న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిధుల నిర్వహణపై మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ (ఎకనమిక్ కమిటీ ఫ్రేమ్‌వర్క్) మంగళవారం మొట్టమొదటిసారి సమావేశమయ్యింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఏ స్థాయిలో ఉండాలి? అంతకన్నా ఎక్కువగా ఉండే నిధులను ఎలా బదలాయించాలి? ఏ పరిమాణంలో కేంద్రానికి డివిడెండ్ చెల్లించాలి? వంటి అంశాలను నిర్ణయించడానికి గత నెల చివర్లో ఈ కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. కమిటీ సమావేశమయిన 90 రోజుల్లో నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ రాకేష్ మోహన్ ఈ కమిటీకి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ గార్గ్, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్‌ఎస్ విశ్వనాథన్‌తో పాటు భరత్ దోషి, సుధీర్ మన్కడ్ ఈ కమిటీలో సభ్యులు. ఆర్‌బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి.
నేపథ్యం ఇదీ...
పన్ను వసూళ్లు తగ్గిన నేపథ్యంలో–భారత్ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కట్టుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభమై మార్చి 2019తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలకు వచ్చేసరికే ద్రవ్యలోటు బడ్జెట్ నిర్దేశాలను(3.3%) దాటిపోయింది. ప్రస్తు ఆర్థిక సంవత్సరం మొత్తంలో ద్రవ్య లోటు కొరత రూ. లక్ష కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ మిగులు నిల్వల్లో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందని వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి. ఈ వార్తల నేపథ్యంలో–డిసెంబర్ 10న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. దీనికనుగుణంగా బిమల్ జలాన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటయ్యింది.
గతంలో కమిటీలు ఇలా...
గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉషా థోరట్ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. ఆర్‌బీఐ థోరట్ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది.
కేంద్రం కోరుకుంటోంది ఎంత?
ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు సమాచారం.
టోకెనైజేషన్‌పై ఆర్‌బీఐ మార్గదర్శకాలు
ముంబై: సురక్షితమైన కార్డు లావాదేవీల నిర్వహణ కోసం ఉద్దేశించిన టోకెనైజేషన్‌కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మంగళవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం ఆథరైజ్డ్ కార్డ్ నెట్‌వర్క్ మాత్రమే టోకెనైజేషన్, డీ–టోకెనైజేషన్ కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఈ సేవల కోసం కస్టమరు ప్రత్యేకంగా చార్జీలు చెల్లించనక్కర్లేదు. ప్రస్తుతం మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్‌కి మాత్రమే ఈ సదుపాయం పరిమితమవుతుందని, ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మిగతా డివైజ్‌లకు వర్తింపచేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఆర్థిక లావాదేవీల్లో అసలైన డెబిట్, క్రెడిట్ కార్డుల స్థానంలో ప్రత్యేక కోడ్ (టోకెన్) ఉపయోగించే విధానాన్ని టోకెనైజేషన్‌గా వ్యవహరిస్తారు. పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మి నల్స్ (పీవోఎస్), క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్ తరహా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులకు ఇది ఉపయోగపడుతుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ), మ్యాగ్నెటిక్ సెక్యూర్ ట్రాన్స్‌మిషన్ (ఎంఎస్‌టీ) ఆధారిత కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు, ఇన్–యాప్ పేమెంట్స్, క్యూఆర్ కోడ్ మొదలైన మాధ్యమాల్లో టోకెనైజ్డ్ కార్డు లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment