న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్–జూన్ మధ్య అసలు వృద్ధిలేకపోగా –16.5 శాతం క్షీణిస్తుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధనా నివేదిక ఎక్రోప్ తాజాగా అంచనావేసింది. అయితే మే నెల నివేదికతో పోల్చితే (మైనస్ 20 శాతం కన్నా ఎక్కువ క్షీణత) క్షీణ రేటు అంచనా కొంత తగ్గడం ఊరటనిస్తున్న అంశం. సోమవారం విడుదలైన తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...
► కొన్ని లిస్టెస్ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కంపెనీల ఫలితాలు ఊహించినదానికన్నా బాగున్నాయి. కార్పొరేట్ గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) గణాంకాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఉత్పత్తిదారులు లేదా సరఫరాల వైపు నుంచి ఒక ఆర్థిక సంవత్సరం, లేదా త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత ఎలా ఉందన్న అంశాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకించి పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు (ఉత్పత్తి స్థాయిలో) ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి జీవీఏ దోహదపడుతుంది. ఏ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి? దేనికి అక్కర్లేదు అన్న విషయాన్ని నిర్దారించుకునే క్రమంలో విధాన నిర్ణేతలకు జీవీఏ దోహదపడుతుంది.
► ఇప్పటి వరకూ దాదాపు 1,000 లిస్టెడ్ కంపెనీల ఫలితాలు తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యాయి. ఇందులో 25 శాతానికిపైగా కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. 55 శాతానికిపైగా సంస్థల లాభాలు క్షీణించాయి. విశేషం ఏమిటంగే, కార్పొరేట్ జీవీఏ మాత్రం కేవలం 14.1 శాతం మాత్రమే క్షీణించింది. ఇది కార్పొరేట్ రంగంలో ఒక సానుకూల సంకేతం.
► లిస్టెడ్ కంపెనీల ఆదాయాలు పడిపోవడం ఆయా సంస్థల వ్యయ హేతుబద్దీకరణలపై ప్రభావం చూపిస్తోంది తప్ప, లాభాలపై కాదు.
► జూలై, ఆగస్టుల్లో కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది.
► కోవిడ్–19 వల్ల తొలి త్రైమాసికంలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు మొత్తంగా 16.8 శాతం క్షీణంచనున్నాయి.
► కరోనా వైరస్ వల్ల దేశంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.27,000 తలసరి ఆదాయ నష్టం జరగనుంది. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, గోవా రాష్ట్రాల్లో తలసరి ఆదాయ నష్టం రూ.40,000 వరకూ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment