దాదాపు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. కానీ చెక్కులను పెద్దగా ఉపయోగించరు. వాటిలో చాలా మందికి వివిధ రకాల చెక్కుల గురించి తెలియదు . అటువంటి వాటిలో ఒకటే క్రాస్ చెక్ (Cross Cheque). ఇటాంటి చెక్ పై వైపున ఎడమ మూలలో రెండు గీతలు గీస్తారు. ఈ గీతలు ఎందుకు గీస్తారో తెలుసా? నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం క్రాస్ చెక్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 (Negotiable Instruments Act)లోని సెక్షన్ 123 ప్రకారం.. ఇలాంటి చెక్ జారీ చేసిన వ్యక్తి ఇది క్రాస్డ్ చెక్ అని చెక్ ఎగువన ఎడమ మూలలో రెండు లైన్లతో బ్యాంక్‌కి సూచిస్తారు. ఈ రకమైన చెక్కుతో బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకునేందుకు వీలుండదు. చెక్‌ను క్రాస్ చేయడం వలన నేరుగా డబ్బు విత్ డ్రా కాకుండా చెక్ పొందిన వ్యక్తి లేదా సూచించిన ఇతర వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీని కోసం చెక్ వెనుక భాగంలోవారి సంతకం అవసరం.
క్రాస్ చెక్ రకాలు
అయితే క్రాస్ చెక్‌లలోనూ అనేక రకాలు ఉన్నాయి. మొదటిది సాధారణ క్రాసింగ్. అంటే ఇప్పటిదాకా చెప్పుకొన్న అంశాలన్నీ ఈ రకం కిందకు వస్తాయి. రెండోది ప్రత్యేక క్రాసింగ్. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 124 ప్రకారం.. చెక్ గ్రహీత నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలోకి వెళ్లాలని డ్రాయర్ కోరుకున్నప్పుడు ప్రత్యేక క్రాసింగ్ చెక్‌ను జారీ చేస్తారు.ఉదాహరణకు గ్రహీత ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నట్లయితే, చెక్కు దిగువన ఉన్న పంక్తుల మధ్య దాని పేరును వ్రాయడం ద్వారా డ్రాయర్ బ్యాంక్‌ను పేర్కొనవచ్చు.
ఇక చెక్‌పై క్రాసింగ్ లైన్‌ల మధ్య "అకౌంట్ పేయీ" అని రాసినట్లయితే, గ్రహీత మాత్రమే దాని నుండి డబ్బును విత్‌డ్రా చేయగలరని అర్థం. అయితే, ప్రత్యేక క్రాసింగ్‌తో నిర్దిష్ట బ్యాంకును పేర్కొన్నట్లయితే, డబ్బు ఆ బ్యాంకుకు మాత్రమే వెళ్తుంది. ఇది నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లో స్పష్టంగా పేర్కొననప్పటికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank)తో సహా అనేక బ్యాంకులు దీనిని అనుసరిస్తున్నాయి.
క్రాస్డ్ చెక్కులను ఎందుకు జారీ చేస్తారంటే..
క్రాస్‌డ్ చెక్‌ల జారీ వెనుక ఉద్దేశం ఏమిటంటే, ఉద్దేశించిన గ్రహీత ఆ మొత్తాన్ని అందుకున్నారని నిర్ధారించుకోవడం. ఆ చెక్కు తప్పుడు చేతుల్లోకి వెళ్లినా.. అందులో నుంచి డబ్బులు తీసుకోలేరు. తద్వారా దాని భద్రతను (Cheque Security) పెంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment