
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన వద్ద ఉన్న మిగులును కేంద్రానికి బదిలీ చేయడం పరిపాటిగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వానికి భారీగానే ఆర్‌బీఐ డివిడెండ్ రూపంలో ముట్టజెప్పిందని ఆర్థికవేత్తలు తెలుపుతున్నారు. గడిచిన ఏడాదిలో ఆర్‌బీఐ కేంద్రానికి ఇచ్చిన మొత్తం ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది రికార్డు చెల్లింపులతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలోనూ అంతకుమించి సుమారు రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. అసలు ఆర్‌బీఐకి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న మార్గాలేమిటో తెలుసుకుందాం.
లిక్విడిటీ ఆపరేషన్స్
పెద్ద ఎత్తున లిక్విడిటీ కార్యకలాపాల ద్వారా వచ్చే వడ్డీ రిజర్వ్ బ్యాంక్‌కు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (ఎల్ఏఎఫ్) కింద రెపో ఆపరేషన్ల ద్వారా బ్యాంకులకు నిధులు ఇస్తుంది. బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలను తాకట్టు పెట్టి ఆర్‌బీఐ నుంచి అప్పు తీసుకుంటాయి. ఆర్‌బీఐ ఈ రుణాలపై వడ్డీని సంపాదిస్తుంది. ఎల్ఏఎఫ్ మాదిరిగానే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) ద్వారా బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి కొంచెం అధిక వడ్డీ రేటుతో అదనపు నిధులను పొందడానికి అనుమతిస్తుంది. లిక్విడిటీ నిర్వహణ కోసం ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయిస్తుంది. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) అంటారు. లిక్విడిటీ నియంత్రణ దీని ప్రాథమిక లక్ష్యం అయితే, ఈ లావాదేవీలు వడ్డీని సమకూరుస్తాయి.
ఇదీ చదవండి: కళను దొంగలిస్తున్న ఏఐ
మితిమీరిన నగదు బదిలీతో నష్టాలేంటి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ప్రభుత్వానికి మిగులు బదిలీ అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తుంది.
మిగులు బదిలీ కోసం ఆర్‌బీఐ తన ఆకస్మిక నిల్వలను(కంటింజెన్సీ రిజర్వులు) వాడుకునే ప్రమాదం ఉంది. ఇది ఆర్థిక సంక్షోభాలకు సమర్థవంతంగా స్పందించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
ప్రతిసారి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి మిగులు బదిలీ చేస్తుంటే కేంద్రం డిమాండ్‌కు ఆర్‌బీఐ ప్రభావితమవుతుందనే భావన కలుగుతుంది. ఇది దాని స్వయంప్రతిపత్తి, విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
మిగులు బదిలీలు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని అందించినప్పటికీ అవి స్థిరమైన ఆదాయ-ఉత్పాదక చర్యలను అమలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరుత్సాహపరుస్తాయి. ఇది దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్లకు దారితీస్తుంది.
ప్రభుత్వ వ్యయానికి అధికంగా నిధులు సమకూర్చడానికి నగదు బదిలీలను ఉపయోగిస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీస్తుంది.