ముంబై: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–2020) రూ.1,76,051 కోట్ల నిధుల బదలాయింపు జరగనుంది. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోకి కమిటీ సిఫారసులకు సోమవారం సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో తాజా నిధుల బదలాయింపు జరుగుతోంది. సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న అదనపు నిల్వల్లో ఎంతమొత్తం కేంద్రానికి బదలాయించాలన్న అంశంపై సిఫారసులు చేయడానికి జలాన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే.
ప్రకటన సారాంశమిది...
‘‘కేంద్రానికి రూ.1,76,051 కోట్ల బదలాయింపు జరగాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో రూ.1,23,414 కోట్లు 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగులు (డివిడెండ్). మిగిలిన రూ.52,637 కోట్లు సవరిత ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఈసీఎఫ్) ప్రకారం గుర్తించిన అదనపు ప్రొవిజన్లకు సంబంధించినది (అర్‌బీఐ అదనపు నిల్వలకు సంబంధించినది)’’ అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ద్రవ్యలోటుకు మందు!
ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టడి విషయంలో జలాన్ కమిటీ సిఫారసులు కేంద్రానికి ఎంతో సానుకూల అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. 2019–2020 మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు 3.4 శాతం (రూ.7.03 లక్షల కోట్లు) ఉండాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి (ఏప్రిల్,మే,జూన్) రూ.4.32 లక్షల కోట్లకు చేరింది. అంటే తాజా గణాంకాలు చూస్తే, ద్రవ్యలోటు నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యంలో జూన్ నాటికే 61.4 శాతానికి చేరిందన్నమాట.
ద్రవ్య లోటును కేంద్రం ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు గతంలో చర్చనీయాంశం అయ్యాయి. ఆర్‌బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి.
ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న ఆర్‌బీఐ బోర్డ్ నిర్ణయించింది. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్‌లో మాజీ ఆర్‌బీఐ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ ఆరుగురు కమిటీ కూడా ఏర్పాటయ్యింది. నిజానికి ఈ కమిటీ జూన్‌నెల చివరికల్లా నివేదిక సమర్పిస్తుందని భావించినా, కొన్ని భేదాభిప్రాయాల వల్ల నివేదిక సమర్పణ వాయిదా పడుతూ వచ్చింది.
జలాన్ కమిటీ నాల్గవది...
గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్‌బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.
ఆర్‌బీఐ బొనాంజా!
Published Tue, Aug 27 2019 5:05 AM | Last Updated on Tue, Aug 27 2019 12:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment