ఇప్పటికే బడ్జెట్, బడ్జెటేతర అప్పులు రూ.1.19 లక్షల కోట్లు
వచ్చే మూడు నెలల్లో మార్కెట్ రుణాలు రూ.11 వేల కోట్లు
వెరసి ఒక్క ఆర్థిక ఏడాదిలోనే రూ.1.30 లక్షల కోట్ల అప్పు
జనవరి–మార్చి మార్కెట్ రుణాల క్యాలెండర్ ప్రకటించిన ఆర్‌బీఐ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని రాకెట్ వేగంతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. బడ్జెట్ లోపల, బడ్జెట్‌బయట ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నారు. ఈ ఒక్క ఆర్ధిక ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటికే మార్కెట్ రుణాల కింద చేసిన అప్పులు బడ్జెట్‌లో పేర్కొన్న దానికంటే మించి పోయాయి. బడ్జెట్‌లో రూ.71 వేల కోట్లు మార్కెట్ రుణాల ద్వారా అప్పు చేస్తామని పేర్కొంటే.. మంగళవారం చేసిన రూ.5,000 కోట్లతో మార్కెట్ రుణాల అప్పు రూ.74,827 కోట్లకు చేరింది.
ఈ ఆర్థిక ఏడాదిలోనే తాజాగా జనవరి నుంచి మార్చి వరకు మార్కెట్ రుణాల ద్వారా మరో రూ.11 వేల కోట్ల అప్పు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే బడ్జెట్ లోపల ఒక్క మార్కెట్ రుణాల ద్వారానే అప్పులు రూ.85,827 కోట్లకు చేరనున్నాయి. వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారెంటీలతో ఏకంగా రూ.14 వేల కోట్లు అప్పు చేస్తుండగా.. మరో పక్క రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యూ సంస్థ ద్వారా ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పులు చేస్తోంది.
ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అంటే ఈ ఒక్క ఆర్థిక ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు అప్పులు ఏకంగా రూ.1,30,827 కోట్లకు చేరుతున్నాయి. కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్ధిక ఏడాదిలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పులు చేయలేదు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసినప్పటికీ సూపర్ సిక్స్ హామీలను సైతం అమలు చేయడం లేదు. ఇలాంటి చంద్రబాబు సర్కారు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తుండటం గమనార్హం.
మూడు నెలల మార్కెట్ రుణాలకు ఆర్‌బీఐ క్యాలెండర్
చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మూడు నెలల్లో మరో రూ.11 వేల కోట్ల మార్కెట్ రుణాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్ రుణాల ద్వారా డిసెంబర్ 31 నాటికి రూ.74,827 కోట్లు అప్పు చేసింది. ఈ ఆర్ధిక ఏడాదిలో జనవరి నుంచి మార్చి వరకు మార్కెట్ రుణాలు ఏ రాష్ట్రం ఎంత తీసుకుంటుందనే అంశంపై ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది.
ఈ సంప్రదింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర మార్కెట్ రుణాల ద్వారా అప్పు చేయనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐకి చంద్రబాబు సర్కారుతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి నుంచి మార్చి వరకు ఈ తేదీల్లో ఎంత మేర మార్కెట్ రుణాల ద్వారా అప్పు చేస్తారో సూచిస్తూ క్యాలెండర్ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment