'ఆర్‌బీఐ ముసుగులో అధికార దుర్వినియోగం'
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిబంధనలను కరెన్సీ సరఫరా అంశానికి కూడా వర్తించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రాష్ట్రానికి ఎంత కరెన్సీని ఏ ప్రాతిపదికన సరఫరా చేస్తున్నారో రిజర్వు బ్యాంకు స్పష్టత ఇవ్వాలన్నారు.
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో లబ్ధి పొందేందుకు కరెన్సీని ఎక్కువగా సరఫరా చేయడం ఎన్నికల నిబంధనలను కేంద్రం ఉల్లంఘించడమే అవుతుందని ఆయన ఆరోపించారు. రిజర్వు బ్యాంకును అడ్డుపెట్టుకుని మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. బ్యాంకులకు కరెన్సీ సరఫరా, కరెన్సీ ముద్రణకు సంబంధించిన గణాంకాలను ఇవ్వాలన్న దరఖాస్తులను భద్రతా కారణాల రీత్యా ఇవ్వలేమని రిజర్వు బ్యాంకు చెప్పడమంటే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని శశిధర్ రెడ్డి అన్నారు.