Surplus
-
Narendra Modi: ఆహార మిగులు దేశంగా భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ ఆహార మిగులు దేశంగా మారిందని, ప్రపంచ ఆహార, పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలను అందించేందుకు కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారత ఆర్థిక విధానాలకు వ్యవసాయమే కేంద్ర బిందువని, ఆహార భద్రతకు చిన్న రైతులే అతి పెద్ద బలమని స్పష్టంచేశారు. శనివారం ఢిల్లీలో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ఆయన మాట్లాడారు. 65 ఏళ్ల క్రితం వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న భారత్ నేడు ఆహార మిగులు దేశంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. పాలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని, ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, టీ, చేపల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉందని తెలిపారు. ప్రపంచ సంక్షేమానికి భారత్‌ను ’విశ్వ బంధు’గా అభివరి్ణంచారు.ప్రకృతి సాగుతో సానుకూల ఫలితాలు ప్రకృతి వ్యవసాయాన్ని భారీగా ప్రోత్సహించడంతో దేశంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయని మోదీ తెలిపారు. సుస్థిరమైన, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల సాగు విధానాలపై ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. పంటల పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. గడిచిన పదేళ్లలో భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే దాదాపు 1,900 కొత్త వంగడాలను రైతులకు అందజేసినట్లు చెప్పారు. సాంప్రదాయ రకాల కంటే 25 శాతం తక్కువ నీరు అవసరమయ్యే వరి రకాలను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. భారత తృణధాన్యాల బుట్టను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.సాంకేతికత పరిజ్ఞానంతో అనుసంధానం వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో అనుసంధానిస్తున్నామని మోదీ వెల్లడించారు. సోలార్ ఫార్మింగ్ మొదలుకుని ఈ–నామ్ తదితరాలను ఉదాహరించారు. సంప్రదాయ రైతుల నుండి అగ్రికల్చర్ స్టార్టప్‌ల వరకు, సహజ వ్యవసాయం నుండి ఫార్మ్ వ్యవసాయం వరకు వివిధ వ్యవసాయ, అనుబంధ రంగాల ఆధునీకరణ గురించి వివరించారు. పదేళ్లలో 90 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ కిందకు తీసుకొచ్చామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఒక్క క్లిక్‌తో 10 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేస్తున్నామన్నారు. పంటల సర్వే కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చామని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన ఆధునిక చర్యలు భారతదేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ప్రపంచ ఆహార భద్రతను బలోపేతం చేస్తాయన్నారు. అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సుకు 70 దేశాల నుంచి వెయ్యి మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల 7వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. -
డబ్బు ఎలా ఖర్చు చేయాలి.. జర చెప్పండి ప్లీజ్: బెంగళూరు టెకీ జంట
పలు అవసరాలకు డబ్బులు సాయం చేయమని, ఆపదలో ఉన్నాం ఆదుకోమని అడగడం చాలా కామన్. కానీ డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ఎలా ఖర్చు చేయాలో చెప్పండి మహాప్రభో అని అడిగేవారిని ఎక్కడైనా చూశారా? సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి! బెంగళూరు టెకీ జంట నెలకు రూ. 7 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. బెంగళూరులో ఇల్లు, ఖరీదైన కారు, సౌకర్యవంతమైన జీవితం. కానీ మిగిలిన డబ్బును పూర్తిగా ఎలా ఖర్చు చేయాలో తెలియడం లేదట. మిగులు ఆదాయాన్ని ఎక్కడ, ఎలా ఖర్చు చేయాలో తెలియని గందరగోళంలో ఉన్నామంటూ నెటిజనులను అభ్యర్థించడం వైరల్‌గా మారింది.భారతీయ నిపుణుల జీతాలు, ఆఫీస్ పరిస్థితులు, ఆర్థిక విషయాల గురించి చర్చించే ‘గ్రేప్‌వైన్’ అనే యాప్‌లో ఈ దంపతులు పోస్ట్ పెట్టగా ‘ఎక్స్’లోనూ చక్కర్లు కొడుతోంది. ‘గ్రేప్‌వైన్’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సౌమిల్ త్రిపాఠి ‘ఎక్స్’లో స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో నెట్టింట ఇది హాట్‌టాపిక్‌గా నిలిచింది. 30 సంవత్సరాల వయస్సు గల భార్యాభర్తలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వార్షిక బోనస్‌తో పాటు నెలవారీ సంపాదన రూ. 7 లక్షలు. ఇందులో 2 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు. ఇక నెల ఖర్చులు రూ. 1.5 లక్షలు పోను వారికి నెలకు రూ. 3లక్షలకు పైగానే మిగులుతోంది. ఈ దంపతులకు ఇంకా పిల్లలు కూడా లేరు. పైగా విలాసంగా జీవించాలనే, ఎక్కువగా ఖర్చు పెట్టాలనే కోరిక భార్యభర్తలిద్దరికీ లేదు. అందుకే మిగిలిన డబ్బును ఎలా, ఎక్కడ వినియోగించాలో అర్థం కావడంలేదు. అందుకే ఏమైనా సూచనలివ్వండి అంటూ పోస్ట్ పెట్టారు.దీంతో యూజర్లు కొంతమంది ఫన్నీగా, మరికొంతమంది సీరియస్‌గానే తెగ సలహాలిచ్చేస్తున్నారు. పబ్లిక్/ప్రైవేట్ కాస్ (లేదా రియల్ ఎస్టేట్) వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టమని, లగ్జరీ వెకేషన్‌కి వెళ్లమని కొందరు, పిల్లలకోసం ప్లాన్ చేసుకోమని ఇలా తోచినట్టు సలహాలిచ్చేశారు. దీంతోపాటు, జంతు సంక్షేమ స్వచ్ఛంద సంస్థలు లేదా అనాథాశ్రమాలకు విరాళం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ''నాకు కొంత ఇవ్వండి, నాకు సరిపడా జీతం రావడం లేదు'' అని ఒకరు కమెంట్ చేశారు. మరి మీరేమంటారు.. కామెంట్ సెక్షన్లో తెలపండి. -
సోలార్ విద్యుత్ ఇన్స్టలేషన్లలో క్షీణత
న్యూఢిల్లీ: సోలార్ అదనపు విద్యుత్ సామర్థ్యం ఏర్పాటు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1.7 గిగావాట్లకు పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఏర్పాటైన 4 గిగావాట్లతో పోలిస్తే 58 శాతం తగ్గినట్టు మెర్కామ్ ఇండియా సంస్థ తెలిపింది. జూన్ త్రైమాసికంలో సోలార్ మార్కెట్‌కు సంబంధించి నివేదికను విడుదల చేసింది. ఇక ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఏర్పాటైన 1.9 గిగావాట్ల ఇన్స్టాలేషన్స్తో పోలి్చనా 10 శాతం తగ్గింది. జూన్ త్రైమాసికంలో కొత్తగా ఏర్పాటైన సోలార్ విద్యుత్ సామర్థ్యంలో 77 శాతం భారీ ప్రాజెక్టుల రూపంలో ఉంది. అంటే 1.3 గిగావాట్లు ఈ రూపంలోనే సమకూరింది. రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు 23 శాతం వాటా ఆక్రమించాయి. ఇక ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో, 3.6 గిగావాట్ల సోలార్ ఇన్స్టాలేషన్లు నమోదయ్యాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏర్పాటైన 7.6 గిగావాట్లతో పోల్చి చూసినప్పుడు 53 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఇక దేశం మొత్తం మీద సోలార్ విద్యుత్ ఇన్స్టాలేషన్ సామర్థ్యం జూన్ చివరికి 66 గిగావాట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో భారీ సోలార్ ఇన్స్టాలేషన్లలో గుజరాత్ 41 శాతం వాటా ఆక్రమించింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 20 శాతం, కర్ణాటకలో 14 శాతం చొప్పున ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మద్య దేశంలో 8.4 గిగావాట్ల నూతన విద్యుత్ సామర్థ్యం సమకూరగా, అందులో 43 శాతం సోలార్ రూపంలోనే ఉండడం గమనించొచ్చు. ప్రాజెక్టుల్లో జాప్యం.. ప్రాజెక్టుల్లో జాప్యం, విస్తరణ ఇతర కారణాల వల్ల పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు మెర్కామ్ క్యాపిటల్ గ్రూప్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. 2024 సంవత్సరం ఎంతో ఆశావహంగా ఉందన్నారు. సోలార్ విడిభాగాలు, ప్రాజెక్టుల వ్యయాలు వేగంగా తగ్గుతుండడం ఈ పరిశ్రమ వృద్దికి ప్రేరణగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో సోలార్ ఇన్స్టాలేషన్లు బలహీనంగా ఉన్నాయి. దీంతో రెండో త్రైమాసికంలో ఇన్స్టాలేషన్లు మరింత నిదానించాయి. కొన్ని భారీ సోలార్ ప్రాజెక్టుల విస్తరణకు అనుమతులు వచ్చాయి. అయినా కానీ భూమి, బదిలీ అంశాలు జనవరి–జూన్ త్రైమాసికంలో ఇన్స్టాలేషన్లపై ప్రభావం చూపించాయి’’అని రాజ్‌ప్రభు వివరించారు. -
కరెంట్ అకౌంట్ మిగులు @ 20 బిలియన్ డాలర్లు
ముంబై: కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో 2020 వరుసగా రెండవ త్రైమాసికం ఏప్రిల్–జూన్‌లోనూ భారత్ మిగులను నమోదు చేసుకుంది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. సంబంధిత త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా కరెంట్ అకౌంట్ మిగులు 0.6 బిలియన్ డాలర్లు (0.1 శాతం) నమోదయ్యింది. అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ ప్రతిబింబిస్తుంది. వస్తువులు, సేవలకు సంబంధించి ఒక దేశం ఎగుమతులు–దిగుమతుల లావాదావీల వ్యయాలు, విదేశీ ఇన్వెస్టర్లకు చేసిన చెల్లింపులు, వారి నుంచి వచ్చిన నిధులు, ఆయా పరిమాణాల వ్యత్యాసాలు అన్నీ కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. సహజంగా భారత్ కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్)ను కలిగి ఉంటుంది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో దిగుమతులు భారీగా పడిపోవడంతో కరెంట్ అకౌంట్ మిగులు నమోదవుతోంది. 2019–20లో కరెంట్ అకౌంట్ లోటు 24.6 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 0.9 శాతం. 2020–2021లో 30 బిలియన్ డాలర్ల కరెంట్ అకౌంట్ ‘మిగులు’ ఉంటుందని ఇక్రా అంచనా. -
కేంద్రానికి ఆర్బీఐ రూ.57,128 కోట్ల చెక్
ముంబై: కేంద్ర ప్రభుత్వానికి రూ.57,128 కోట్ల మిగులు నిధులను బదలాయింపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డ్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటన వెల్లడించింది. సెంట్రల్ బోర్డ్ 584వ సెంట్రల్ బోర్డ్ సమావేశం సందర్భంగా ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక అవసరాలకుగాను (ద్రవ్య, ఫైనాన్షియల్ సంబంధ స్థిరత్వం, రుణ, నిర్వహణా సంబంధ వ్యయాలకు) తన మొత్తం బ్యాలెన్స్ షీట్లో 5.5 శాతం కంటెన్జెన్సీ రిస్క్ బఫర్ (సీఆర్బీ)ను కొనసాగించాలని కూడా ఆర్బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించిందని ప్రకటన తెలిపింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ సవాళ్లు, కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు, వస్తున్న ఫలితాలు తత్సంబంధ అంశాలపై బోర్డ్ చర్చించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. – ప్రస్తుతం ఆర్బీఐ ఆర్థిక సంవత్సరం జూలై–జూన్. 2021–22 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్–మార్చికి మారుతుంది. ఈ మార్పునకు వీలుగా ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 9 నెలలను ఫైనాన్షియల్ ఇయర్‌గా పాటిస్తోంది. ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై దృష్టి: 6వ తేదీ ఆర్బీఐ పాలసీ నిర్ణయానికి అనుగుణంగా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుపై బోర్డ్ చర్చించడం శుక్రవారం సమావేశంలోని మరో ముఖ్యాంశం. అందరినీ ఆర్థిక ప్రగతిలో భాగస్వాములను చేయడం, బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తేవడం, సేవల పటిష్టత లక్ష్యంగా ప్రత్యేక యంత్రాంగాన్ని (ఇన్నోవేషన్ హబ్)ను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ ఈ నెల 6 పాలసీ ప్రకటన సందర్భంగా నిర్ణయించింది. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన తగిన చర్యలను నియంత్రణా వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడం ఈ హబ్ ప్రధాన బాధ్యతల్లో ఒకటి. గత ఆర్థిక సంవత్సరం నిర్వహించిన వివిధ కార్యకలాపాలపైనా బ్యాంక్ చర్చించింది. 2019–20 ఆర్బీఐ అకౌంట్స్‌ను, వార్షిక నివేదికను ఆమోదించింది. -
బ్యాంకులు నిధులు సమీకరించుకోవాలి
ముంబై: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సమస్యలను అధిగమించేందుకు బ్యాంకులకు నిధులు అవసరమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. రుణ వితరణతోపాటు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే అందుకు బ్యాంకుల వద్ద మిగులు నిల్వలు కీలకమవుతాయన్నారు. ‘‘ఇటువంటి సమయాల్లో బ్యాంకులు తమ పాలనను, సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఎంతో ముఖ్యం. ముందస్తు అంచనాలతో అవి నిధులను సమకూర్చుకోవాలి. అంతేకానీ ఆ అవసరం ఏర్పడే వరకు వేచి చూడరాదు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు చురుగ్గా వ్యవహరిస్తూ తమ వద్ద తగినంత మిగులు నిధులు ఉండేలా చూసుకోవాలి’’ అని శక్తికాంతదాస్ అన్నారు. ఎస్బీఐ నిర్వహించిన బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించిన సందర్భంగా ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.లాక్డౌన్, అనంతర పరిణామాలతో మొండి బకాయిలు (ఎన్పీఏలు) పెరిగే అవకాశాలు ఉన్నాయని గవర్నర్ అంచనా వేశారు. కరోనా కారణంగా తమ బ్యాలెన్స్ షీట్లపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని ఆర్బీఐ ఇటీవలే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను కోరింది. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా సమస్యలను అధిగమించడం, నిధులు సమీకరించడంపై ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించినట్టు శక్తికాంతదాస్ తెలిపారు. -
‘ఆర్బీఐని దోచేస్తున్నారు’
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి రూ 1.76 లక్షల కోట్ల మిగులు నిధులు సమకూరడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఆర్బీఐ నుంచి ప్రభుత్వం మిగులు నిధులను లూటీ చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని, ఆర్థిక మంత్రి తమకు తాము ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడం నుంచి ఎలా బయటపడాలో దిక్కుతోచక ఆర్బీఐ నుంచి నిధుల చోరీకి పాల్పడిన తీరు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోదని అన్నారు. ఆస్పత్రి నుంచి బ్యాండ్‌ఎయిడ్‌ను దొంగిలించి కాల్పుల గాయంపై అమర్చినట్టే ఈ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. గృహనిర్మాణం నుంచి తయారీ రంగం వరకూ అన్ని రంగాల్లో ఆర్థిక మందగమనం నెలకొన్న సమయంలో ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వానికి పెద్దమొత్తంలో నగదు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర బ్యాంక్ నుంచి ప్రభుత్వానికి సమకూరే రూ 1.76 లక్షల కోట్లలో రూ 1.23 లక్షల కోట్లు డివిడెండ్ కాగా, రూ 52,460 కోట్లు మిగులు నిధుల నుంచి ఆర్బీఐ ప్రభుత్వానికి అందచేస్తోంది. ఆర్బీఐని ఈరకంగా దోపిడీ చేయడం మన ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యేందుకు, బ్యాంకు క్రెడిట్ రేటింగ్ తగ్గేందుకు దారితీస్తుందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. -
ఆర్బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మిగులు నిల్వల బదలాయింపు జరగాలన్న ధోరణిని మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులను ఇది ప్రస్ఫుటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ నేతృత్వంలోని బిమల్‌జలాన్ కమిటీ కేంద్రానికి తన నివేదికను ఇవ్వడానికి కసరత్తు చేస్తున్న తరుణంలోనే దువ్వూరి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబుతార ని పేరున్న దువ్వూరి సీఎఫ్ఏ సొసైటీ ఇండియా ఇక్కడ శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► తన మొత్తం రుణాల్లో కొంత భాగాన్ని విదేశీ బాండ్ల జారీ ద్వారా సమీకరించుకోవాలన్న 2019–2020 బడ్జెట్ ప్రకటన బాగానే ఉంది. అయితే ఇది ఒకసారికైతే పర్వాలేదు. పదేపదే ఇదే ప్రయోగం అయితే కష్టమవుతుంది. ► సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై దాడికి ప్రపంచంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తే, అది సరికాదు. ఇది ప్రభుత్వ తీవ్ర ఇబ్బందికర నైరాశ్య ధోరణిని ప్రతిబింబిస్తుంది. ► ప్రపంచంలోని ఇతర సెంట్రల్ బ్యాంకులతో ఆర్బీఐని పోల్చిచూడటం సరికాదు. వాటితో పోల్చితే ఆర్బీఐ పనివిధానం, ఇబ్బందులను ఎదుర్కొనే ధోరణి వేరు. అందువల్ల ‘మిగులు నిధుల బదలాయింపుల విషయంలో’ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలనే భారత్‌లోనూ అనుసరించాలనుకోవడం సరికాదు. ► అటు ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్స్‌తో ఇటు సెంట్రల్బ్యాంకుల బ్యాలెన్స్ షీట్స్‌ను కూడా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పరిశీలిస్తారు. ఇందుకు తగినట్లు నిర్ణయం తీసుకుంటారు. ట ఆర్బీఐ బాధ్యతలు విస్తృతంగా ఉంటాయి. ఎన్నికలు, గెలుపు వంటి కొన్ని అంశాలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. ఆర్బీఐ విషయంలో ఇలాంటివి ఏవీ ఉండవు. కనుక ఆర్బీఐకి ఎప్పుడూ స్వయంప్రతిపత్తి కీలకాంశం. ► ప్రస్తుతం ఆర్బీఐ వద్ద దాదాపు రూ. 9 లక్షల కోట్ల రూపాయల మిగులు నిధులున్నాయి. ఆర్బీఐ సాయంతో ప్రభుత్వ విత్తలోటు ఆందోళనలు ఉపశమిస్తాయని అంచనా. నిధుల బదిలీ అంశమై బిమల్ జలాన్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలిసింది. ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద మొత్తం అసెట్స్‌లో 14 శాతం రిజర్వుల రూపంలో ఉంటాయి. ఆర్బీఐ వద్ద 28 శాతం రిజర్వులున్నాయి. ఈ రిజర్వుల పరిమితిని తగ్గించగా వచ్చే మిగులు నిధులను ప్రభుత్వం వాడుకోవాలని యోచిస్తోంది. గత గవర్నర్ల హయాంలో ఈ అంశమై ఆర్బీఐ, కేంద్రప్రభుత్వాలకు మధ్య కొంత మేర ఘర్షణాపూరిత వాతావరణం ఏర్పడింది. గతంలో ఈ అంశంపై చర్చించేందుకు 1997లో సుబ్రమణ్యం కమిటీ, 2004లో ఉషా థోరట్ కమిటీ, 2013లో మాలేగామ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ఆర్బీఐ 12–18% వరకు రిజర్వులుంచుకొని మిగిలినవి ప్రభుత్వానికి బదిలీ చేయాలని సూచించాయి. -
ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొముర అంచనా వేసింది. నొముర దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్బీఐ నుంచి నిధుల బదలాయింపు ఒకేసారి జరక్కపోవచ్చని, వరుసగా మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అందివచ్చే నిధుల్లో 45 శాతం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని, 20 శాతాన్ని బ్యాంకుల మూలధన పెట్టుబడులకు వినియోగించుకునే వీలుందని నొముర పేర్కొంది. ప్రభుత్వ రుణభారం 25 శాతానికి తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చిన మొత్తంపై ఆధారపడి మిగిలిన 10 శాతం వ్యయాలు ఉంటాయని పేర్కొంది. బ్యాంకులకిస్తే బెటర్: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరతతో ఇబ్బందులు పడుతున్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ ఇప్పటికే అభిప్రాయపడింది. ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై సిఫారసులకు గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతున్న విభేదాల కారణంగా నివేదిక ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. జూలైలో నివేదిక సమర్పించవచ్చని సమాచారం. ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మూడు లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించవచ్చని ఈ కమిటీ సిఫారసు చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ తాజా నివేదిక అంచనా వేసింది. ఆర్బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? కేంద్రం ద్రవ్యలోటును ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10న వ్యక్తిగత కారణాలతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రకటించారు. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్లో జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఇప్పటికే మూడు కమిటీలు... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై 3 కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) వీటికి నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12% వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, థోరట్ కమిటీ 18%గా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారులకు ఓకే చెప్పింది. లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28% నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14% నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. -
గ్రామీణ బ్యాంకుల్లో మేమే నెంబర్‌వన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని గ్రామీణ బ్యాంకులన్నింటిలో మిగులు నిధులు, ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా టాప్‌లో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. బ్యాంకు వద్ద రూ.2286 కోట్ల మిగులు నిధులున్నాయని, నిర్వహణ లాభం 16 శాతం వృద్దితో రూ. 958 కోట్లకు చేరిందని చెప్పారాయన. ఎస్బీఐ ప్రాయోజిత 16 ఆర్ఆర్బీల మొత్తం వ్యాపారంలో తమ వాటా 20 శాతమని తెలిపారు. గతంలో ఐపీఓకి వచ్చే ఆలోచన చేశామని, రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయామని, ఇప్పట్లో ఐపీఓకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు ఆర్థిక ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామీణ బ్యాంకుల విలీనంపై... రాష్ట్రానికి ఒకటి లేదా రెండు గ్రామీణ బ్యాంకులే ఉండాలన్న కేంద్ర ఆలోచనకు అనుగుణంగా ఏపీలో గరిష్టంగా రెండు గ్రామీణ బ్యాంకులుంటాయి. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకులను ఏపీజీవీబీ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుల్లో విలీనం చేస్తారు. రాష్ట్ర విభజనానంతరం తలెత్తిన సమస్యలను కేంద్రం పరిష్కరించాక విలీన ప్రక్రియ ఉంటుంది. ఇది వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చు. ప్రస్తుతం బ్యాంకు తెలంగాణలో 5 జిల్లాలు, ఏపీలో 3 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విలీనంలో భాగంగా తెలంగాణలో శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకుతో కలిపే అవకాశముంది. దేశంలో 190 ఆర్ఆర్బీలుండగా అవి ప్రస్తుతం 45కు తగ్గాయి. స్మాల్ ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులతో భయం లేదు మేం గ్రామాల్లోకి చొచ్చుకుపోయినట్లు స్మాల్‌ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు విస్తరించలేదు. అందువల్ల మా వ్యాపారంపై వాటి ప్రభావం ఉండదు. వ్యాపార పరంగా రుణాలు, డిపాజిట్ల విషయంలో చిన్న ఫైనాన్స్ బ్యాంకులకు కొన్ని పరిమితులున్నాయి. అందుకని మాతో ఇవి ఇప్పట్లో పోటీ పడలేవు. మాతృ బ్యాంకులో విలీనం ఉండదు ఏపీజీవీబీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకూ 15 శాతం వాటా ఉంది. 50 శాతం కేంద్రానికి, 35 శాతం ఎస్బీఐకి ఉంది. గ్రామీణ బ్యాంకులను మాతృ బ్యాంకుల్లో విలీనం చేసే ఆలోచన లేదు. అలా చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో రుణ వృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతుంది. స్థానిక రూరల్ బ్యాంకులతో విలీనానంతరం ఏపీజీవీబీ పూర్తిగా ఏపీకే పరిమితమవుతుంది. ప్రస్తుతం బ్యాంకు వ్యాపార విలువ రూ.32వేల కోట్లు కాగా దీన్లో రూ.22వేల కోట్లు తెలంగాణ వాటా. మిగతాది ఏపీది. విలీనానంతరం బ్యాంకు వ్యాపారం రూ.34 వేల కోట్లకు చేరవచ్చని అంచనా. గతేడాది మేం 17 శాతం రుణ వృద్ధి సాధించాం. ఈ ఏడాది 22 శాతాన్ని లకి‡్ష్యస్తున్నాం.మాకు ఎన్పీఏ సమస్య చాలా తక్కువ. ఉన్న కాస్త ఎన్పీఏలు కూడా ఎస్‌హెచ్‌జీలు, వ్యవసాయ రుణాల్లోనే ఉన్నాయి. 2018–19లో నికరలాభం రూ. 112 కోట్లు గత ఆర్థిక సంవత్సరానికి ఏపీజీవీబీ నికరలాభం రూ.112.04 కోట్లకు చేరింది. అంతకు ముందటేడాది సాధించిన రూ.503 కోట్లతో పోలిస్తే దాదాపు 80 శాతం క్షీణించింది. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా పెన్షన్ కేటాయింపులు జరపాల్సి రావడంతో నికరలాభం క్షీణించిందని ప్రవీణ్ కుమార్ వివరించారు. 2018–19 సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 837 కోట్లు కేటాయించామన్నారు. ఇవి లేకుంటే నికరలాభం రూ.596 కోట్లుండేదని, గ్రామీణ బ్యాంకులన్నింటిలో టాప్‌లో ఉండేవారమని చెప్పారు. 2018–19 సంవత్సరానికి బ్యాంకు వ్యాపారం 14.19 శాతం పెరిగి రూ. 32714 కోట్లకు చేరగా... డిపాజిట్లు 12 శాతం పెరుగుదలతో రూ. 14333 కోట్లకు చేరాయి. మొత్తం రుణ పోర్టుఫోలియోలో సాగు రంగం వాటా 92.68 శాతం. స్థూల ఎన్పీఏలు 1.36 శాతం నుంచి 1.14 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏలు 0.20 శాతం నుంచి 0.34 శాతానికి పెరిగాయి. -
మిగులు కాదు.. లోటురాష్ట్రమే
సాక్షి, హైదరాబాద్:‘తెలంగాణ మిగులు రాష్ట్రం కాదు.. లోటు రాష్ట్రం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,386 కోట్ల రెవెన్యూ మిగులు నమోదు చేసింది. రెవెన్యూ మిగులును రూ.6,778 కోట్లు ఎక్కువ చేసి చూపించింది. అంటే రాష్ట్రం రూ.5,392 కోట్ల రెవెన్యూ లోటులో ఉంది’భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం పద్దులు నమోదు చేయటంలోనే ఈ తప్పులు చేసిందని అంశాల వారీగా కాగ్ వేలెత్తి చూపింది. ‘ఉదయ్ పద్దులో రూ.3,750 కోట్లను గ్రాంటుకు బదులు ఈక్విటీగా చూపించింది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు అప్పుగా తెచ్చుకున్న రూ.1,500 కోట్లు రాబడిలో జమ చేసింది. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, హడ్కో నుంచి అప్పుగా తెచ్చుకున్న రూ.1,000 కోట్లు ప్రభుత్వ ఖాతాలో రెవెన్యూ రాబడిగా రాసుకుంది. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి రూ.528 కోట్ల రెవెన్యూ వ్యయం రుణంగా చూపించి ఖర్చు తక్కువ కనబడేలా చేసింది’అని జమా ఖర్చుల పద్దులో ప్రభుత్వం చేసిన గిమ్మిక్కులను కాగ్ బయటపెట్టింది. 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అజాయబ్సింగ్ ఈ నివేదికలను మీడియాకు విడుదల చేశారు. ఆదాయ వ్యయాల పరిశీలనతో పాటు వివిధ రంగాల వారీగా తమ ఆడిట్లో వెల్లడైన అంశాలను పొందుపరిచినట్లు విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు స్థానిక సంస్థలు, ఆర్థిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు, సామాన్య, సామాజిక రంగాలపై విడుదల చేసిన నివేదికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల నిర్వహణను కాగ్ తూర్పారబట్టింది. రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని వేలెత్తి చూపింది. హద్దు మీరిన ద్రవ్యలోటు.. ద్రవ్యలోటు ఆందోళనకరంగా పెరిగిపోయిందని కాగ్ స్పష్టం చేసింది. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం నిర్దేశించిన 3.5 శాతం దాటిపోయిందని గుర్తించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో ద్రవ్యలోటు 5.46 శాతంగా ఉందని, ఉదయ్ పథకం కింద విద్యుత్తు సంస్థలకు బదిలీ చేసిన డబ్బును మినహాయిస్తే 4.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. అప్పుగా తెచ్చిన నిధులను రెవెన్యూ రాబడుల్లో జమ చేసి, ద్రవ్య లోటును రూ.2,500 కోట్ల మేరకు తక్కువ చేసి చూపించిందని రాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. ఉదయ్ బాండ్ల ద్వారా రూ.8,931 కోట్లు అప్పు తెచ్చుకుంటే, కేవలం రూ.7,500 కోట్లు డిస్కంలకు విడుదల చేసిందని పేర్కొంది. డిస్కంల మిగతా రుణాలకు కొత్త బాండ్లు జారీ చేయాలని ఉదయ్ పథకం నిర్దేశించినప్పటికీ.. వాటిని జారీ చేయలేదని తప్పుబట్టింది. ఖర్చెక్కువ.. అభివృద్ధి తక్కువ.. రెవెన్యూ రాబడి, ఖర్చులపై ముందస్తు ప్రణాళిక, ఖచ్చితమైన అంచనాలు లోపించాయని కాగ్ వేలెత్తి చూపింది. ‘రాష్ట్రం మొత్తం ఖర్చులో రెవెన్యూ వ్యయం 69 శాతంగా నమోదైంది. దీంతో మౌలిక వసతులు, ఆస్తుల కల్పనలో పెట్టుబడికి 31 శాతమే మిగిలి ఉంది’అని కాగ్ ప్రస్తావించింది. 2014–15, 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల కంటే రూ.6,184 కోట్లు అధికంగా ఖర్చయితే క్రమబద్ధీకరించలేదని తప్పుబట్టింది. బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ ఖర్చులకు పొంతన లేకపోవటంతో కొన్ని శాఖల్లో భారీగా మిగులు, కొన్నింటిలో కేటాయింపులకు మించి ఖర్చులు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. గ్రాంట్లకు మించి ఖర్చు చేసిన కేసులు తీవ్ర ఉల్లంఘనలేనని, ఇవి శాసనసభ అభీష్టానికి విఘాతం కలిగిస్తాయని, వెంటనే బాధ్యులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. 2016–17లో బడ్జెట్ కేటాయింపులను మించి చేసిన అధిక ఖర్చు రూ.21,161 కోట్లుగా గుర్తించింది. 16 గ్రాంట్లు, మూడు అప్రాప్రియేషన్లలో చేసిన అధిక వ్యయం రాజ్యాంగం ప్రకారం క్రమబద్ధీకరించాలని సూచించింది. కేటాయింపులే.. ఖర్చుల్లేవు.. ఎస్సీ సబ్ ప్లాన్‌కు కేటాయించిన నిధుల్లో 60 శాతం, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో 58 శాతం వినియోగించకుండా చట్టాన్ని నిర్లక్ష్యం చేసిందని కాగ్ వెల్లడించింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ఐటీడీఏ జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు, రాష్ట్రంలో ఐదు మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు ఖర్చు కాలేదని గుర్తించింది. రైతులకు వడ్డీ లేని పంట రుణాలకు నిర్దేశించిన రూ.265 కోట్లు ఖర్చు చేయలేదని వెల్లడించింది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులు పాటించకపోవటం, ఆర్థిక నియంత్రణ లోపించిందని పలు ఉదాహరణలను కాగ్ ప్రస్తావించింది. వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు సంబంధించిన వెబ్సైట్లో ఉన్న నిల్వలకు, లెడ్జర్లో ఉన్న నిల్వలకు వ్యత్యాసముంది. 28,087 వ్యక్తిగత డిపాజిట్ ఖాతాల్లో రూ.19,873 కోట్ల మొత్తం నిల్వ ఉంది. పీడీ ఖాతాల్లో భారీ మొత్తాలు ఉంచి రుణాలపై 7.40 శాతం వడ్డీ చెల్లిస్తున్న తీరు ప్రభుత్వ నగదు నిర్వహణ, ఆర్థిక నిర్వహణలు సరిగా లేవని స్పష్టంచేస్తోందని కాగ్ అభిప్రాయపడింది. పథకాల అమలుకు డ్రా చేసిన నిధులకు సంబంధించిన వినియోగ ధ్రువపత్రాలు(యూసీలు) సమర్పించలేదని, కొన్ని శాఖలు నిధులు వినియోగించకుండానే యూసీలు సమర్పించాయని గుర్తించింది. అప్పుల కుప్పలపై ఆందోళన ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో 34.74 శాతం పాత అప్పులను తీర్చేందుకే వినియోగిస్తోందని కాగ్ వెల్లడించింది. 2020–22 సంవత్సరాల మధ్య రూ.14,896 కోట్లు, 2022–24 మధ్య రూ.22,280 కోట్ల అప్పును ప్రభుత్వం తీర్చాల్సి ఉందని, ఈ అప్పును తీర్చేందుకు ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. మరిన్ని అప్పులు చేయకుండా ఉండేందుకు సముచితమైన చెల్లింపుల వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించుకోవాలని సూచించింది. 2017 మార్చి 31 నాటికి ఉన్న రాష్ట్ర అప్పులు పరిశీలిస్తే.. వచ్చే ఏడేళ్లలో 49 శాతం రుణాలు.. అంటే రూ.56,388 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉంది. 2015–16లో పన్నుల రాబడిలో 7.12 శాతం రుణాలు తిరిగి చెల్లించగా, 2016–17లో ఇది 32.16 శాతానికి పెరిగింది. 14వ ఆర్థిక సంఘం ప్రామాణిక రేటు ప్రకారం రెవెన్యూ రాబడుల్లో వడ్డీ చెల్లింపులు 8.22 శాతంగా ఉండాలి. కానీ ఇవి 10.40 శాతానికి పెరిగాయని కాగ్ గుర్తించింది. -
ఖాళీశాలలు
ఇంజనీరింగ్ సీట్ల తీరు మిగులుతో యాజమాన్యాల దిగులు మొదటి విడత జాబితాలో 46 శాతమే భర్తీ రెండో విడతపైనే ఆశలు కళాశాలల నిర్వహణపై మల్లగుల్లాలు ఫీజుల కుదింపుతో విద్యార్థుల వెనుకంజ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇంజనీరింగ్ కళాశాలలు యాజమాన్యానికి గుదిబండలవుతున్నాయి. ఫీజుల భారంతో పాటు, కోర్సు పూరై్తనా ఉపాధి అవకాశాలు దొరక్కపోవటంతో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యాభ్యాసానికి ఆసక్తి చూపడం లేదు. ఇంజనీరింగ్ స్థానంలో సాధారణ డిగ్రీ కోర్సులో చేరడానికే శ్రద్ధ చూపుతున్నారు. గతంలో విద్యార్థులతో కళకళలాడిన జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలు ఇప్పుడు చేరే వారే లేక వెలవెల బోతున్నాయి. అన్ని వసతులున్నా.. అనువైన ఫ్యాకల్టీ ఉన్నట్లు జేఎన్టీయూ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చి అప్లియేషన్ ఇచ్చినా.. కళాశాలల్లో మాత్రం ఆశించిన స్థాయిలో విద్యార్థులు చేరకపోవడంతో రూ.కోట్లు చెల్లించి కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో తొలి విడత జాబితాలో 80 శాతం సీట్లకు పైగా భర్తీ కాగా ఈసారి 46 శాతం మాత్రమే సీట్లు నిండటం గమనార్హం. సగం సీట్లు మాత్రమే భర్తీ ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు వెబ్ ఆప్షన్ ద్వారా ఎంచుకున్న కళాశాలల జాబితాను జేఎన్టీయూ అధికారులు ప్రకటించారు. ఈ జాబితాలో జిల్లాలో మొత్తం 31 ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 8,500కు పైగా సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి జాబితాలో 4,350 సీట్లే భర్తీ అయినట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా నాలుగు కళాశాలల్లోనే ఆశించిన స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. వీటిల్లో ప్రధానంగా డిమాండ్ ఉన్న కోర్సులు సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి కోర్సుల్లో కూడా పలు కళాశాలల్లో ఆశించిన స్థాయిలో భర్తీ కావడం లేదు. ఫీజు కుదింపుతో విద్యార్థుల వెనుకంజ ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంటర్ ఉత్తీర్ణులై.. ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించే సత్తా ఉన్నా ప్రభుత్వం ఈసారి ఫీజులు కుదించడంతో పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చదివేందుకు వెనుకంజ వేస్తున్నారు. పేద విద్యార్థులకు పెద్ద చదువులు భారం కావద్దనే ఆలోచనతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంసెట్‌లో అర్హత సాధించిన ప్రతీ విద్యార్థికి ఇంజనీరింగ్ చదువు పూర్తయ్యే వరకు ఫీజులు చెల్లించేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 10 వేల ర్యాంకులోపు వచ్చిన వారికే మొత్తం ఫీజు చెల్లిస్తామని, ఎక్కువ ర్యాంకు వచ్చిన వారిలో ఎస్సీ, ఎస్టీల ఫీజులు మాత్రమే ఇస్తామని ప్రకటిండంతో బీసీ, ఓసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యా భారంగా మారింది. ఏటా కళాశాల ఫీజు కేవలం రూ. 35వేలు మాత్రమే చెల్లిస్తుందని, మిగిలిన డబ్బులు విద్యార్థులే చెల్లించాలని ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రూ. 60 వేల నుండి రూ.40 వేల లోపు ఉండగా.. ప్రభుత్వం చెల్లించే ఫీజు పోగా మిగిలినవి ఎలా చెల్లించాలని, ఫీజుతోపాటు జేఎన్టీయూ, బస్సు ఫీజు, ఇతర ఫీజుల కోసం అప్పులు చేసి చదవడం కన్నా డిగ్రీలో చేరడమే మేలనే ఆలోచనలో విద్యార్థులు ఉన్నారు. -
ఖాయిలా పీఎస్‌యూలకు చికిత్స
న్యూఢిల్లీ: తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) కంపెనీలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చికిత్స మొదలుపెట్టింది. మహారత్న, నవరత్న దిగ్గజాలతో పాటు ఇతర పీఎస్‌యూల వద్ద భారీ మొత్తంలో ఉన్న మిగులు నిధులను పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నట్లు భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అనంత్ గీతే చెప్పారు. శుక్రవారమిక్కడ జరిగిన భారత వాహన తయారీదారుల సంఘం(సియామ్) వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను అధ్యయనం చేసేందుకు ఎన్టీపీసీ చైర్మన్ అరూప్ రాయ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించామని.. రెండు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించనుందని కూడా గీతే పేర్కొన్నారు. నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)లు ప్రారంభ(సీడ్) ఈక్విటీ నిధులను సమకూర్చడం ద్వారా ఒక జాయింట్ వెంచర్(జేవీ)ను ఏర్పాటు చేయడం.. తద్వారా నష్టజాతక పీఎస్‌యూల నిర్వహణ, పునరుద్ధరణకు గల అవకాశాలను కమిటీ పరిశీలించనుంది. ‘మహారత్న, నవరత్న హోదా ఉన్న సీపీఎస్ఈలకు చెందిన రూ.2 లక్షల కోట్ల మేర మిగులు నిధులు బ్యాంకుల్లో నిరుపయోగంగా ఉన్నట్లు అంచనా. ఈ కంపెనీలన్నింటికీ సమాన ఈక్విటీ వాటా ఉండేవిధంగా ఒక జేవీ ఏర్పాటు ప్రతిపాదనను మేం రూపొందించాం. దీనిద్వారా ఇప్పుడున్న 70 ఖాయిలా పీఎస్‌యూల్లో 43 కంపెనీలను పునరుద్ధరించేందుకు వీలవుతుంది’ అని గీతే వివరించారు. ఏ ఖాయిలా కంపెనీని పునరుద్ధరించాలనేది కొత్తగా నెలకొల్పే జేవీ సమీక్షించి, నిర్ణయించనుందని.. దీనికి సంబంధించి పూర్తి భాధ్యతను జేవీకే ఇవ్వాలనేది తమ ప్రతిపాదనగా ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం నిధుల కల్పన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టనున్నామని కూడా గీతే తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులపై త్వరలో నిర్ణయం... కాగా, నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్(ఎన్ఈఎంఎంపీ)ను అమలు చేసే ప్రతిపాదనపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా బ్యాటరీతో నిడిచే ఎలక్ట్రిక్ వాహనాలను(బస్సులు) ప్రజా రవాణాకోసం వినియోగించాలనేది ఈ మిషన్ ప్రధానోద్దేశమని చెప్పారు. దేశంలోనే అత్యంత కాలుష్యభరితమైన నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉందని.. జాబితా నుంచి దీన్ని తొలగించడం కోసం ఈ నగరం నుంచే ఎన్ఈఎంఎంపీని ప్రారంభించనున్నట్లు గీతే పేర్కొన్నారు. 2020కల్లా 60-70 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని మిషన్ అంచనా వేస్తోంది. -
తెలంగాణకు రెవెన్యూ మిగులు 8,000 కోట్లు
సీమాంధ్రకు 14 వేల కోట్ల లోటు ఎఫ్ఆర్బీఎం నిబంధనల సడలింపునకు ఆర్థిక శాఖ లేఖ రెవెన్యూ లోటు లేకపోతేనే కేంద్ర నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భారీ రెవెన్యూ లోటులో కూరుకుపోనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెవెన్యూ మిగులుతో ఏర్పాటవుతోంది. రాష్ట్ర విభజన సమయం సమీపిస్తున్నందున ఆర్థిక శాఖ రెండు రాష్ట్రాల ఆదాయం, అప్పులను లెక్కకట్టే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (సమైక్య రాష్ర్టం) ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండా ఆర్ధిక క్రమశిక్షణ కోసం ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టం తీసుకువచ్చారు. ఆ మేరకు అప్పుల విషయంలో ఆచితూచి వ్యవహరించడంతో పాటు రెవెన్యూ లోటు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా ద్రవ్య లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతానికి మించకుండా చూశారు. ఎఫ్ఆర్బీఎం చట్టంలోని నిబంధనలను పాటిస్తేనే, రెవెన్యూ లోటు లేకపోతేనే గ్రాంట్ల రూపంలో కేంద్ర నిధులు ప్రభుత్వాలకు వస్తాయి. ప్రస్తుత సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ మిగుల్లోనే ఉంది. ద్రవ్య లోటు మూడు శాతం లోపే ఉంది. అరుుతే ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోతున్నందున ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14 వేల కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడనుంది. ఈ రాష్ట్రంలో ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం రూ.8 వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉండనుంది. రాజధాని ఇక్కడే ఉండడం, తద్వారా ఆదాయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విభజనానంతరం కూడా ఇక్కడ మిగులే ఉండనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే తెలంగాణకు కేంద్ర గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధులు వచ్చేవిధంగా రెండు ఆర్ధిక సంవత్సరాల పాటు ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించాలని ఆర్ధిక శాఖ ఇటీవల కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతానికి రెవెన్యూ మిగులు ఉన్నప్పటికీ మిగతా అంశాల్లో ఎఫ్ఆర్బీఎం నిబంధనలు అమలు చేయడం కష్టసాధ్యమవుతుందని ఆర్థిక శాఖ భావించింది.