Bimal Jalan
-
ఆర్బీఐ బొనాంజా!
ముంబై: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–2020) రూ.1,76,051 కోట్ల నిధుల బదలాయింపు జరగనుంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోకి కమిటీ సిఫారసులకు సోమవారం సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో తాజా నిధుల బదలాయింపు జరుగుతోంది. సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న అదనపు నిల్వల్లో ఎంతమొత్తం కేంద్రానికి బదలాయించాలన్న అంశంపై సిఫారసులు చేయడానికి జలాన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ప్రకటన సారాంశమిది... ‘‘కేంద్రానికి రూ.1,76,051 కోట్ల బదలాయింపు జరగాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో రూ.1,23,414 కోట్లు 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగులు (డివిడెండ్). మిగిలిన రూ.52,637 కోట్లు సవరిత ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఈసీఎఫ్) ప్రకారం గుర్తించిన అదనపు ప్రొవిజన్లకు సంబంధించినది (అర్బీఐ అదనపు నిల్వలకు సంబంధించినది)’’ అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ద్రవ్యలోటుకు మందు! ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టడి విషయంలో జలాన్ కమిటీ సిఫారసులు కేంద్రానికి ఎంతో సానుకూల అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. 2019–2020 మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు 3.4 శాతం (రూ.7.03 లక్షల కోట్లు) ఉండాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి (ఏప్రిల్,మే,జూన్) రూ.4.32 లక్షల కోట్లకు చేరింది. అంటే తాజా గణాంకాలు చూస్తే, ద్రవ్యలోటు నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యంలో జూన్ నాటికే 61.4 శాతానికి చేరిందన్నమాట. ద్రవ్య లోటును కేంద్రం ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు గతంలో చర్చనీయాంశం అయ్యాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న ఆర్బీఐ బోర్డ్ నిర్ణయించింది. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్లో మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ ఆరుగురు కమిటీ కూడా ఏర్పాటయ్యింది. నిజానికి ఈ కమిటీ జూన్‌నెల చివరికల్లా నివేదిక సమర్పిస్తుందని భావించినా, కొన్ని భేదాభిప్రాయాల వల్ల నివేదిక సమర్పణ వాయిదా పడుతూ వచ్చింది. జలాన్ కమిటీ నాల్గవది... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. -
ఆ 3 లక్షల కోట్లూ కేంద్రం ఖర్చులకే!!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి కేంద్రానికి బదలాయింపులు జరుగుతాయని భావిస్తున్న రూ.3 లక్షల కోట్ల వినియోగంపై అంచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిమాణంలో అధిక భాగం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ– నొముర అంచనా వేసింది. నొముర దీనిపై ఒక నివేదిక విడుదల చేస్తూ, ఆర్బీఐ నుంచి నిధుల బదలాయింపు ఒకేసారి జరక్కపోవచ్చని, వరుసగా మూడేళ్లపాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. అందివచ్చే నిధుల్లో 45 శాతం కేంద్రం సాధారణ వ్యయాలకు వినియోగించుకుంటుందని, 20 శాతాన్ని బ్యాంకుల మూలధన పెట్టుబడులకు వినియోగించుకునే వీలుందని నొముర పేర్కొంది. ప్రభుత్వ రుణభారం 25 శాతానికి తగ్గించుకునే అవకాశం ఉందని విశ్లేషించింది. వచ్చిన మొత్తంపై ఆధారపడి మిగిలిన 10 శాతం వ్యయాలు ఉంటాయని పేర్కొంది. బ్యాంకులకిస్తే బెటర్: బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరతతో ఇబ్బందులు పడుతున్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ ఇప్పటికే అభిప్రాయపడింది. ఆర్బీఐ వద్ద ఉన్న అదనపు నిధులను ప్రభుత్వానికి బదలాయించే అంశంపై సిఫారసులకు గత ఏడాది డిసెంబర్లో ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తన నివేదికను జూన్‌లో ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతున్న విభేదాల కారణంగా నివేదిక ఆలస్యం అవుతోందని వార్తలు వస్తున్నాయి. జూలైలో నివేదిక సమర్పించవచ్చని సమాచారం. ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మూడు లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించవచ్చని ఈ కమిటీ సిఫారసు చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిలించ్ తాజా నివేదిక అంచనా వేసింది. ఆర్బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? కేంద్రం ద్రవ్యలోటును ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10న వ్యక్తిగత కారణాలతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ప్రకటించారు. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్లో జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఇప్పటికే మూడు కమిటీలు... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై 3 కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) వీటికి నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12% వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, థోరట్ కమిటీ 18%గా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారులకు ఓకే చెప్పింది. లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28% నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14% నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ భావిస్తోంది. -
ఆర్బీఐ మిగులు నిధి ఏంచేద్దాం?
