సందేహాలుంటే టోల్‌ఫ్రీ నంబర్ 18002333555కు ఫోన్ చేయాలి
గ్యాస్‌డీలర్లకు బ్యాంకుఖాతా నంబర్లు ఇస్తే సరి
పౌరసరఫరాల శాఖ సూచన
సాక్షి, హైదరాబాద్: నగదు బదిలీకి ఆధార్ తప్పనిసరి కాదని, బ్యాంకుఖాతా ఉంటే సరిపోతుందని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఈ నెల 15 నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం కానున్న ఎల్‌పీజీ (వంట గ్యాస్) నగదు బదిలీకి సంబంధించి వినియోగదారులకు ఎలాంటి అనుమానాలున్నా టోల్‌ఫ్రీ నెంబర్ 18002333555ను సంప్రతించవచ్చని వివరించింది. రాయితీ వివరాలు తెలుసుకునేందుకు మొబైల్ ద్వారా ‘స్టార్ 99స్టార్ 99యాష్’కి కాల్ చేసి తెలుసుకోవచ్చని తెలిపింది. గురువారం పౌరసరఫరాల శాఖ కమీషనర్ సి.పార్థసారథి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ హైదరాబాద్‌లో సమావేశమైంది. దీనికి హైదరాబాద్ సీఆర్‌ఓ, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌తో పాటు పథకం అమలు కానున్న మూడు జిల్లాల డీఎస్‌ఓలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఆధార్ కన్వీనర్ తదితరులు హాజరయ్యారు. నగదు బదిలీ మార్గదర్శకాలు, వాటిని వినియోగదారులకు వివరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాల సంఖ్యను పెంచే చర్యలపై ఇందులో చర్చించినట్టు అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పార్థసారథి తెలిపారు. ఎల్‌పీజీ కనెక్షన్‌కు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తే రాయితీ నేరుగా ఆ ఖాతాల్లో జమ అవుతుందని వెల్లడించారు. ఆధార్ సంఖ్య లేకున్నా బ్యాంక్ అకౌంట్ డీలర్‌కు ఇస్తే, బ్యాంక్‌ఖాతాలో రాయితీ జమ అవుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో రాయితీ లేకుండా సిలిండర్ ధర రూ.952 ఉండగా ఇందులో ప్రభుత్వం ఇచ్చే రాయితీ రూ.508 నేరుగా వినియోగదారుని ఖాతాలో జమ అవుతుందని వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరి 14 వరకు పథకంలో చేరకపోయినా, బ్యాంక్ ఖాతా, ఆధార్ సంఖ్య ఇవ్వకపోయినా తొలి మూడునెలలు రాాయితీ ధరకే సిలిండర్ ఇస్తారన్నారు.
ఫిబ్రవరి 15 తర్వాత మూడు నెలలపాటు రాయితీని వెంటనే ఇచ్చేందుకు ఆస్కారం లేదని, బ్యాంకుఖాతా ఇచ్చిన అనంతరమే మొత్తం రాయితీని బ్యాంకు ఖాతాల్లో వేస్తారని తెలిపారు. ఒకవేళ రాయితీ మొత్తం తప్పుడు ఖాతాల్లోకి వెళ్లినా బ్యాంకులను సంప్రతించి తిరిగి తమ రాయితీని పొందవచ్చన్నారు. సిలిండర్‌లు అక్రమమార్గం పట్టకుండా చూసేందుకు, డిమాండ్‌ను కొంత తగ్గించేందుకు ఈ విధానం దోహదపడుతుందన్నారు. వినియోగదారులు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని డీలర్, వెబ్‌సైట్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులకు ఫోన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా వంటగ్యాస్ నగదు బదిలీకి సంబంధించిన పోస్టర్‌ను పార్థసారథి ఆవిష్కరించారు.
ఆధార్ లేకున్నా నగదు బదిలీ
Published Fri, Nov 14 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement