సెన్సెక్స్ @ 22,550
వరుసగా పదో రోజు లాభపడటం ద్వారా మార్కెట్లు రొజుకో కొత్త రికార్డును సాధిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ మార్చి 20 నుంచి నిరవధికంగా పెరుగుతూ రాగా, సెన్సెక్స్ మార్చి 25న యథాతథంగా నిలిచి ఆపై లాభపడుతూ వచ్చింది. ఇంతక్రితం 2007 అక్టోబర్‌లో మాత్రమే ఇలా జరిగింది. కాగా, బుధవారం ట్రేడింగ్‌లో యథావిధిగా కొత్త రికార్డులు నమోదయ్యాయి. 105 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్ 22,551 వద్ద ముగియగా, 31 పాయింట్లు బలపడ్డ నిఫ్టీ 6,752 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 22,592, నిఫ్టీ 6,763 పాయింట్లను తాకాయి. వెరసి మరోసారి సరికొత్త శిఖరాలను అధిరోహించాయి.
ఇందుకు విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు దోహదపడగా, విదేశీ సానుకూల సంకేతాలు కూడా జత కలిశాయి. గత రెండు రోజుల్లో రూ. 1,329 కోట్ల విలువైన షేర్లను కొన్న ఎఫ్‌ఐఐలు బుధవారం మరో రూ. 595 కోట్లు పెట్టుబడిపెట్టారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 472 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. కాగా, ఎఫ్‌ఐఐలు గడిచిన వారం రూ. 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
హెల్త్‌కేర్, రియల్టీ జోరు
బీఎస్‌ఈలో ప్రధానంగా హెల్త్‌కేర్, రియల్టీ, ఆయిల్ ఇండెక్స్‌లు 1.5% చొప్పున పుంజుకోగా, ఎఫ్‌ఎంసీజీ అదే స్థాయిలో నష్టపోయింది. హెల్త్‌కేర్ షేర్లలో వోకార్డ్ 20% దూసుకెళ్లగా, స్ట్రైడ్స్ ఆర్కో, ర్యాన్‌బాక్సీ, అరబిందో, సిప్లా, బయోకాన్ 10-2% మధ్య జంప్ చేశాయి. రియల్టీలో యూనిటెక్, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, శోభా, ఇండియాబుల్స్, మహీంద్రా లైఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 6-2% మధ్య ఎగశాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో భారతీ, టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, ఆర్‌ఐఎల్, ఐసీఐసీఐ 3-1.5% మధ్య లాభపడగా, ఐటీసీ 2.3% పడింది.