ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!! | Government likely to use Rs 3 lakh crore RBI windfall to pay regular bills | Sakshi
Sakshi News home page

ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!

Published Wed, Jun 26 2019 5:42 AM | Last Updated on Wed, Jun 26 2019 5:42 AM

Government likely to use Rs 3 lakh crore RBI windfall to pay regular bills - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ– నొముర అంచనా వేసింది. నొముర దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్‌బీఐ నుంచి నిధుల బదలాయింపు ఒకేసారి జరక్కపోవచ్చని, వరుసగా మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అందివచ్చే నిధుల్లో 45 శాతం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని, 20 శాతాన్ని బ్యాంకుల మూలధన పెట్టుబడులకు వినియోగించుకునే వీలుందని నొముర పేర్కొంది. ప్రభుత్వ రుణభారం 25 శాతానికి తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చిన మొత్తంపై ఆధారపడి మిగిలిన 10 శాతం వ్యయాలు ఉంటాయని పేర్కొంది.  

బ్యాంకులకిస్తే బెటర్‌: బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా
ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరతతో ఇబ్బందులు పడుతున్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా–మెరిలించ్‌ ఇప్పటికే అభిప్రాయపడింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై సిఫారసులకు గత ఏడాది డిసెంబర్‌లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతున్న విభేదాల కారణంగా నివేదిక ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. జూలైలో నివేదిక సమర్పించవచ్చని సమాచారం. ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మూడు లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించవచ్చని ఈ కమిటీ సిఫారసు చేయవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా–మెరిలించ్‌ తాజా నివేదిక అంచనా వేసింది.  

ఆర్‌బీఐ నిధులపై ఆధారపడక తప్పదా?
కేంద్రం ద్రవ్యలోటును ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్‌ 10న వ్యక్తిగత కారణాలతో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా ప్రకటించారు.  శక్తికాంత్‌ దాస్‌ గవర్నర్‌ అయ్యాక డిసెంబర్‌లో జలాన్‌ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ కమిటీ కూడా ఏర్పాటయ్యింది.  

ఇప్పటికే మూడు కమిటీలు...
గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై 3 కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్‌ (2004), వైహెచ్‌ మాలేగామ్‌ (2013) వీటికి నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12% వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే,  థోరట్‌ కమిటీ  18%గా పేర్కొంది. ఆర్‌బీఐ థోరట్‌ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారులకు ఓకే చెప్పింది.  లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్‌ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28% నిష్పత్తిలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి.  అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14% నిధులు సరిపోతాయని ఆర్థిక  శాఖ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement