సాక్షి, హైదరాబాద్: ‘డబ్బుల్దేముంది.. కుక్కను కొడితే రాల్తాయి..’అంటుంటారు. ఈ బడాయి మాటలకేం గానీ.. మీ కుక్కను ముద్దు చేసి, ముస్తాబు చేసి, ఆ మురిపాల ముచ్చట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం నికరంగా నాలుగు రాళ్లయితే మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చి పడతాయి. పోనీ మీకు గ్రామసింహం లేదా? మరేం ఫర్వాలేదు.. మీ పిల్లి మాతల్లి వయ్యారాలను, కళ్లు మూసుకుని ఆ మార్జాల మహారాణి వేసే దొంగ వేషాలను రీల్స్‌గా, షార్ట్స్‌గా షూట్ చేసి పోస్ట్ చేసినా మీకొచ్చేది వస్తుంది. ముందు మీ పెట్ (పెంపుడు జంతువు) నలుగురి కళ్లలో పడుతుంది. వెనకే ఫాలోవర్స్ వెంటపడతారు. వాళ్లను చూసి ప్రొడక్ట్ ప్రమోటర్స్ మిమ్మల్ని ఫాలో అయిపోతారు.
కంటెంట్‌ని బట్టి పేమెంట్
పెట్ అకౌంట్ ఓపెన్ చేయగానే ‘డబ్బే డబ్బు’.. ‘వద్దంటే డబ్బు’అనేంతగా వెంటనే ఏమీ వచ్చిపడదు కానీ, అంతకన్నా ఎక్కువగానే ఒక ‘పెట్ ఇన్‌ఫ్లుయెన్సర్’గా కొన్నాళ్లకు మీకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు మీకు ఒక్కో పోస్టుకు రూ. 5,000 నుంచి రు.15,000 వరకు పెట్ కేర్ బ్రాండ్స్ నుంచి వచ్చేలా చేస్తుంది. మీ పెట్ ఎంత పాపులర్ అయితే మీకంత పేమెంట్. అబ్బా.. మూగజీవులతో ఏం చెప్పిస్తాం, ఏం మెప్పిస్తాం అనుకోకండి. మీలో కంటెంట్ ఉంటే చాలు.. వాటికి మాటలు వచ్చేసినట్లే. మరి మాలో క్రియేటివిటీ ఉండొద్దా అంటారా? ఆ సంగతి మీ పెట్స్‌కి వదిలి పెట్టండి. అవి ఇచ్చే క్యూట్ ఫీలింగ్స్‌తో మీలోంచి ఒక్క క్రియేటివిటీ ఏంటి.. మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కెమెరా, స్టార్ట్, యాక్షన్ అన్నీ తన్నుకొచ్చేస్తాయి.
వెయ్యికి పైగా అకౌంట్లు
ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టెక్ ప్లాట్‌ఫామ్ ‘కోరజ్’డేటా ప్రకారం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇండియాకు చెందినవి 1,200 వరకు యాక్టివ్ పెట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అకౌంట్లు ఉన్నాయి. వెయ్యికి పైగా ఫాలోవర్స్, 12,000కు పైగా లైకులు, ఒక పోస్టుకు సగటున 1,30,000 వ్యూస్ ఉండే ఈ అకౌంట్లు.. 100 కోట్ల డాలర్ల విలువైన భారతీయ పెట్ కేర్ మార్కెట్‌లో ఇప్పుడు ఒక భాగం. వీటిలో ‘ఆస్కార్’అనే అకౌంట్ పేరు కలిగిన ఐదేళ్ల వయసున్న గోల్డెన్ రిట్రీవర్ జాతి శునకానికి ఇన్‌స్ట్రాగామ్ హ్యాండిల్‌లో 2,49,000 మంది ఫాలోవర్‌లు ఉన్నారు.
రీల్‌కు రూ.15,000 వరకు!
ఇండియాలోనే ఓరియో, నిక్కి, మిల్లీ, డూడిల్, పాపిన్స్, సింబా, నిఫ్టి, జోయ్ అనేవి మంచి పేరున్న పెట్ అకౌంట్లు. ‘కారా బెల్’అనే క్యాట్ (పిల్లి) ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఇన్‌స్ట్రాగామ్‌లో 15,400 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పర్షియన్ జాతి పిల్లి ఫ్యాషన్‌లో హొయలు ఒలికిస్తూ, అందంలో అధునాతనాన్ని చిలికేస్తూ, ఆరోగ్యానికి టిప్స్‌ని అందిస్తూ ఉంటుంది. ‘నల’, ‘మీను’అనే క్యాట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు కూడా మంచి గుర్తింపు ఉంది. 15,000–50,000 మధ్య ఫాలోవర్స్ ఉన్న ఏ పెట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కైనా ఒక రీల్‌కు, షార్ట్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వస్తుంది. డబ్బే కాదు, ఉచితంగా పెట్ కేర్ ప్రొడక్ట్‌లు కూడా లభిస్తాయి. పెట్ కేర్ బ్రాండ్స్ తమ ప్రమోషన్ కోసం పోస్ట్‌కి ఇంత అని చెల్లిస్తాయి.
పెట్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలంటే..!
పెట్ ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలంటే మొదట మీ పెట్‌కు (కుక్క, పిల్లి, ఇతర పెంపుడు జంతువులు ఏవైనా) కెమెరాను అలవాటు చేయండి. ఆ తర్వాత మీరనుకున్న థీమ్‌ను బట్టి పెట్‌కు అవసరమైన హంగుల్ని, ఆర్భాటాలను తగిలించండి. నిద్ర లేచినప్పుడు, ఆవలిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, స్నానం చేయిస్తున్నప్పుడు, దుస్తులు తొడిగాక, జర్నీలో మీతో పాటు ఉన్నప్పుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ వాటి ఫీలింగ్స్‌ని కెమెరాలోకి లాగేసుకోండి. కాప్షన్ పెట్టి నెట్‌లోకి వదిలేయండి. అందులో ఏదైనా సామాజిక సందేశం అంతర్లీనంగా ఉంటే మరీ మంచిది. ఫాలోవర్స్ పెరుగుతారు. స్పాన్సరర్‌లు వచ్చేస్తారు. పెట్ మూడ్ బాగోలేనప్పుడు మాత్రం షూట్ పెట్టుకోకండి.
Comments
Please login to add a commentAdd a comment