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిధుల నిర్వహణపై మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ (ఎకనమిక్ కమిటీ ఫ్రేమ్‌వర్క్) మంగళవారం మొట్టమొదటిసారి సమావేశమయ్యింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఏ స్థాయిలో ఉండాలి? అంతకన్నా ఎక్కువగా ఉండే నిధులను ఎలా బదలాయించాలి? ఏ పరిమాణంలో కేంద్రానికి డివిడెండ్ చెల్లించాలి? వంటి అంశాలను నిర్ణయించడానికి గత నెల చివర్లో ఈ కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. కమిటీ సమావేశమయిన 90 రోజుల్లో నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ ఈ కమిటీకి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్‌తో పాటు భరత్ దోషి, సుధీర్ మన్కడ్ ఈ కమిటీలో సభ్యులు. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. నేపథ్యం ఇదీ... పన్ను వసూళ్లు తగ్గిన నేపథ్యంలో–భారత్ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కట్టుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమై మార్చి 2019తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలకు వచ్చేసరికే ద్రవ్యలోటు బడ్జెట్ నిర్దేశాలను(3.3%) దాటిపోయింది. ప్రస్తు ఆర్థిక సంవత్సరం మొత్తంలో ద్రవ్య లోటు కొరత రూ. లక్ష కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మిగులు నిల్వల్లో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందని వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ వార్తల నేపథ్యంలో–డిసెంబర్ 10న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న జరిగిన ఆర్బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. దీనికనుగుణంగా బిమల్ జలాన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటయ్యింది. గతంలో కమిటీలు ఇలా... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉషా థోరట్ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. కేంద్రం కోరుకుంటోంది ఎంత? ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు సమాచారం. టోకెనైజేషన్‌పై ఆర్బీఐ మార్గదర్శకాలు ముంబై: సురక్షితమైన కార్డు లావాదేవీల నిర్వహణ కోసం ఉద్దేశించిన టోకెనైజేషన్‌కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మంగళవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఆథరైజ్డ్ కార్డ్ నెట్వర్క్ మాత్రమే టోకెనైజేషన్, డీ–టోకెనైజేషన్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఈ సేవల కోసం కస్టమరు ప్రత్యేకంగా చార్జీలు చెల్లించనక్కర్లేదు. ప్రస్తుతం మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్‌కి మాత్రమే ఈ సదుపాయం పరిమితమవుతుందని, ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మిగతా డివైజ్‌లకు వర్తింపచేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక లావాదేవీల్లో అసలైన డెబిట్, క్రెడిట్ కార్డుల స్థానంలో ప్రత్యేక కోడ్ (టోకెన్) ఉపయోగించే విధానాన్ని టోకెనైజేషన్‌గా వ్యవహరిస్తారు. పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మి నల్స్ (పీవోఎస్), క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ తరహా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకు ఇది ఉపయోగపడుతుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ), మ్యాగ్నెటిక్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ (ఎంఎస్టీ) ఆధారిత కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు, ఇన్–యాప్ పేమెంట్స్, క్యూఆర్ కోడ్ మొదలైన మాధ్యమాల్లో టోకెనైజ్డ్ కార్డు లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్బీఐ పేర్కొంది. -
