న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (సెప్టెంబర్ 30) ముగిసే నాటికి రూ.3,16,331 కోట్లుగా నమోదయినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు తెలిపారు. మొత్తం రుణాల్లో ఇది 3.09 శాతమని వివరించారు.
ప్రైవేటు రంగ బ్యాంకుల విషయంలో ఎన్‌పీఏలు రూ.1,34,339 కోట్లని తెలిపారు. మొత్తం రుణాల్లో ఇది 1.86 శాతంగా వివరించారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి... 2024 మార్చి 31 నాటికి 580 మంది ప్రత్యేక రుణగ్రహీతలు (వ్యక్తులు, విదేశీ రుణగ్రహీతలు మినహా), ఒక్కొక్కరు రూ. 50 కోట్ల కంటే ఎక్కువ రుణ బకాయిలను కలిగి ఉన్నారు. వీరిని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా వర్గీకరించాయి.
ప్రస్తుత దివాలా కేసుల తీరిది...
మొత్తం 1,963 సీఐఆర్‌పీ (కార్పొరేట్ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్) కేసులు కొనసాగుతున్నాయి. వాటిలో 1,388 కేసులు నిర్దేశిత (కేసుల పరిష్కారానికి) 270 రోజుల కాల పరిమితిని మించిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు దివాలా చట్టం కింద 1,068 కేసుల పరిష్కారం అయ్యాయి. తద్వారా బ్యాంకింగ్ సుమారు రూ. 3.55 లక్షల కోట్లను రికవరీ చేసింది. బ్యాంకులతో సహా రుణదాతల మొత్తం క్లెయిమ్ రూ. 11.45 లక్షల కోట్లు కాగా, మొత్తం లిక్విడేషన్ విలువ రూ. 2.21 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment