కొత్తా బ్యాంకులండీ..! | IDFC, Bandhan get RBI approval to start banks | Sakshi
Sakshi News home page

కొత్తా బ్యాంకులండీ..!

Published Thu, Apr 3 2014 1:04 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

కొత్తా బ్యాంకులండీ..! - Sakshi

కొత్తా బ్యాంకులండీ..!

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ద్వారాలు తెరిచింది. దేశంలో దశాబ్దకాలం తర్వాత మళ్లీ తొలిసారిగా బ్యాంకింగ్ లెసైన్స్‌లకు రెండు కంపెనీలను ఎంపికచేసింది. ప్రభుత్వ సంస్థలు ప్రమోట్‌చేసిన ఇన్‌ఫ్రా ఫైనాన్స్ కంపెనీ.. ఐడీఎఫ్‌సీ, కోల్‌కతాకు చెందిన మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌లకు లెసైన్స్‌లు ఇచ్చేందుకు ఆర్‌బీఐ బుధవారం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. లెసైన్స్‌ల జారీకి సంబంధించి ఆర్‌బీఐ ముందుకెళ్లొచ్చంటూ ఎన్నికల సంఘం(ఈసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మర్నాడే ఈ రెండు కంపెనీల పేర్లను ప్రకటించడం గమనార్హం. ఆర్‌బీఐ లెసైన్స్ అనుమతి గడువు 18 నెలలు ఉంటుంది.

 ఈలోగా ఎంపికైన రెండు సంస్థలు ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా కొత్తబ్యాంకుల ఏర్పాటుకు తగిన కసరత్తు అంతా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించాక పూర్తిస్థాయి(రెగ్యులర్) లెసైన్స్‌లను ఆర్‌బీఐ జారీచేస్తుంది. ఆతర్వాతే బ్యాంకింగ్ సేవలను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. కాగా, ఇప్పుడు లెసైన్స్‌లు రాని ఇతర దరఖాస్తుదారులు భవిష్యత్తులో విడుదల చేసే కొత్త మార్గదర్శకాల తర్వాత మళ్లీ లెసైన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది. మొత్తంమీద ఆర్‌బీఐ లెసైన్స్‌లు దక్కిన రెండు సంస్థలూ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లే కావడం విశేషం.

 ఇండియా పోస్ట్‌కూ అవకాశం...
 లెసైన్స్‌ల దరఖాస్తులను మదింపు చేసిన బిమల్ జలాన్ నేతృత్వంలోని అత్యున్నతస్థాయి కమిటీ.. ప్రభుత్వరంగంలోని ఇండియా పోస్ట్‌కు కూడా లెసైన్స్‌కు సిఫార్సు చేసింది. అయితే, ప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారా ప్రత్యేకంగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని  సూచించింది. దీనికి ఆర్‌బీఐ కూడా ఓకే చెప్పింది. అంటే ఇండియా పోస్ట్‌కు కూడా రానున్నరోజుల్లో లెసైన్స్ లభించే అవకాశాలు ఉన్నట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. గతేడాది జూలైలో ఆర్‌బీఐ కొత్త బ్యాంకింగ్ లెసైన్స్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా.. ప్రభుత్వ,  ప్రైవేటు రంగానికి చెందిన మొత్తం 27 కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే, ఆతర్వాత టాటా, వీడియోకాన్ గ్రూప్‌లు రేసు నుంచి వైదొలగడంతో 25 కంపెనీల దరఖాస్తులు మాత్రమే ఆర్‌బీఐ తుది పరిశీలనలో నిలిచాయి.

వీటిలో అనిల్ అంబానీ గ్రూప్, ఆదిత్యబిర్లా గ్రూప్, బజాజ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్, శ్రీరామ్ క్యాపిటల్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ తదితర దిగ్గజాలు పోటీపడ్డాయి. దాదాపు 4-5 వరకూ కొత్త లెసైన్స్‌లు ఇవ్వొచ్చని ఎక్కువమంది పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, కేవలం రెండు లెసైన్స్‌లకే(ఇండియా పోస్ట్‌తో కలిపితే మూడు) ఆర్‌బీఐ అనుమతించడం విశేషం.  ఆర్‌బీఐ తాజా నిర్ణయం దీర్ఘకాలంతర్వాత వెలువడిందని... దేశంలో మరిన్ని బ్యాంక్ శాఖల ఏర్పాటుకు దోహదం చేస్తుందని ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ సేవల విభాగం కార్యదర్శి జీఎస్ సంధు వ్యాఖ్యానించారు. కొత్త బ్యాంకుల ఏర్పాటువల్ల అందరికీ బ్యాంకింగ్ సేవల(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) విస్తరణకు బాటలు వేస్తుందని ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామమని, ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ రంగానికి మేలు చేకూర్చే నిర్ణయంగా దీన్ని ఆయన అభివర్ణించారు.

 సరిగ్గా పదేళ్లకు....
 చిట్టచివరిసారిగా 2003-04లో ఆర్‌బీఐ యస్‌బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లకు లెసైన్స్‌లు మంజూరు చేసింది. ఆతర్వాత మళ్లీ పదేళ్లకు మరో రెండు లెసైన్స్‌లు జారీ చేయడం గమనార్హం. ప్రస్తుత లెసైన్స్‌ల ప్రక్రియ 2010-11లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సారథ్యంలో మొదలైంది. మూడేళ్లతర్వాత ఇది సాకారమైంది. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వ రంగ, 22 ప్రైవేటు రంగ బ్యాంకులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటితోపాటు 56 రీజినల్ రూరల్ బ్యాంక్(ఆర్‌ఆర్‌బీ)లు, 41 విదేశీ బ్యాంకులు దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
 
 మాకు  బ్యాంకింగ్ లెసైన్స్ లభించడాన్ని మైక్రోఫైనాన్స్ రంగానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నాం. ఫైనాన్షియల్ సేవల కల్పనలో మారుమూల ప్రాంతాలకూ వెళ్లేలా మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి పేదవాళ్లకు పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలను అందించేందుకు మాకు అవకాశం లభిస్తుంది. మాకు ఇప్పటికే రూ.1,100 కోట్ల పెయిడ్ అప్ క్యాపిటల్ ఉంది(ఆర్‌బీఐ నిబంధన ప్రకారం రూ.500 కోట్లు ఉండాలి). మేం ఎక్కువగా బ్యాంకింగ్ సేవలు లేని గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టిపెట్టాం. ఇప్పుడు మేం నేరుగా బ్యాంకింగ్‌లోకి వస్తుండటం వల్ల మాకు పెద్దగా పోటీ కూడా ఉండదు. - చంద్రశేఖర్ ఘోష్, బంధన్ చైర్మన్
 
 లెసైన్స్ ఎట్టకేలకు లభించడంతో ఇక మేం పూర్తిస్థాయి బ్యాంకింగ్ సేవల కల్పన కోసం మరింత కష్టపడేందుకు సమాయత్తమవుతున్నాం. మేం యూనివర్సల్ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. దీనికి అనుగుణంగానే యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుపై మేం దృష్టిపెడతాం. ఇప్పటికే 21 శాతం టైర్-1 మూలధనం మాకుంది. దీనిప్రకారం చూస్తే దేశంలో అత్యుత్తమ మూలధనంతో ఏర్పాటవుతున్న తొలి బ్యాంక్ మాదే అవుతుంది. నేటి(ఏప్రిల్ 3) నుంచే మా వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నాం. ఇప్పటికే మేం బ్యాంకింగ్ సేవల కోసం సవివర ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. - రాజీవ్ లాల్, ఐడీఎఫ్‌సీ చైర్మన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement