కొత్త ఆస్పత్రి నిర్మాణం, అనుబంధ సంస్థలైన పార్క్ మెడిసిటీ (ఎన్‌సీఆర్), బ్లూ హెవెన్స్‌కి చెందిన ప్రస్తుత ఆస్పత్రుల విస్తరణ కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 3,000 పైచిలుకు పడకల సామర్థ్యంతో ఉత్తరాదిలో పార్క్ మెడి వరల్డ్ రెండో అతి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చెయిన్‌గా కార్యకలాపాలు సాగిస్తోంది. న్యూఢిల్లీ, జైపూర్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో కంపెనీకి 13 మల్టీ–సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి.
ఎస్‌ఐఎస్.. షేర్ల జారీతో రూ. 100 కోట్లు..
క్యాష్ లాజిస్టిక్స్ సేవల సంస్థ ఎస్‌ఐఎస్ క్యాష్ సర్వీస్ తాజాగా షేర్లను జారీ చేయడం ద్వారా ఐపీవో కింద రూ. 100 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ సంస్థలు ఎస్‌ఐఎస్ లిమిటెడ్, ఎస్‌ఎంసీ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ 37.15 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనున్నాయి.
తాజా షేర్ల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో రూ. 37.59 కోట్లను వాహనాల కొనుగోళ్లు, ఫ్యాబ్రికేషన్‌కు, రూ. 30 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపరంగా 17–18 శాతం మార్కెట్ వాటాతో పరిశ్రమలో రెండో అతి పెద్ద సంస్థగా ఎస్‌ఐఎస్ క్యాష్ సర్వీసెస్ నిలుస్తోంది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లో కంపెనీ రూ. 530 కోట్ల ఆదాయాన్ని రూ. 39 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
సందిగ్ధంలో కొన్ని..
మరోవైపు, ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వర్క్‌స్పేస్ ఆపరేటర్ వుయ్‌వర్క్ ఇండియా మేనేజ్‌మెంట్ ఐపీవో ప్రతిపాదనను సెబీ పక్కన పెట్టింది. ఇందుకు నిర్దిష్ట కారణాలేమీ వెల్లడి కాలేదు. ఇష్యూ కింద ప్రమోటర్ సంస్థ ఎంబసీ బిల్డ్‌కాన్, 1 ఏరియల్ వే టెనెంట్ అనే ఇన్వెస్టరు 4.37 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానం కింద విక్రయించే యోచనలో ఉన్నాయి.
అటు ఫెర్టిలిటీ క్లినిక్ చెయిన్ ఇందిరా ఐవీఎఫ్ తమ ఐపీవో ముసాయిదా పత్రాలను వెనక్కి తీసుకుంది. ఐపీవో సన్నాహాల సమయంలోనే కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ మూర్దియాపై బాలీవుడ్ బయోపిక్ విడుదల కావడమనేది ఇష్యూను పరోక్షంగా ప్రభావితం చేస్తుందని సెబీ అభిప్రాయం వ్యక్తం చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందిరా ఐవీఎఫ్ ఐపీవో పత్రాలను దాఖలు చేసిన సుమారు నెల రోజుల్లో మార్చి 21న చిత్రం విడుదలైంది. ఇందులో అనుపమ్ కేర్, ఈషా డియోల్ నటించారు.
ఓఎఫ్‌ఎస్ మార్గంలో స్టడ్స్..
పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించడంపై హెల్మెట్ల తయారీ సంస్థ స్టడ్స్ యాక్సెసరీస్ రెండోసారి కసరత్తు చేస్తోంది. ఏడేళ్ల క్రితం 2018లో ఇందుకు సంబంధించి సెబీ నుంచి అనుమతులు పొందినప్పటికీ, అప్పట్లో ముందుకెళ్లలేదు. తాజా ప్రతిపాదన ప్రకారం ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ గ్రూప్, ఇతరత్రా షేర్‌హోల్డర్లు 77.9 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇది పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఐపీవో ద్వారా సమీకరించిన నిధులేమీ కంపెనీకి లభించవు. స్టడ్స్ యాక్సెసరీస్ సంస్థ ’స్టడ్స్’, ’ఎస్‌ఎంకే’ బ్రాండ్ల కింద టూ–వీలర్ హెల్మెట్లను తయారు చేస్తోంది.
అలాగే స్టడ్స్ బ్రాండ్ కింద గ్లవ్స్, హెల్మెట్ లాకింగ్ డివైజ్‌లు, రెయిన్ సూట్‌లు వంటి యాక్సెసరీలను ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా 70 పైచిలుకు దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమెరికాలో ఓ’నీల్ అనే సంస్థకు, ’డేటోనా’ బ్రాండ్ పేరిట జే స్క్వేర్డ్ అనే సంస్థకు హెల్మెట్లు తయారు చేసి అందిస్తోంది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ రూ. 285 కోట్ల ఆదాయంపై రూ. 33 కోట్ల నికర లాభం ఆర్జించింది.
పేస్ డిజిటెక్ అదే బాటలో..
న్యూఢిల్లీ: టెలికం టవర్, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల విభాగంలో సొల్యూషన్లు అందించే పేస్ డిజిటెక్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావిస్తోంది. తద్వారా రూ. 900 కోట్లు సమీకరించనుంది. టెలికం మౌలిక సదుపాయాల విభాగంలో సేవలందించే కంపెనీ ఐపీవోకు ముందు రూ. 180 కోట్ల ప్లేస్‌మెంట్ చేపట్టే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 630 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన 6 నెలల్లో రూ. 1,188 కోట్ల ఆదాయం, రూ. 152 కోట్ల నికర లాభం సాధించింది.