ఆర్బీఐ నగదు నిల్వల నిర్వహణ ఎలా?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న నగదు నిల్వల నిర్వహణపై (ఎకనమిక్ కమిటీ ఫ్రేమ్‌వర్క్) ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటయ్యింది. బుధవారం ఆర్బీఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వం వహిస్తారు. ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి రాకేష్ మోహన్ వైస్ చైర్మన్‌గా ఉంటారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆర్బీఐ వద్ద నగదు నిల్వలు ఎంత స్థాయిలో ఉండాలన్న అంశంపై ఈ కమిటీ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ కమిటీలోని సభ్యుల్లో ఉన్నారు. వీరితోపాటు భరత్ దోషి, సుధీర్ మన్కడ్ కూడా కమిటీలో సభ్యులు. వీరు ప్రస్తుతం ఆర్బీఐ సెంట్రల్ బోర్ట్‌లో సభ్యులు. సమావేశమయిన నాటి నుంచీ 90 రోజుల్లో నిపుణుల కమిటీ నివేదికను సమర్పిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలించి సెంట్రల్ బ్యాంక్ వద్ద నిధులు ఏ మేరకు ఉండాలి? మిగిలిన నిధుల బదలాయింపు ఎలా వంటి అంశాలపై కమిటీ నివేదికను రూపొందిస్తుంది. నేపథ్యం ఇదీ... ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవేల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఈ నిధుల్లో భారీ మొత్తాన్ని ప్రభుత్వం కోరుతోందన్న వార్తలు దేశంలో సంచలనానికి దారితీశాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న జరిగిన ఆర్బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. గతంలో కమిటీలు ఇలా... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. తయారీ రంగం విక్రయాలు పటిష్టం: ఆర్బీఐ ఇదిలావుండగా, రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) తయారీ రంగం అమ్మకాలపై ఆర్బీఐ బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో తయారీ రంగం విక్రయాలు బాగున్నాయని ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా జౌళి, ఇనుము, స్టీల్ రంగాలు, కెమికల్, పెట్రోలియం ప్రొడక్టులు, మోటార్ వాహనాలు, రవాణా పరికరాలు, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు మంచి అమ్మకాలను నమోదుచేసినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. 2,700 లిస్టెడ్ ప్రైవేట్ రంగ నాన్–ఫైనాన్షియల్ కంపెనీల డేటా విశ్లేషణతో ఈ గణాంకాలు విడుదలయ్యాయి. తయారీ రంగం నికర లాభం 29.4 శాతం వృద్ధితో (గత ఏడాది ఇదే కాలంతో పోల్చి) రూ.47,100 కోట్లుగా నమోదయినట్లు తెలిపింది. కాగా టెలికమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయేతర సేవలు నిరుత్సాహం కలిగించినట్లు గణాంకాలు వివరించాయి. కాగా వ్యయాల విషయంలో (ముడి పదార్థాల కొనుగోలు, సిబ్బంది జీత భత్యాలు) తయారీ రంగం కంపెనీలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయని నివేదిక తెలిపింది. -
రూపాయి పతనం, మొండిబకాయిలతో ఇబ్బందే
న్యూఢిల్లీ: అంతకంతకూ పడిపోతున్న రూపాయి విలువ, బ్యాంకుల్లో మొండిబకాయిలు పేరుకుపోతుండటం ఆందోళన కలిగించే అంశాలేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు పనితీరుపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. పాలనపరమైన లోపాలు, పలు రాష్ట్రాల్లో ప్రజా ఆందోళనలు, లౌకికవాదాన్ని దెబ్బతీసేవిధంగా చేస్తున్న ప్రకటనలతో దేశం సతమతమవుతోందని జలాన్ వ్యాఖ్యానించారు. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు కీలక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చుతాయన్నారు. ప్రధానంగా వస్తు–సేవల పన్ను(జీఎస్టీ), దివాలా చట్టం, ప్రభుత్వ పథకాలకు నగదు బదిలీ వంటివి ఇందులో ప్రధానమైనవని చెప్పారు. ‘వర్ధ మాన దేశాలన్నింటికెల్లా మన ఆర్థిక వృద్ధి రేటు అత్యధిక స్థాయిలో ఉండటం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కచ్చితంగా సానుకూల అంశాలే. అయితే, వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఆహా రోత్పత్తుల ధరలు పెరిగి గ్రామీణ, చిన్న పట్టణాల్లో పేద ప్రజలపై తీవ్ర ప్రభావానికి దారితీస్తుంది. ఇక రూపాయి పతనం వల్ల పెద్ద ముప్పేమీ లేనప్పటికీ.. గత కొద్ది నెలల్లో కరెన్సీ విలువ తీవ్రం గా పడిపోవడం అనేది ఆందోళనరమైన అంశమే. మొండిబకాయిల సమస్యకు ఆర్బీఐ చర్యలు, దివాలా చట్టంతో తగిన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. ఎయిరిండియా ప్రైవేటీకరణకు మరికొంత సమయం పట్టొచ్చు’ అని జలాన్ పేర్కొన్నారు. -
ప్రధాని మోదీకి చల్లటి కబురు
సాక్షి, న్యూఢిల్లీ : గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌పై మోదీ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ చల్లటి కబురు చెప్పారు. దేశానికి వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అవసరమని ఆయన తెలిపారు. అయితే.. పేద, ధనిక రాష్ట్రాల మధ్య తేడాలను గుర్తించి జీఎస్టీని వికేంద్రీకరణ చేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్నును అమలు చేయడం అత్యంత ముఖ్యమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. నూతన పరోక్ష పన్నుల విధానమైన జీఎస్టీని సక్రమంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుత విధానంలో ఆర్థికంగా పరిపుష్టమైన మహరాష్ట్రకు, పేద రాష్ట్రమైన బిహార్‌కు ఒకే విధమైన జీఎస్టీ విధానం మంచిది కాదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీని వికేంద్రీరించి అమలు చేస్తే మంచిదని ఆయన కేంద్రానికి సూచించారు. -
ఆర్బీఐ స్వేచ్ఛను కాపాడాలి!
మాజీ గవర్నర్ బిమల్ జలాన్ న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్వయం ప్రతిపత్తిని నిలబెట్టాల్సిన అవసరం ఉందని మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆకాంక్షించారు. 1997 నుంచి 2003 మధ్య జలాన్ ఆర్బీఐ గవర్నర్‌గా వ్యవహరించారు. ‘ప్రతిష్ట మసకబారే సమస్య’ను ఆర్బీఐ ఎదుర్కొంటోందని మరో మాజీ గవర్నర్ వైవీ రెడ్డి చేసిన కామెంట్ నేపథ్యంలోనే జలాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘ఆర్బీఐ స్వతంత్రత ప్రాథమిక అంశం. దీనిని అలాగే కొనసాగించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఈ అంశంపైనా దృష్టి సారిస్తుందని భావిస్తున్నాం. ఇక రూ.500, రూ.1000 నోట్ల రద్దు వృద్ధిపై ఎంతశాతం ప్రభావం చూపుతుందన్నది చెప్పడం చాలా కష్టం. అయితే వృద్ధి తగ్గుతుందని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. పరిస్థితిని ఊహించి చెప్పడం కన్నా... వేచి చూడడమే బెటర్’ తాజా ఇంటర్వ్యూలో జలాన్ వ్యాఖ్యానించారు. -
కొత్తా బ్యాంకులండీ..!
న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ద్వారాలు తెరిచింది. దేశంలో దశాబ్దకాలం తర్వాత మళ్లీ తొలిసారిగా బ్యాంకింగ్ లెసైన్స్‌లకు రెండు కంపెనీలను ఎంపికచేసింది. ప్రభుత్వ సంస్థలు ప్రమోట్‌చేసిన ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీ.. ఐడీఎఫ్సీ, కోల్‌కతాకు చెందిన మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌లకు లెసైన్స్‌లు ఇచ్చేందుకు ఆర్బీఐ బుధవారం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. లెసైన్స్‌ల జారీకి సంబంధించి ఆర్బీఐ ముందుకెళ్లొచ్చంటూ ఎన్నికల సంఘం(ఈసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మర్నాడే ఈ రెండు కంపెనీల పేర్లను ప్రకటించడం గమనార్హం. ఆర్బీఐ లెసైన్స్ అనుమతి గడువు 18 నెలలు ఉంటుంది. ఈలోగా ఎంపికైన రెండు సంస్థలు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కొత్తబ్యాంకుల ఏర్పాటుకు తగిన కసరత్తు అంతా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించాక పూర్తిస్థాయి(రెగ్యులర్) లెసైన్స్‌లను ఆర్బీఐ జారీచేస్తుంది. ఆతర్వాతే బ్యాంకింగ్ సేవలను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. కాగా, ఇప్పుడు లెసైన్స్‌లు రాని ఇతర దరఖాస్తుదారులు భవిష్యత్తులో విడుదల చేసే కొత్త మార్గదర్శకాల తర్వాత మళ్లీ లెసైన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. మొత్తంమీద ఆర్బీఐ లెసైన్స్‌లు దక్కిన రెండు సంస్థలూ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లే కావడం విశేషం. ఇండియా పోస్ట్‌కూ అవకాశం... లెసైన్స్‌ల దరఖాస్తులను మదింపు చేసిన బిమల్ జలాన్ నేతృత్వంలోని అత్యున్నతస్థాయి కమిటీ.. ప్రభుత్వరంగంలోని ఇండియా పోస్ట్‌కు కూడా లెసైన్స్‌కు సిఫార్సు చేసింది. అయితే, ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారా ప్రత్యేకంగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. దీనికి ఆర్బీఐ కూడా ఓకే చెప్పింది. అంటే ఇండియా పోస్ట్‌కు కూడా రానున్నరోజుల్లో లెసైన్స్ లభించే అవకాశాలు ఉన్నట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. గతేడాది జూలైలో ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా.. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన మొత్తం 27 కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే, ఆతర్వాత టాటా, వీడియోకాన్ గ్రూప్‌లు రేసు నుంచి వైదొలగడంతో 25 కంపెనీల దరఖాస్తులు మాత్రమే ఆర్బీఐ తుది పరిశీలనలో నిలిచాయి. వీటిలో అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్యబిర్లా గ్రూప్, బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ క్యాపిటల్, ఎల్అండ్టీ ఫైనాన్స్ తదితర దిగ్గజాలు పోటీపడ్డాయి. దాదాపు 4-5 వరకూ కొత్త లెసైన్స్‌లు ఇవ్వొచ్చని ఎక్కువమంది పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, కేవలం రెండు లెసైన్స్‌లకే(ఇండియా పోస్ట్‌తో కలిపితే మూడు) ఆర్బీఐ అనుమతించడం విశేషం. ఆర్బీఐ తాజా నిర్ణయం దీర్ఘకాలంతర్వాత వెలువడిందని... దేశంలో మరిన్ని బ్యాంక్ శాఖల ఏర్పాటుకు దోహదం చేస్తుందని ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ సేవల విభాగం కార్యదర్శి జీఎస్ సంధు వ్యాఖ్యానించారు. కొత్త బ్యాంకుల ఏర్పాటువల్ల అందరికీ బ్యాంకింగ్ సేవల(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) విస్తరణకు బాటలు వేస్తుందని ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామమని, ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగానికి మేలు చేకూర్చే నిర్ణయంగా దీన్ని ఆయన అభివర్ణించారు. సరిగ్గా పదేళ్లకు.... చిట్టచివరిసారిగా 2003-04లో ఆర్బీఐ యస్‌బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లకు లెసైన్స్‌లు మంజూరు చేసింది. ఆతర్వాత మళ్లీ పదేళ్లకు మరో రెండు లెసైన్స్‌లు జారీ చేయడం గమనార్హం. ప్రస్తుత లెసైన్స్‌ల ప్రక్రియ 2010-11లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సారథ్యంలో మొదలైంది. మూడేళ్లతర్వాత ఇది సాకారమైంది. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ, 22 ప్రైవేటు రంగ బ్యాంకులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటితోపాటు 56 రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్బీ)లు, 41 విదేశీ బ్యాంకులు దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. మాకు బ్యాంకింగ్ లెసైన్స్ లభించడాన్ని మైక్రోఫైనాన్స్ రంగానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నాం. ఫైనాన్షియల్ సేవల కల్పనలో మారుమూల ప్రాంతాలకూ వెళ్లేలా మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి పేదవాళ్లకు పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందించేందుకు మాకు అవకాశం లభిస్తుంది. మాకు ఇప్పటికే రూ.1,100 కోట్ల పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంది(ఆర్బీఐ నిబంధన ప్రకారం రూ.500 కోట్లు ఉండాలి). మేం ఎక్కువగా బ్యాంకింగ్ సేవలు లేని గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టిపెట్టాం. ఇప్పుడు మేం నేరుగా బ్యాంకింగ్‌లోకి వస్తుండటం వల్ల మాకు పెద్దగా పోటీ కూడా ఉండదు. - చంద్రశేఖర్ ఘోష్, బంధన్ చైర్మన్ లెసైన్స్ ఎట్టకేలకు లభించడంతో ఇక మేం పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవల కల్పన కోసం మరింత కష్టపడేందుకు సమాయత్తమవుతున్నాం. మేం యూనివర్సల్ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. దీనికి అనుగుణంగానే యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుపై మేం దృష్టిపెడతాం. ఇప్పటికే 21 శాతం టైర్-1 మూలధనం మాకుంది. దీనిప్రకారం చూస్తే దేశంలో అత్యుత్తమ మూలధనంతో ఏర్పాటవుతున్న తొలి బ్యాంక్ మాదే అవుతుంది. నేటి(ఏప్రిల్ 3) నుంచే మా వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నాం. ఇప్పటికే మేం బ్యాంకింగ్ సేవల కోసం సవివర ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. - రాజీవ్ లాల్, ఐడీఎఫ్సీ చైర్మన్ -
కొత్త బ్యాంక్ లెసైన్స్‌లకు లైన్ క్లియర్!
ఆర్బీఐకి జలాన్ కమిటీ నివేదిక న్యూఢిల్లీ: కొత్త బ్యాంకింగ్ లెసైన్సుల జారీ అంశంపై ఏర్పాటైన బిమల్ జలాన్ కమిటీ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి నివేదిక సమర్పించింది. బ్యాంకు లెసైన్సులు పొందేందుకు అర్హత కలిగిన సంస్థల పేర్లను కూడా ఈ నివేదికతో పాటు అందించింది. ఆర్బీఐ వర్గాలతో సుమారు నాలుగు గంటల సేపు జరిగిన భేటీ అనంతరం ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఈ విషయం తెలిపారు. కొత్త బ్యాంకులకు లెసైన్సులు ఇవ్వడానికి సంబంధించి 2013 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. 27 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో టాటా సన్స్, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, బజాజ్ ఫైనాన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. అయితే, ఆ తర్వాత టాటా సన్స్ వంటి కొన్ని కంపెనీలు ఉపసంహరించుకున్నాయి. ఈ బ్యాంకు లెసైన్సుల దరఖాస్తులను పరిశీలించేందుకు ఆర్బీఐ జలాన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్, సెబీ మాజీ చైర్మన్ సీబీ భవే తదితరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. మార్చి ఆఖరుకల్లా కొత్త బ్యాంకులకు లెసైన్సులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆశావహుల జాబితాలో ఉన్న ఐడీఎఫ్సీ షేరు మంగళవారం ఎన్ఎస్ఈలో 1.75%, ఎల్ఐసీ హౌసింగ్ షేరు 3% మేర లాభపడ్డాయి. గడిచిన 20 ఏళ్లలో 2 విడతలుగా ప్రైవేట్ రంగంలో 12 బ్యాం కులకు ఆర్బీఐ లెసైన్సులు ఇచ్చింది. చివరిసారిగా 2003-04లో కోటక్ మహీంద్రా బ్యాంకు, యస్ బ్యాంకులకు లెసైన్సులు లభించాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 27, ప్రైవేట్ రం గంలో 22 బ్యాంకులు ఉండగా.. 56 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. -
కొత్త బ్యాంకుల లెసైన్సుల దిశగా మరో అడుగు...
రాయ్‌పూర్: కొత్త బ్యాంకు లెసైన్సులను జారీ చేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. లెసైన్సుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు రిజర్వ్ బ్యాంక్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ సారథ్యం వహిస్తుండగా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్, సెబీ మాజీ చైర్మన్ సీబీ భవే, ఆర్థికవేత్త నచికేత్ మోర్ సభ్యులుగా ఉంటారు. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ విషయాలు తెలిపారు. కొత్త బ్యాంకుల అంశాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా జనవరిలో రిటైరయ్యే లోగా లెసైన్సులను జారీ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్సుల కోసం మొత్తం 26 దరఖాస్తులు వచ్చాయి. టాటా సన్స్, అనిల్ అంబానీ గ్రూప్, కుమార మంగళం బిర్లా గ్రూప్ మొదలైన దిగ్గజ సంస్థలు బరిలో ఉన్నాయి. గడచిన 20 సంవత్సరాల్లో రెండు విడతలుగా ఆర్బీఐ ప్రైవేట్ రంగంలో 12 బ్యాంకులకు లెసైన్సులు ఇచ్చింది. 1993 జనవరిలో మార్గదర్శకాల ప్రకారం అప్పట్లో పది బ్యాంకులకు లెసైన్సులు ఇచ్చింది. ఈ అనుభవాలతో 2001 జనవరిలో మార్గదర్శకాలను సవరించి.. 2003-04లో కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంకులకు ఆర్బీఐ లెసైన్సులు జారీ చేసింది. -
కొత్త బ్యాంక్ లెసైన్సులపై దృష్టి సారించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: కొత్త బ్యాంకు లెసైన్సు దరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ చురుగ్గా పరిశీలిస్తోంది. ఇది పూర్తయిన తర్వాత మిగతా ప్రక్రియపై ఎక్స్టర్నల్ కమిటీ దృష్టి సారించనుంది. ఏఐఎంఏ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రతిపాదిత అత్యున్నత స్థాయి సలహాదారు కమిటీ (హెచ్‌ఎల్‌ఏసీ) చైర్మన్ బిమల్ జలాన్ ఈ విషయాలు తెలిపారు. కొత్త బ్యాంకు లెసైన్సుల కోసం దాదాపు 26 దరఖాస్తులు వచ్చాయని వీటిని ఆర్బీఐ తొలిదశ సూట్నీ ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు. దీనిపై ఏరకంగా ముందకు వెళ్లాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అనిల్ అంబానీ, కుమార మంగళం బిర్లా, టాటా వంటి పారిశ్రామిక దిగ్గజాల కంపెనీలు కూడా వీటి కోసం దరఖాస్తు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గడిచిన 20 ఏళ్లలో ఆర్బీఐ రెండు విడతలుగా ప్రైవేట్ రంగంలో 12 బ్యాంకులకు లెసైన్సులు ఇచ్చింది. తాజాగా కొత్త లెసైన్సులు ఇచ్చే ప్రక్రియను మరోసారి ప్రారంభించిన నేపథ్యంలో బిమల్ జలాన్ సారథ్యంలోని కమిటీ దీన్ని పర్యవేక్షిస్తుందని ఆర్ బీఐ కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రకటించారు.