
న్యూఢిల్లీ: అంతకంతకూ పడిపోతున్న రూపాయి విలువ, బ్యాంకుల్లో మొండిబకాయిలు పేరుకుపోతుండటం ఆందోళన కలిగించే అంశాలేనని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు పనితీరుపై మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు.
పాలనపరమైన లోపాలు, పలు రాష్ట్రాల్లో ప్రజా ఆందోళనలు, లౌకికవాదాన్ని దెబ్బతీసేవిధంగా చేస్తున్న ప్రకటనలతో దేశం సతమతమవుతోందని జలాన్ వ్యాఖ్యానించారు. అయితే, మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు కీలక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చుతాయన్నారు. ప్రధానంగా వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ), దివాలా చట్టం, ప్రభుత్వ పథకాలకు నగదు బదిలీ వంటివి ఇందులో ప్రధానమైనవని చెప్పారు.
‘వర్ధ మాన దేశాలన్నింటికెల్లా మన ఆర్థిక వృద్ధి రేటు అత్యధిక స్థాయిలో ఉండటం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కచ్చితంగా సానుకూల అంశాలే. అయితే, వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఆహా రోత్పత్తుల ధరలు పెరిగి గ్రామీణ, చిన్న పట్టణాల్లో పేద ప్రజలపై తీవ్ర ప్రభావానికి దారితీస్తుంది.
ఇక రూపాయి పతనం వల్ల పెద్ద ముప్పేమీ లేనప్పటికీ.. గత కొద్ది నెలల్లో కరెన్సీ విలువ తీవ్రం గా పడిపోవడం అనేది ఆందోళనరమైన అంశమే. మొండిబకాయిల సమస్యకు ఆర్‌బీఐ చర్యలు, దివాలా చట్టంతో తగిన పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. ఎయిరిండియా ప్రైవేటీకరణకు మరికొంత సమయం పట్టొచ్చు’ అని జలాన్ పేర్కొన్నారు.