కొత్త బ్యాంక్ లెసైన్స్‌లకు లైన్ క్లియర్!
ఆర్‌బీఐకి జలాన్ కమిటీ నివేదిక
న్యూఢిల్లీ: కొత్త బ్యాంకింగ్ లెసైన్సుల జారీ అంశంపై ఏర్పాటైన బిమల్ జలాన్ కమిటీ మంగళవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)కి నివేదిక సమర్పించింది. బ్యాంకు లెసైన్సులు పొందేందుకు అర్హత కలిగిన సంస్థల పేర్లను కూడా ఈ నివేదికతో పాటు అందించింది. ఆర్‌బీఐ వర్గాలతో సుమారు నాలుగు గంటల సేపు జరిగిన భేటీ అనంతరం ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఈ విషయం తెలిపారు. కొత్త బ్యాంకులకు లెసైన్సులు ఇవ్వడానికి సంబంధించి 2013 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే.
27 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో టాటా సన్స్, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, బజాజ్ ఫైనాన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. అయితే, ఆ తర్వాత టాటా సన్స్ వంటి కొన్ని కంపెనీలు ఉపసంహరించుకున్నాయి. ఈ బ్యాంకు లెసైన్సుల దరఖాస్తులను పరిశీలించేందుకు ఆర్‌బీఐ జలాన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్, సెబీ మాజీ చైర్మన్ సీబీ భవే తదితరులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. మార్చి ఆఖరుకల్లా కొత్త బ్యాంకులకు లెసైన్సులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆశావహుల జాబితాలో ఉన్న ఐడీఎఫ్‌సీ షేరు మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో 1.75%, ఎల్‌ఐసీ హౌసింగ్ షేరు 3% మేర లాభపడ్డాయి. గడిచిన 20 ఏళ్లలో 2 విడతలుగా ప్రైవేట్ రంగంలో 12 బ్యాం కులకు ఆర్‌బీఐ లెసైన్సులు ఇచ్చింది. చివరిసారిగా 2003-04లో కోటక్ మహీంద్రా బ్యాంకు, యస్ బ్యాంకులకు లెసైన్సులు లభించాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 27, ప్రైవేట్ రం గంలో 22 బ్యాంకులు ఉండగా.. 56 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి.