![Good news for SBI home loan borrowers](/styles/webp/s3/article_images/2025/02/16/SBI%5D.jpg.webp?itok=giqPDd9b)
ఈబీఎల్‌ఆర్ 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఎస్‌బీఐ
దీనితో తగ్గనున్న ఈఎంఐల భారం
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణ గ్రహీతలకు తీపి కబురు చెప్పింది. రుణ రేట్లను తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటన పేర్కొంది. దీనితో గృహ రుణ గ్రహీతలకు ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ల (ఈఎంఐ) భారం తగ్గనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఇటీవలే పావుశాతం తగ్గించిన నేపథ్యంలో (6.5 శాతం నుంచి 6.25 శాతానికి) ఎస్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. తగ్గించిన రేట్లు ఇలా...
→ వివిధ రుణాలకు వర్తించే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేట్ (ఈబీఎల్‌ఆర్), అలాగే రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) 25 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) తగ్గించింది. ఈ తగ్గింపు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.
→ అయితే బ్యాంక్ మార్జినల్ కాస్ట్–బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్‌ఆర్), బేస్ రేట్, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్‌ను (బీపీఎల్‌ఆర్) యథాతథంగా కొనసాగించింది.
రెపో ఆధారిత రుణల విషయానికి వస్తే...
రెపో ఆధారిత రుణ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) ప్రత్యక్షంగా రెపో రేటుకు అనుసంధానమై ఉంటుంది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో ఈ రేటు 8.75 శాతం నుంచి 8.50 శాతానికి తగ్గుతుంది. దీనితో ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌కు అనుసంధానమైన గృహ, వాణిజ్య రుణాలు తగ్గుతాయి.
ఆకర్షణీయం..
ఈబీఎల్‌ఆర్ లేదా ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌కు అనుసంధానమైన రుణ గ్రహీతల రుణ నిబంధనలను బట్టి వారి ఈఎంఐలు లేదా రుణ వ్యవధి తగ్గుతుంది. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపుతో గృహ రుణాలను మరింత ఆకర్షణీయంగా చేస్తూ, ఈబీఎల్‌ఆర్, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను ఎస్‌బీఐ తగ్గించడం కస్టమర్లకు ప్రయోజనం కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ తగ్గిన రుణ రేటు ప్రయోజనాలు పొందడానికి మార్జినల్ కాస్ట్ రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్) కస్టమర్లు తక్కువ వడ్డీరేటు రుణ విధానానికి మారవలసి ఉంటుంది.
‘రుణ’ పునఃపరిశీలనకు సూచన...
తాజా రుణ రేట్లు, సంబంధిత పరిణామాల నేపథ్యంలో కొత్త రుణగ్రహీతలు రుణదాతను (బ్యాంక్) ఎంచుకునే ముందు వివిధ బ్యాంకుల రుణ రేట్లను సరిపోల్చుకోవాలని, వారి సామర్థ్యానికి అనువైన రుణ రేట్లను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రుణగ్రహీతలు తప్పనిసరిగా తమ రుణ ఒప్పందాలను సమీక్షించుకోవాలని వారు సూచిస్తున్నారు.
అవసరమైతే రీఫైనాన్సింగ్ ఎంపికలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. సెంట్రల్ బ్యాంక్ రెపో తగ్గింపు నేపథ్యంలో కెనరా బ్యాంక్, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు కూడా తమ రెపో ఆధారిత రుణ రేటును పావు శాతం తగ్గించాయి. ఈ బ్యాంకుల నుండి గృహ రుణ గ్రహీతలు తమ ఈఎంఐలను అలాగే రుణ చెల్లింపు వ్యవధి కాల పరిమితులను సమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈబీఎల్‌ఆర్ అంటే?
ఈబీఎల్‌ఆర్ అంటే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్. ఎస్‌బీఐ 2019 అక్టోబర్ నుంచి తన ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను అనుసంధానించడానికి ఈబీఎల్‌ఆర్‌ను ప్రామాణికంగా తీసుకుంది. దీనితో అన్ని ఫ్లోటింగ్ రేట్ హోమ్ లోన్‌లకు వడ్డీ రేట్లు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమవుతాయి. తాజా నిర్ణయంతో గృహ రుణ ఫ్లోటింగ్ రేట్లు తగ్గుతాయన్న మాట. దీనితోపాటు ఈబీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన అన్ని వ్యక్తిగత ఇతర రిటైల్ రుణాలు సైతం దిగివస్తాయి. తాజా నిర్ణయం ప్రకారం ఈబీఎల్ ఆర్ 9.15% నుంచి 8.90 శాతానికి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment