సాక్షి, అమరావతి: ఒకసారి శ్రీలంకతో పోలుస్తూ.. మరోసారి రూ.పది లక్షల కోట్లంటూ రాష్ట్ర అప్పులపై తమకు నచ్చినట్లు పుంఖాను పుంఖాలుగా ఓ వర్గం మీడియా ప్రచురిస్తున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదని ఆర్బీఐ నివేదిక సాక్షిగా తేటతెల్లమైంది. 2021–22 ఆర్థిక ఏడాది మార్చి నాటికి వివిధ రాష్ట్రాల అప్పులపై ఆర్బీఐ తాజాగా నివేదిక విడుదల చేసింది.
ఇన్‌స్టిట్యూషన్లతో పాటు స్టేట్ డెవలప్‌మెంట్ రుణాలు (మార్కెట్ బారోయింగ్), విద్యుత్ బాండ్లు, నాబార్డు, ఇతర బాండ్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కేంద్రం నుంచి రుణాలు, అడ్వాన్స్‌లు, నేషనల్ సెక్యూరిటీ ఫండ్, నేషనల్ కో–ఆపరేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డిపాజిట్స్ అండ్ అడ్వాన్స్ ద్వారా తీసుకున్న మొత్తం రుణాలను రాష్ట్రాల వారీగా ఆర్బీఐ వెల్లడించింది.
అన్ని రకాల రుణాలు కలిపి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 2022 మార్చి నాటికి రూ.3,98,903 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. 2019 మార్చి నెలాఖరు నాటికి అంటే చంద్రబాబు పాలన చివరి దశలో రాష్ట్రం అప్పులు రూ.2,64,451 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది.
2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు సర్కారు ఏప్రిల్ 4వతేదీన ఒకేసారి రూ.4,000 కోట్లు, మే 2వ తేదీన రూ.500 కోట్లు, మే 7వతేదీన 500 కోట్లు, మే 14వ తేదీన రూ.1,000 కోట్లు అప్పులు చేసింది. దీంతో మరో రూ.ఆరు వేల కోట్ల మేర చంద్రబాబు సర్కారు అప్పు చేసినట్లైంది. దీంతో చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు రూ.2,70,451 కోట్లకు చేరుకున్నాయి.
ఇంతకంటే ప్రామాణికం ఇంకేముంది?
అప్పులపై ఆర్బీఐ నివేదిక కంటే ప్రామాణికం ఏదీ ఉండదని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చాలనే దురుద్దేశంతోనే రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ ఓ వర్గం మీడియా బురద చల్లుతోందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అప్పులు ఎన్ని ఉన్నాయో ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా చెప్పినందున ఇకనైనా తప్పుడు ప్రచారాన్ని ఆపాలని ఆర్థిక శాఖ వర్గాలు సూచిస్తున్నాయి.
ఆ రెండు పత్రికలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తున్నాయని పేర్కొంటున్నాయి. నిపుణుల పేరుతో ఓ వర్గం మీడియా వక్రీకరణలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పుల వివరాలను ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ పత్రంలో స్పష్టంగా పేర్కొన్నప్పటి ఆ పత్రికలు పట్టించుకోకుండా కథనాలు అల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఏడు రాష్ట్రాల తరువాతే ఏపీ..
దేశంలో ఏడు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే అధికంగా అప్పులు చేశాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రానికి అప్పులున్నాయని తెలిపింది, అత్యధిక అప్పుల్లో రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో మహారాష్ట్ర, నాలుగో స్థానంలో పశ్చిమబెంగాల్, ఐదో స్థానంలో రాజస్థాన్, ఆరో స్థానంలో కర్నాటక, ఏడో స్థానంలో గుజరాత్ రాష్ట్రాలున్నాయి. ఆ తరువాత.. అంటే 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment