Fund transfer
-
బీసీసీఐ... ప్రకటించిన నజరానా ఇవ్వండి: ఏఐసీఏపీసీ
ముంబై: భారత దివ్యాంగుల క్రికెట్ జట్టుకు ప్రకటించిన నజరానా మొత్తాన్ని విడుదల చేయాలని అఖిల భారత వికలాంగుల క్రికెట్ సంఘం (ఏఐసీఏపీసీ) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని కోరింది. ఇంగ్లండ్ గడ్డపై గతేడాది భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు టి20 వరల్డ్ సిరీస్ నెగ్గింది. బీసీసీఐ వారికి ప్రోత్సాహకంగా రూ. 65 లక్షల నజరానా ప్రకటించింది. ఈ మార్చి 4న దివ్యాంగుల జట్టు కెప్టెన్ విక్రాంత్ కెనీకి బోర్డు అధ్యక్షుడు గంగూలీ ఈ చెక్ అందజేయగా... డబ్బు మాత్రం ఇంకా ఆటగాళ్ల ఖాతాలోగానీ, ఏఐసీఏపీసీ ఖాతాలోగానీ బదిలీ చేయలేదు.దీనిపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. కొన్ని ప్రతికూల అంశాలతో పాటు, లాక్డౌన్ వల్ల బోర్డు కార్యకలాపాలకు ఏర్పడిన అంతరాయం వల్లే నిధుల మంజూరు జరగలేదని, త్వరలోనే నగదు విడుదల చేస్తామని చెప్పారు. -
ఆర్బీఐ బొనాంజా!
ముంబై: కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–2020) రూ.1,76,051 కోట్ల నిధుల బదలాయింపు జరగనుంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోకి కమిటీ సిఫారసులకు సోమవారం సెంట్రల్ బ్యాంక్ బోర్డ్ ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో తాజా నిధుల బదలాయింపు జరుగుతోంది. సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న అదనపు నిల్వల్లో ఎంతమొత్తం కేంద్రానికి బదలాయించాలన్న అంశంపై సిఫారసులు చేయడానికి జలాన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ప్రకటన సారాంశమిది... ‘‘కేంద్రానికి రూ.1,76,051 కోట్ల బదలాయింపు జరగాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. ఇందులో రూ.1,23,414 కోట్లు 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగులు (డివిడెండ్). మిగిలిన రూ.52,637 కోట్లు సవరిత ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఈసీఎఫ్) ప్రకారం గుర్తించిన అదనపు ప్రొవిజన్లకు సంబంధించినది (అర్బీఐ అదనపు నిల్వలకు సంబంధించినది)’’ అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ద్రవ్యలోటుకు మందు! ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టడి విషయంలో జలాన్ కమిటీ సిఫారసులు కేంద్రానికి ఎంతో సానుకూల అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. 2019–2020 మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు 3.4 శాతం (రూ.7.03 లక్షల కోట్లు) ఉండాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి (ఏప్రిల్,మే,జూన్) రూ.4.32 లక్షల కోట్లకు చేరింది. అంటే తాజా గణాంకాలు చూస్తే, ద్రవ్యలోటు నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యంలో జూన్ నాటికే 61.4 శాతానికి చేరిందన్నమాట. ద్రవ్య లోటును కేంద్రం ఎలా పూడ్చుకుంటుందనే అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ద్రవ్యలోటు సమస్యను అధిగమించేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు గతంలో చర్చనీయాంశం అయ్యాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న ఆర్బీఐ బోర్డ్ నిర్ణయించింది. శక్తికాంత్ దాస్ గవర్నర్ అయ్యాక డిసెంబర్లో మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ‘నిధుల బదలాయింపుపై’ ఆరుగురు కమిటీ కూడా ఏర్పాటయ్యింది. నిజానికి ఈ కమిటీ జూన్‌నెల చివరికల్లా నివేదిక సమర్పిస్తుందని భావించినా, కొన్ని భేదాభిప్రాయాల వల్ల నివేదిక సమర్పణ వాయిదా పడుతూ వచ్చింది. జలాన్ కమిటీ నాల్గవది... గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉఫా థోరట్ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. -
ఆధార్ లేకున్నా నగదు బదిలీ
సందేహాలుంటే టోల్‌ఫ్రీ నంబర్ 18002333555కు ఫోన్ చేయాలి గ్యాస్డీలర్లకు బ్యాంకుఖాతా నంబర్లు ఇస్తే సరి పౌరసరఫరాల శాఖ సూచన సాక్షి, హైదరాబాద్: నగదు బదిలీకి ఆధార్ తప్పనిసరి కాదని, బ్యాంకుఖాతా ఉంటే సరిపోతుందని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఈ నెల 15 నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం కానున్న ఎల్పీజీ (వంట గ్యాస్) నగదు బదిలీకి సంబంధించి వినియోగదారులకు ఎలాంటి అనుమానాలున్నా టోల్‌ఫ్రీ నెంబర్ 18002333555ను సంప్రతించవచ్చని వివరించింది. రాయితీ వివరాలు తెలుసుకునేందుకు మొబైల్ ద్వారా ‘స్టార్ 99స్టార్ 99యాష్’కి కాల్ చేసి తెలుసుకోవచ్చని తెలిపింది. గురువారం పౌరసరఫరాల శాఖ కమీషనర్ సి.పార్థసారథి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ హైదరాబాద్‌లో సమావేశమైంది. దీనికి హైదరాబాద్ సీఆర్ఓ, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌తో పాటు పథకం అమలు కానున్న మూడు జిల్లాల డీఎస్ఓలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఆధార్ కన్వీనర్ తదితరులు హాజరయ్యారు. నగదు బదిలీ మార్గదర్శకాలు, వాటిని వినియోగదారులకు వివరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల సంఖ్యను పెంచే చర్యలపై ఇందులో చర్చించినట్టు అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పార్థసారథి తెలిపారు. ఎల్పీజీ కనెక్షన్‌కు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాల్లో జమ అవుతుందని వెల్లడించారు. ఆధార్ సంఖ్య లేకున్నా బ్యాంక్ అకౌంట్ డీలర్‌కు ఇస్తే, బ్యాంక్‌ఖాతాలో రాయితీ జమ అవుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో రాయితీ లేకుండా సిలిండర్ ధర రూ.952 ఉండగా ఇందులో ప్రభుత్వం ఇచ్చే రాయితీ రూ.508 నేరుగా వినియోగదారుని ఖాతాలో జమ అవుతుందని వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరి 14 వరకు పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా తొలి మూడునెలలు రాాయితీ ధరకే సిలిండర్ ఇస్తారన్నారు. ఫిబ్రవరి 15 తర్వాత మూడు నెలలపాటు రాయితీని వెంటనే ఇచ్చేందుకు ఆస్కారం లేదని, బ్యాంకుఖాతా ఇచ్చిన అనంతరమే మొత్తం రాయితీని బ్యాంకు ఖాతాల్లో వేస్తారని తెలిపారు. ఒకవేళ రాయితీ మొత్తం తప్పుడు ఖాతాల్లోకి వెళ్లినా బ్యాంకులను సంప్రతించి తిరిగి తమ రాయితీని పొందవచ్చన్నారు. సిలిండర్లు అక్రమమార్గం పట్టకుండా చూసేందుకు, డిమాండ్‌ను కొంత తగ్గించేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు. వినియోగదారులు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని డీలర్, వెబ్సైట్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు ఫోన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా వంటగ్యాస్ నగదు బదిలీకి సంబంధించిన పోస్టర్‌ను పార్థసారథి ఆవిష్కరించారు.