భారత్ ఆర్థిక వ్యవస్థపై నైట్ ఫ్రాంక్ నివేదిక
మౌలిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగాలని వ్యాఖ్య
తద్వారా ఇతర రంగాల్లో ప్రభుత్వ వ్యయాలకు మార్గం
న్యూఢిల్లీ: భారతదేశం 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి పలు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది.
ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా, ‘ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: రివైవింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్స్’ శీర్షికన ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2030 నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పరిమాణాన్ని 7 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అత్యవసరం‘ అని నివేదికలో పేర్కొంది. నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ వివరించిన నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే...
→ 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని సాధించడానికి దేశం 2024– 2030 మధ్య 10.1 శాతం పురోగతి సాధించాలి.
→ మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ అభివృద్ధికి కీలకం. ఈ విషయంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. పెరిగిన బడ్జెట్ కేటాయింపులతో లాజిస్టిక్స్ పనితీరు సూచిక (ఎల్‌పీఐ) విషయంలో భారత్ ర్యాంకింగ్ 2023లో 54కు ఎగసింది. 2014లో ఇది సూచీ 54 వద్ద ఉంది.
→ గత కొన్ని సంవత్సరాలుగా దేశ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించేందుకు విధాన నిర్ణేతలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
→ దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి తద్వారా ఆర్థిక వృద్ధిలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రైవేట్ సంస్థలకు దేశంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
→ అయితే మౌలిక రంగం పురోగతికి సంబంధించి ఎదురయ్యే కొన్ని సవాళ్లు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా చూస్తే, ద్రవ్యలోటు పరంగా ఎదురయ్యే సవాళ్లను ఇక్కడ ప్రస్తావించుకోల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు తీవ్రం కాకుండా చూసుకోవడంలో భాగంగా మౌలిక రంగంపై పెట్టుబడుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి వ్యహరించాల్సిన అవసరం ఉంటుంది.
→ భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం గణనీయంగా తగ్గింది, 2009–13 మధ్య 160 బిలియన్ల (మొత్తం పెట్టుబడులలో 46.4 శాతం) ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. 2019–23 మధ్య ఈ విలువ దారుణంగా 39.2 బిలియన్ (మొత్తం పెట్టుబడుల్లో 7.2 శాతం)క డాలర్లకు పడిపోయింది. అయితే ప్రభుత్వ పరంగా ఈ విభాగంలో పెట్టుబడులు పెరిగాయి. అయితే ఇది ద్రవ్యలోటు సమస్యలకూ దారితీస్తున్న సమస్య. ప్రైవేటు రంగంలో మౌలిక విభాగ పెట్టుబడులు పెరగడం వల్ల ప్రభుత్వాలు ద్రవ్యలోటు సమతౌల్యతను రక్షించగలుగుతాయి.
→ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడే చర్యల విషయంలో ప్రభుత్వ వ్యయాన్ని వినియోగించవచ్చు. ప్రజారోగ్య సంరక్షణ, మానవ వన రుల పురోగతి, రుణ చెల్లింపులు వంటి ఇతర ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఇతర కీలక విభాగాలకు ప్రభుత్వం వ్యయాన్ని మళ్లించవచ్చు.
→ రంగాల వారీగా చూస్తే పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లు, రోడ్డు రవాణా రహదారులు, గోడౌన్లు, రవాణా రంగాలు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి తగిన కీలక విభాగాలు.
→ వేగవంతమైన పట్టణీకరణ, యువత అధికంగా ఉండడం, పట్టణ ప్రాంతాల పురోగతి, ఎయిర్‌పోర్ట్‌లు, విద్యుత్ సరఫరా వంటి రంగాలు భారీ పెట్టుబడి అవకాశాలను కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment